Wednesday, 27 March 2019

ఒక లవ్ జంట, లవ్ జంట....


ఏయ్.. సరోజా ఈ గాజులు ఏలా ఉన్నాయో చెప్పనే లేదు. బావున్నాయ్ కదా..

ఊ.. బావున్నాయ్..

మరి ఈ చెప్పులు?”

అవీ బావున్నాయ్...

అసలు ఎక్కడివే ఇవన్నీ... ఎప్పుడు కొన్నావ్..

అదా.. అది.. మా నాన్నగారు కొన్నారే..

నిజమా.. సరే నేను అడుగుతాలే అంకుల్ ని..

వద్దే.. ఫ్లీజ్ అడగద్దు..

నిజం చెప్పేస్తా.. రవీ ఇచ్చాడే..ఎవరితోనూ చెప్పకు.. చెప్పనని ప్రామిస్ చెయ్య్.. ఫ్లీజ్

ఊ.. అలారా దారికి..

.......

మా క్లాసులోని తింగరి బుచ్చి జాబితాలో రమా కూడా చక్కగా కుదిరిపోతుంది. మనసు, మనిషి రెండూ బంగారమే.. పచ్చని ఛాయ, బొద్దుగా..ముద్దుగా కుదమట్టంగా ఉండే రమా అంటే ఎవరికీ పెద్దగా తెలీదు. ఏదో ఇంట్లో వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి స్కూలుకి వచ్చేది. చదువు విషయం ఏలా ఉన్నా.. రోజంతా అది వేసుకునే తెల్లచొక్కా మాత్రం మాసిపోకుండా నలిగిపోకుండా భద్రంగా చూసుకునేది.

దానితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఓపికా, ధైర్యం, తెగువలాంటివి నాకే ఉన్నాయ్.. ఎందుకంటే అది ప్రేమలో పడిన సంగతి తెలిసిన, ధైర్యవంతురాలిని, ఒక్కగానొక్క స్నేహితురాల్ని నేనే. ఏదైనా సమస్య వస్తే నేను కాపాడేస్తాననే ధీమాలో ఉండేది. నా తరవాత ఈ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు.

ఎదుగుతున్న ఆడపిల్ల, గట్టుతెగిన గోదారి రెండూ ప్రేమ, పల్లం వైపుకే మళ్ళినట్టు.. ప్రతి ఆడపిల్లా కోరుకునే ప్రేమ నేరమెందుకు అవుతుందో ఈ పెద్దాళ్ళకు. ఇంత ప్రేమలో కూరుకుపోతే ఇక చదువు మీదకు ఏం పోతుంది మనసు. ఎప్పుడూ కరెంట్ షాక్ తగిలినట్టు, జ్వరం వచ్చి లంకణాలు చేసినట్టు ఉండే దాని ఫెసు వందకేండిల్ బల్బులా మెరిసిపోవడం ఒక్క నాకే తెలుసు. ఇలాంటి రహస్యాలను దాయడం అసలు చేతకాని నన్నే దాయమని చెప్పిందే. చాలా కష్టంగా ఉంది. ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. తను ప్రేమిస్తున్న సంగతి తెలుసు..కానీ ఎవరికీ చెప్పకూడదు.. హబ్బా ఇది మాత్రం చాలా కష్టమైన పని..

ఓసారి అనుకోకుండా ఊళ్ళోకి వెళ్ళాను. అక్కడ నేనంటే ఇష్టపడే ఇంకో స్నేహితురాలికి ఈ విషయం దాచుకోలేక చెప్పేసాను. అది ఎంత ఆశ్చర్యపోయిందంటే.. ఇప్పుడే ఇంటిమీదకు ఉప్పెన పొంగి కొంప ముంచేస్తుందేమోనన్నంత కంగారు పడిపోయింది. ఇక అప్పటి నుంచీ రోజూ వీలు చిక్కినప్పుడు  రవీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏడిపించడం. రవీ వాళ్ళకి ఓ షాప్ ఉంది. అందులో అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్ముతారు. అబ్బాయిగారు అలా ఏదో కొనడానికి వెళ్ళిన మా రమాను బుట్టలో వేసుకున్నారు. రమా అంటే అందరికీ మంచి అభిప్రాయం, తను ఇంటి దగ్గర తల వంచితే మళ్ళీ స్కూల్లోనే ఎత్తేది. అలాంటిది ప్రేమలో ఉన్నదని తెలిస్తే నమ్మేవాళ్ళు ఎవరు.. పోనీలే ఇదీ మంచిదే..

మా అల్లరి భరించలేక మా నోరు మూయించడానికి షాపులో వస్తువులు తక్కువ ధరలకే ఇచ్చేవాడు. అన్నీ ఇచ్చి వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో మాకు చెప్పాలని చూసేవాడు.
ఓ సాయంత్రం ఇద్దరూ గుడికి వారగా ఉన్న సందులో కలుసుకుని తెగ మాట్లాడేసుకున్నారు. అంతసేపు ఏం మాట్లాడావే.. అంటే తెగ సిగ్గుపడిపోయింది తప్ప ఏం చెప్పలేదు రమా. తన చేతిలో ఉన్న ముత్యాల గొలుసు చూపించి మురిసిపోయింది. ప్రేమిస్తే ఇవన్నీ ఇస్తారని తెలిస్తే నేనే ప్రేమించేదాన్ని కదా అంటే ఛా అలా అనకే తను నీకు అన్నయ్య అనేది..

