Monday 11 March 2019

జూ పార్కులో ఓ ఆదివారం...




ప్రయాణం అంటే ఏదో ఆరాటం, ఎక్కడికన్నా వెళ్ళి తీరాలన్న ఆలోచన మెదడులోకి రాగానే... ఇక ఇంట్లో పనేం అయ్యింది, ఇంకా ఎంత చేయాలి అనే ఆలోచన వీసమెత్తయినా లేకుండా ఒకటే పరుగు.. ఇందులో ఆదివారం శెలవు కంగారుగా మరీ ముందుకు తోస్తుంది. ఇదంతా ఒకెత్తయితే... హైదరాబాద్ వచ్చాకా ఈ ఏడేళ్ళలో నెహ్రూ జూ పార్క్ చూడలేదన్నది మరో వైపు ఈ కంగారుకి కారణం అయ్యింది. అందులోనూ మా బుల్లి మెహెర్ కాస్త పెద్దాడు అయ్యాడు కదా వాడికి జంతువులను చూపించాలనే తపన. వాడు వాటిని చూసి మురిసిపోతుంటే వాడి కళ్ళల్లో చిన్నగా మొదలై, నెమ్మదిగా పెద్దవైన ఆశ్చర్యానందాలు చూడాలని, మా ఆయన, నేను ఉదయాన్నే బయలుదేరాం, ఆ.. ఉదయం అంటే మరీ ఉదయం కాదులెండి కాస్త ఎండెక్కింది.
మా వాడు రథానికి ముందు వాడే రథ సారథి అన్న ఫీలింగ్ తో నుంచున్నాడు. నేను సరేసరి. ఇక మా ఆయన నేనే ఈ ఇద్దరినీ గమ్యానికి సురక్షితంగా చేర్చేవాడిని అన్న భాధ్యతను హెల్మెట్ గా తలకెత్తుకుని రథానికి సారధ్యం వహించాడు.




ఇక ఇక్కడ నేను చేసిన పనేమంటే... నాకు గత నాలుగేళ్ళుగా నిరంతరాయంగా సేవలందించి, అలిసి, మాట్లాడితే స్విచ్ ఆఫ్ అవుతున్న నా సెల్ ఫోనుకు ఫుల్ చార్జింగ్ పెట్టి కేవలం ఫొటోలకే వినియోగించాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను. అందుకే మా అత్తగారు ప్రసాదించిన రేడియోని మా ఆయనగారి కళ్ళపడకుండా బండి వరకూ తెచ్చేసాను. ఇక నాలుగంతస్తులు దింపేస్తే ఆయన కాదనలేరు కదా అనే ధైర్యం. అంటే (మళ్ళీ మెట్లు ఎక్కాలి కదా సరే పదా అంటారనే ధైర్యం) ఊ.. మొత్తానికి మా రథం ముందుకు విజయంగా కదిలింది.

గతవారం ఇలానే ఆహా ఇంత కన్నా ఎక్కువగా బిస్ కెట్లు, అరటిపళ్ళు ఇలా తినడానికి అన్నీ సర్ధుకుని మరీ ఈ జూపార్క్ కి బయలుదేరాం. మా వారు గూగుల్ మేప్ సహాయాన్ని అర్థించి రూట్ కనుక్కున్నారు... సరే ప్రయాణం అయిన సంబరంలో భోజనాలు బయటే తినేసి జూపార్కు గేటువరకూ వెళ్ళిన మాకు పార్క్ సోమవారం సెలవు అనే బోర్డ్ మాత్రమే కనిపించింది. తీవ్రమైన విచారాన్ని, నిరాశను నా ముఖంలో చూసి చార్ మినార్ మీదుగా తీసుకువచ్చారు మావారు. అది మరోసారి చెపుతాగానీ...

గత వారం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఒక బాటిల్ నీళ్ళు తప్ప మరేమీ కూడా తీసుకుపోలేదు నేను. దారంతా నేను తెచ్చిన రేడియో సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. ప్రయాణించాం మేం వెళ్ళేసరికి లోపలికి జనాలను పంపుతున్నారు. మా ఇంటి నుండీ అరగంట మాత్రమే సమయం పట్టింది. ముందుగా చేపలు ఉండే వైపు వెళ్ళాం. చాలా పెద్ద గాజు తొట్టెల్లో ఎన్నో రకాల చేపలను పెంచుతున్నారు. ఎంత బావున్నాయో... వాటిని చూసి పక్కనే ఉన్న కోతుల దగ్గరకు వెళ్ళాం.. ఎన్నో రకాల కోతులు ఎన్నో జాతులు అన్నీ ఎండకు సేదతీరుతున్నాయి.

