బాల్యం ఓ మధురమైన జ్ఞాపకంమే అందరికీ.. నాకూ అంతే
ప్రతి క్షణాన్ని నాకు నచ్చినట్టు గడిపింది బాల్యంలోనే..(అంటే ఇప్పుడు అందుకు
తక్కువేం కాదులెండి ఇప్పుడూ మనదే రాజ్యం) ఎవరినీ లెక్కచేయనితనం, మాట్లాడితే అలగడం,
పారిపోవడం, నన్ను వెతుక్కునే వరకూ దాకోవడం ఇవన్నీ చేసేదాన్నిచిన్నతనంలో.... ఇక
అబ్బాయిలనైతే చాలా ఏడిపించేదాన్ని. ఎవరన్నా నా చెల్లెళ్ళ వైపుకు వచ్చారా ఇక అంతే
వెంటాడి కొట్టేదాన్ని. ఇన్ని కళలు మనలో ఉన్నాయని గుర్తించిన పిరికిపందలంతా నాకు
రౌడీరాణీ, గజ్జలగుర్రం అనే పేర్లు ఇచ్చారు. సరే ఇదేదో బావుంది. అమ్మనాన్నా పెట్టిన
పేరు కాకుండా అంతా మనల్ని ప్రత్యేకించి పిలుస్తున్నారే అని..నేనూ
పిలిపించుకునేదాన్నికూడా. ఇదంతా అలా ఉంచితే..
నాకు సైకిల్ అంటే మహా ఇష్టం అదీ రెండు చేతులూ
వదిలేసి గాల్లో తేలిపోతూ సైకిస్ తొక్కడం తెగ ప్రాక్టీసు చేసి పారేసాను. అంతే
వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ సైకిల్ గురించి చెప్పాలని అనిపించింది ఎందుకంటే ఈ
మధ్యనే మళ్ళీ సైకిల్ ఎక్కాను. ఎంత నచ్చిందో.. అసలు నేను తొక్కగలనా.. అంతా నన్ను
చూసి నవ్వుతారేమో.. ఇలా అనిపించిన నాకు, మా ఆయన నా “దిల్
కి దడ్ కన్” తొక్కవే అనగానే మరింత బలం వచ్చేసింది. అలా
గాలిలో తేలుతూ వెళిపోతుంటే అబ్బా.. ఏం ఉందిలే.. నాకు బండి వచ్చు.. అది నడుపుతున్నా
రాని కిక్ సైకిల్ ఇస్తుంది. చిన్నతనంలో నాన్నగారిని ఎక్కించుకుని తొక్కేదాన్ని..
అప్పుడప్పుడూ దానిమీదనే మగపిల్లలతో పోటీ పెట్టుకుని మరీ తొక్కేదాన్ని. పశువులకి
దాణా 50 కేజీలు సైకిల్ కి కట్టుకుని నాన్నగారితో సమానంగా ఇంటికి వచ్చేదాన్ని. ఇక
గడ్డి మోపు సైకిల్ కి కట్టి తెచ్చేదాన్ని. ఇదంతా చేయడానికి నాలో మగపిల్లాడిలా
పెరగాలనే ధోరణి ఎక్కువ కావడమే... ఇప్పటికీ ఉన్నదేమో తెలీదు..
మా నాన్నగారు అస్తమానూ అనేవారు నువ్వే మగపిల్లాడివి
అయితే ఇంత మందిని కనాల్సిన పనే ఉండేదికాదురా... నువ్వే నన్ను చూసుకోవాలి అని. “ఆడపిల్లను
అయితే ఏం నాన్నగారు నేను చూసుకుంటాను” అంటే.. ఆ.. ఏం చూసుకుంటావ్.. మా ఇంట్లో
ఉండవుగదరా అనేవాళ్ళు...ఎందుకో నాలో ఈ మాటలు బలంగా నాటుకుపోయాయ్.. అవును నేను
మగపిల్లాడినే.. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ వెళ్ళను. అనుకునేదాన్ని. ఏంటో అన్ని
పిచ్చి ఆలోచనలు అలా జరిగితే ఇది జీవితం ఎందుకు అవుతుంది. సరే వదిలేయండి.
