Monday, 25 March 2019

ఆల్విన్ xరోడ్స్...



ఉద్యోగం పురుష లక్షణం అని ఎవరన్నారో... ఆ మాట తప్పు.. ఉద్యోగం స్త్రీ, పురుషులిద్దరి లక్షణం అని నేనంటాను. ఉదయాన్నే పిల్లల్ని, భర్తనీ హడాముడిగా స్కూళ్ళకి, ఆఫీసులకీ సాగనంపేసి, ఇక అక్కడి నుండీ ఫోను చూసుకుంటూ, సోది చెప్పుకుంటూ, సీరియళ్ళ బాధల్లో మునిగిపోయి, ఆసమ్మా,బోసమ్మ కబుర్లలో తేలి, ఇంటికి భర్త అలిసిపోయి వచ్చే వరకూ ఆగి అప్పుడు నువ్వు నన్ను మరిచిపోయావ్.. నేనంటే నీకు ఇష్టం లేదంటూ వాణ్ణి వేపుకుతినే భార్యలకన్నా, ఉద్యోగం చేసే భార్యలే మిన్న.

భర్తకి కావల్సినవి చూసి, ఉన్న సమయంలోనే పిల్లల్ని పట్టించుకుని, ఉదయాన్నే తాను రఢీ అయ్యి ఆఫీసుకు వెళుతుంది.. అక్కడ తనకో బుల్లి ప్రపంచం. చుట్టూ, మనల్ని చూసేవాళ్ళు, మనం చూసేవాళ్ళతో ఎంత బావుంటుంది. అదిగో అలా వెళుతున్నప్పుడే నాకు రోజుకో కథ కనబడుతుంది.

నా ఆఫీసు కొండాపూర్, రోజూ ఉదయం యూసఫ్ గూడాలో ఆల్విన్Xరోడ్స్ బస్ ఎక్కుతాను. దాదాపు నలభై నిముషాల తర్వాత గానీ కూర్చోడానికి సీటు దొరకదు. వేలాడుతూ, ఒకరిమీద ఒకరం పడి మరీ వెళ్ళాలి. ఎంత కుక్కి తీసుకుపోతారంటే ఎవరూ పైన సపోర్ట్ కోసం ఏమీ పట్టుకోనవసరం ఉండదు. అంత రద్దీ.

బస్సులో సీట్లు ఆడవారికి తక్కువే. ఒక్కోసారి ప్రతి పదిమంది మగాళ్ళకీ ఆరుగురే ఆడపిల్లలు ఉన్నారంటారే ఆమాట ఇలా ఈ బస్సు చూసి చెప్పండి అని అడగాలనిపిస్తుంది.
అందులో వికలాంగులకు, వయో వృద్ధులకు సీట్లు ఇచ్చారు. ఇక అందులో కూర్చునే వృద్ధులు ఎప్పుడు లేస్తారా మాకు ఎప్పుడు సీటు వస్తుందా అని ఎదురుచూస్తామా.. ఇంతలో మా ఆశ గమనించినట్టు, చేతిలో సంచినో, బేగ్గునో పదే పదే సర్దుకుంటారు. ఓహో వీళ్ళు లేస్తున్నారని అనుకుని, సీటు దొరుకుతుందని ఆశపడితే ఏదీ లేవరే.. అంతా మా భ్రమ..

ఏదో మెట్రో వచ్చిందికదా కాస్త కష్టాలు తీరతాయ్.. ఈ సాఫ్ట్ వేర్ ప్రజలంతా మెట్రోలో వెళిపోతారనుకున్న మా కలలన్నీ కల్లలే అయ్యాయి. మళ్లీ కథ మామూలే.. అదే తోపులాట, అదే కిక్కిరిసిన ప్రయాణం.

ఈరోజు అంతే.. జూబ్లీహిల్స్ దాటాకా ఎక్కింది ఆమె.. తెల్లని వంటి ఛాయ, నుదుటిలో సింధూరం, మెడలో మందంగా బంగారు గొలుసు, చేతికి వాచి, కాటన్ చీరలో ముదురు లక్ష్మీదేవిలా ఉంది. బస్సు మాధాపూర్ దాటేదాకా ఆమెకు సీటు దొరకలేదు. కాసేపటికి వయోవృద్ధుల సీటులో ఆమెకు చోటు దొరికింది. మరో మగ వ్యక్తి పక్కన కూర్చోవడం కాస్త ఇబ్బందిగా ఉందన్నట్టు ముఖం పెట్టింది. అతను కాస్త జరిగి కిటికీ పక్కన చోటిచ్చాడు. నెమ్మదిగా అతనికి తగలకుండా అటు జరిగి కిటికీ వైపు కూర్చుంది.