వాటిని చూసి కాస్త నడిచేటప్పటికి మా బుల్లి మెహెర్ అలసిపోయాడు. కారులో అయితేనే వస్తానుగానీ నడిచి రానంటాడే...పైగా వాళ్ళ నాన్న ఎత్తుకున్నా సరే నాకు కారే కావాలంటాడు. బద్దకం ఇక్కడి నుండే మొదలు.. సరే కాస్త దూరం వెళ్ళాం..కానీ నాకు నచ్చలేదు. ఏందుకొచ్చాం..కాస్తన్నా తిరిగి చూడనీయరా.. ఎందుకు కంగారు.. అంటూ తిట్టుతున్నాను. ఈలోపు సైకిల్స్ కనిపించాయి. అబ్బా సైకిల్స్ మనమూ తీసుకుందాం అంటే మా ఆయన వాటికి వెనక కేరేజ్ ఉండవు. మనవాడు ఎక్కడ కూచుంటాడు. వద్దు అనేసాడు. సరే కానీ అని ఊరుకున్నా.. ఈ లోపు ఆయనకూ అలుపొచ్చి ఒక సైకిల్ తీసుకుని మాకు ఐస్ క్రీం తీసుకువచ్చాడు. అబ్బా ఎన్నాళ్ళయింది సైకిల్ ఎక్కి ఎలాగన్నా తొక్కాలి అనుకున్నాను. కాదు తొక్కేయాలంతే... ఆలోచన వచ్చింది గానీ, చుట్టూ ఉన్నాళ్ళంతా నవ్వుతారనే భయం. ఇక మా ఆయన రోడ్డు మీద తొక్కవే అన్నాడు. నేను తొక్కలేననే అన్నాడేమో.. కానీ నేను తొక్కుతుంటే అందంగా వీడియో తీసాడు, ఫొటోలు కూడా.. ఇక మా వాడైతే నన్ను చూసి కిల కిలమని ఒకటే నవ్వు..చాలా ఏళ్ళయ్యింది. సైకిల్ తొక్కి. భలే ఇవిపించింది.  తరవాత కాసేపు నేను, బుల్లోడు పెద్ద గన్నేరు చెట్ల నీడలో చున్నీ పరుచుకుని పడుకున్నాము.

ఇక ఇందులో నచ్చిన అంశాలన్నీ చెపుతూపోతే చాలా చెప్పాలి. కొంగలు, చింపాంజీ, మొసళ్ళు, జింకలు, ఎనుగులు, జిరాఫీ, ఎలుగుబంటి....ఇలా చాలా చూసాం.. ఇందులో కాస్త ముఖ్యమైనవే చెప్పుకొస్తాను. ఊ.. ఓ చోట పెద్ద నాగుపామును ప్రదర్శించారు. అది ఇలా జనాల మీదకు తీసుకొస్తే, ఒక్కసారిగా భయమేసింది. చాలా పెద్దగా ఉంది. అక్కడి నుండీ పాములు ఉండే వైపు వెళ్ళాం అక్కడ ఎన్ని రకాల పాములో.. అందులో రక్తపింజర పాములకి కూలర్ పెట్టి మరీ చూసుకుంటున్నారు. వాటిని చూస్తే భలే భయం వేసింది. ఎంతైనా పాములు కదా అవి మన మీదకు వస్తాయనే భయం ఉంటుంది కదా... కానీ ఎందుకో వాటి మీద జాలేసింది.
అన్నీ తిరిగి చూసేసరికి అందరికీ నీరసం వచ్చింది. ఎవరికీ నడవాలని లేదు. మా బుజ్జి మెహెర్, పెద్దమెహెర్ ఇద్దరూ వాలిపోయారు.. ఇక ఇంటికి వెళిపోవాలని అనుకున్నాం. అలా నడుచుకుంటూ.. గేటువరకూ వచ్చేసాం. గేటుకు కాస్త దూరంలో మౌంటెన్ లో నల్లని బాతులు పెద్ద మెడలతో భలే అందంగా ఉన్నాయి. అవి అలా తిరుగుతుంటే అలా చూడాలనిపించింది.

నెమ్మదిగా అక్కడి నుండీ ఇంటికి ప్రయాణం కట్టాం... అయితే పార్క్ లో ప్రయాణించామనే ఆనందం, కొత్త చోటును చూసామన్న ఆహ్లాదం అన్నీ ఉన్నాయ్ గానీ.. అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువులను బంధించి ఇలా తెచ్చి వాటిని రక్షిస్తున్నారా.. లేక వాటికి అక్కడ ఉండే స్వేచ్ఛను హరిస్తున్నారా.. ఇదే తెలీలేదు. మా మెహెర్ ఇదేం తనకు నచ్చలేదన్నాడు. ఇక మా బుడ్డోడికి ఈ ఉక్కలో, చిరాకులో జంతువులను చూడాలనే యావే లేకపోయింది.  ఇక నా సంగతికి వస్తే, మా మెహెర్ చెపితేనే కానీ వెలగని ఏ ఆలోచనా.. ఇప్పుడు వెలిగి అవును కదా పక్షులు స్వేచ్ఛగా ఎగరడానికి లేకుండా ఉన్న ఈ కంచెలు వాటి స్వేచ్ఛను హరిస్తున్నట్టే కదా అని అనిపించి కించిత్ భాధను, ఆలోచనను కలిగించాయి. ఏదో మొత్తానికి ఆ ప్రదేశం మరీ మాలా ఆలోచించే వాళ్ళకు నచ్చడం కష్టమే అనిపించింది.. అదీ సంగతి...


1 comment:

  1. ఒక్క జూ లోనే కాదు, సర్కస్‌లో మాట విని బల్లలెక్కి కూర్చునే పులుల్ని చూసినా, స్టూల్స్ మీద నిలబడే ఏనుగుల్నీ, వీధుల్లో ఆడించబడే కోతుల్నీ, పాముల్నీ - చూసినా అలాంటి బాధే! మీలాంటి ఆలోచనే! మీ బ్లాగ్రాతలు చాలా బావున్నాయి. తరచుగా రాస్తుండండి వీలైతే!

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...