ఈ ప్రేమ కథ కంచికి చేరుతుందనే నమ్మకం లేదు నాకు. ఎందుకంటే ఇద్దరి కులాలూ వేరు. ఇక పెద్దాళ్ళు ఊళ్ళో పరువు ప్రతిష్టలకు పెద్దపీటలు వేసిమరీ కూర్చున్నవాళ్ళు. ఎటుచూసినా కథకు శుభం కార్డు పడుతుందంటే నమ్మకం కుదరటంలేదు. నువ్వు అనుకునేది జరగదని ఎంత చెప్పినా వినేదికాదు రమా. లేదే రవీ అలా కాదు. నాకోసం అంతా వదులుకుని వస్తాడు అనేది.

.........

ఈలోపు నేను పొరుగూరు వెళిపోయాను. తన ప్రేమ సంగతి ఏం అయ్యి ఉంటుందిలే అందరి ప్రేమికుల్లా ఇంకో పెళ్ళిలో పాత ప్రేమను తలుచుకుని కుమిలిపోతూ ఉంటారులే అనుకున్నాను.
సరిగ్గా నాలుగేళ్ళకు అదే ఊళ్ళో ఓ పెళ్ళికి వెళ్ళిన నాకు పెద్దంచుచీరలో తలనిండా పూలు తురుముకుని గుడి వెనక సందులోంచి నడిచి వస్తూ కనిపించింది రమా.. నేనసలు గుర్తు పట్టలేనంగా మారిపోయింది. ఇరవై కూడా లేని మనిషి నలభై అన్నట్టు ముదిగా పెద్దగా కనిపించింది.

మునుపటి కాంతి లేదు ముఖంలో.. చిన్నగా చిక్కిన ఒళ్ళు.. కాస్త పొట్టతో సన్నబడి కనిపించింది. చూడగానే పలకరించాను. చాలా ఆనందపడింది. అడగాలా వద్దా అనుకుంటూనే మీ వారేం చేస్తారు అన్నాను.

మా ఆయనా... నవ్వేసింది.

అవును మీ ఆయనే..

ఎందుకు నవ్వు

రవీని మీవారంటే నవ్వు వచ్చిందే.. అంది.

చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి నువ్వూ, రవీ పెళ్ళి చేసుకున్నారా..

నమ్మలేనట్టు ముఖం పెట్టాను.

అవునే.. మేం ఇద్దరమే పెళ్ళి చేసుకున్నాం.. అంది.

ఒక్కసారిగా ఎంతో ఆనందం కలిగింది..

అంటే మీ పెద్దాళ్ళంతా మీ పెళ్ళికి ఒప్పుకున్నారా.. అంటే

నేనేదో అనేలోపు తనే అందుకుని.. లేదే అంతా వదిలేసారు.

ఇప్పుడు మాకు ఇద్దరు బిడ్డలు.. మా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు ఎవరూ పట్టించుకోవడం లేదు. మా బ్రతుకులు మావి. నేను కడుపుతో ఉన్నా మావాళ్ళుగానీ, వాళ్ళ వాళ్ళు గానీ ఎవరూ రాలేదు. అంతెందుకు రెండోవాడికి కాస్త నలతచేసి వారం రోజులు హాస్పటల్ లో ఉన్నాం. స్నేహితులు వచ్చి పలకరించారుగానీ.. బంధువులు ఎవరూ రాలేదు.. చాలా బాధేసింది.

ఏమో ఇకపై కలుపుకుంటారన్న ఆశ కూడా నాకు లేదు.

పోనీలేవే..కోరుకున్నవాడినే పెళ్ళిచేసుకున్నావ్.. నేనైతే ఎప్పటికీ ఈ పెళ్ళి జరగదనే అనుకున్నాను.మీరు భలే సాధించారు.

చాల్లే.. అసలు పెళ్ళి అవుతుందనే నమ్మకమే లేదు మాకు. పంతాలకు పోయి మమ్మల్ని విడగొడతారనుకున్నాం. కానీ మాకు పెళ్ళి చేసి వాళ్ళు విడిగా ఉన్నారు. చాలా పెద్ద గొడవలే జరిగాయ్. ఏమైనా మేము కలిసే ఉండాలని బలంగా అనుకున్నాం. చాలా కష్టాలు పడ్డామే.. ఇప్పుడు నేను, రవీ, మా ఇద్దరు బిడ్డలతో సంతోషంగానే ఉన్నాం. ఒక్క పెద్దాళ్ళు దూరం పెట్టారన్న బాధ తప్పా...

తనతో మాటల్లో ఉన్న నాకు దూరంగా ద్వజస్థంభం వీధి మలుపు దాటి సైకిల్ మీద వస్తున్న రవీ కనిపించాడు.
*

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...