చిన్నతనంలో చాలా సరదాగా, చిలిపిగా అందరినీ
ఆటపట్టిస్తూ ఉండేనేను. మగపిల్లాడిలా ఉండాలని నిర్ణయించుకున్నాకా.. మొదటిగా చేసింది
చదవడం మానేయడం. అవును ఎప్పుడు చూడు ఫలానా శాంతి ఎక్కడుందిరా అంటే గ్రౌండ్ లో అనే
చిరునామా సంపాదించాను. ఎప్పుడూ మగపిల్లలతో ఆటలు ఆడేదాన్ని. అదీ ఫుడ్ బాల్. కబాడ్డీ,
కోకో, ఇలా ఆడి అలిసిపోయి స్కూలు వదిలే సమయానికి మామూలుగా ఇంటికి వెళిపోయేదాన్ని.
ఇక నాగురించి ఇంట్లో అమ్మకు,
మిగతావాళ్ళు చెప్పే ధైర్యం ఎప్పుడూ చేసేవారు కాదు. పైగా నేను గొప్ప చదువరినని
వాళ్ళ ఆలోచన. అయితే నేనెప్పుడూ నేను గొప్పగా చదివేస్తానని నమ్మకాన్ని వాళ్ళకు
కలిగించాలి అనుకునే దాన్ని కాదు. ఆ మాత్రం నేనేంటో నాకు తెలుసు. ఎందుకు వాళ్ళ
ఆలోచనను నమ్మకాన్ని పాడుచెయ్యాలి అనుకునేదాన్ని.
ఇలా ఉండగా ఓరోజు మాతాతగారు. స్వర్గీయ నాయుడు
సూర్యనారాయణ గారు ఆయన రిటైర్ మెంట్ డబ్బులలో నాకు ఓ లేడీ హీరో సైకిల్ కొనిచ్చారు.
అయితే నేను సైకిల్ కొంటారంటే మగాళ్ళదే అనుకున్నాను. ఇదేమే చిన్నపిల్లల సైకిల్ సరే
ఇక వద్దంటే నా తరవాతి దానికి ఇచ్చేస్తారని ఊరుకుని తీసుకున్నాను.
కానీ అందరిలా (మగాళ్ళలా) గొప్పగా ఊగుతూ తొక్కాలే..
ఇదేమో అంతలా తొక్కడానికి ఏం కనిపించడం లేదు. సరేనని దాన్నే కాస్త ఫ్యాషన్ గా
తొక్కేదాన్ని.
నా తరవాతది కాస్త బుద్దిమంతురాలు చదువంటే
ప్రాణం.. ఎప్పుడు చూడు పుస్తకాల గోలే. దాన్ని అంత బుద్దిగా చదువుకోడం చూడటం
నచ్చేది కాదు. సరేలే తన గురించి మరోసారి చెపుతాను. ఓ రోజు తనకి ట్యూషన్ కి టైం
అవుతుంది అంది. అప్పుడు ఉదయం 6 అవుతుంది. దానికి నేనన్నా, నా సైకిల్ ప్రయాణమన్నా
చాలా భయం పాపం పిచ్చిది అడిగింది. సరే మన ప్రతాపం చూపించాలని చాలా గట్టిగా,
స్పీడుగా నడుపుతూ పోతుంటే ఇక ట్యూషన్ కొంత దూరంలో ఉందనగా ఎత్తు నుండీ వస్తూ చేతులు
వదిలేసి తొక్కాను, అంతే ఇద్దరం కింద పడిపోయాం. నేను మొండిదాన్ని దులిపేసుకుని లేచి
నించున్నాను. పాపం అది బక్కది లేవలేక ఏడిచేసింది. నన్ను ముట్టుకోవద్దని
తిట్టుకుంటూ, కుంటుతూ ఇంటికి వెళిపోయింది. ఇక ఆ సాయంత్రం బక్కదానికి జ్వరం
వచ్చేసింది. మా అమ్మకు నాన్నకు నా మీద ఎక్కడలేని కోపం వచ్చేసింది. నాన్నగారు చింత
బరిక అందుకున్నారు నేను మా ఇంటి వెనుక చోటా జంగిల్ వైపు పరుగందుకున్నాను......
No comments:
Post a Comment