ఆరడుగుల పొడవు, అతని వయసును తల వెంట్రుకలు ఎక్కువని చెపుతున్నాయిగానీ, శరీరం దృఢంగానే ఉంది. చెవికి బంగారు పోగులు, వెనుక ఉన్న చిన్న ముడి విప్పి ఉంది. నుదుటికి తిరుచూర్ణంతో నామాలు, ఫేంటు, షర్టు, చేతిలో బరువైన బేగ్గు.. ఆమె పక్కన కాస్త జరిగి కూర్చున్నాడు.
బస్సు హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఆయాసం తీర్చుకుంటుంది. 

కాస్త ఈ కిటికీ ఓపెన్ చేస్తారా నెమ్మదిగా అడిగింది ఆమె ఓ.. తప్పకుండాకూర్చునే నెట్టి చూసాడు. జరగలేదు. ఈసారి పైకి లేచి, ఆమె మీదకు వంగుతూ, కాస్త గట్టిగా రెండు చేతులతో అద్దాన్ని జరిపాటు.. బరువుగా కదిలి ఆగింది. ఇకపై నెట్టినా వెళ్ళలేదు. పరవాలేదు చాల్లెండి అంది ఆమెతిరిగి తన సీట్లో కూర్చుంటూ, చిన్నగా నవ్వాడు. ప్రతిగా ఆమె పెదాలపైన చిన్న నవ్వు. ఆ ముదురు ముఖానికి ఆ నవ్వు దానికి మరింత అందానిస్తూ, బుగ్గమీద చిన్న చొట్ట. అతను ఎక్కడివరకూ వెళుతున్నారు అన్నాడు. కొత్తగూడ వరకూ వెళ్ళాలి. అంది ఆమె.

మరి మీరు.

నేను కాస్త ముందు దిగుతాను. అన్నాడు.

ఆఫీసుకా..

అవునండి,

మరి మీరు..

స్నేహితురాలి ఇంటికి వెళుతున్నాను.

ఓ.. మంచిది.

కాసేపు ఇద్దరిమధ్యా మౌనం. శిల్పారామంలో బస్సు బరువు దింపుకుని తేలిక పడి, తిరిగి బయలుదేరింది. ఇద్దరూ ఇద్దరి గురించి మాట్లాడుకున్నారు. అందులో ఇవి అని ఖచ్చితంగా చెప్పలేని మాటలే అన్నీ..

ఇంతలో కొత్తగూడాకి ముందు సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది. తన ఒళ్ళో ఉన్న బరువైన బ్యాగ్ కుడిచేతిలోకి తీసుకుంటూ.. "వెళ్లోస్తానండి" అన్నాడు. ఆమె మళ్ళీ నవ్వింది. బస్సుదిగి, ఆగి ఉన్న బస్సులోని ఆమెను చూసి చేయి ఊపాడు. మళ్ళీ ఆమె నవ్వింది. అతను వెనక్కు తిరిగి సందులోకి మళ్లాడు. బస్సు కదిలింది. మలుపు దాటి వీధిలో నడిచి వెళుతున్న అతన్ని వెనుక నుంచి చూస్తూ ఉండిపోయింది ఆమె.

4 comments:

  1. ఆఫీస్ కి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఊపుకుంటూ వెళ్ళి బండెడు చాకిరీ చేసి ఇంటికి వచ్చి పిల్లలని చూసుకుంటూ భర్తకి సేవచేసుకుంటూ అత్తమామలని పూజిస్తూ తరించిపోతున్నారా ఉద్యోగినులు ?
    ఉద్యోగం పురుష లక్షణమే భరించు వారే భార్యలు !

    ReplyDelete
  2. :) ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే.. చాకిరీ ఏలా ఎవరు చేసినా... ఇద్దరూ సమానమే..అతను, ఆమె ఇద్దరూ కలిసి నడిస్తేనే చక్కని సంసారం..కానీ ఇంట్లో ఉండే స్త్రీకి, బయటి ప్రపంచాన్ని దగ్గరగా చూస్తున్న స్త్రీకీ వ్యక్తిత్వంలో చాలా తేడా ఉంది.

    ReplyDelete
  3. ఈ పోస్ట్ లో మీరు ఏం చెప్పదలుచుకున్నారో అర్ధం కాలేదు. ఇంట్లో ఉండే స్త్రీకి బయటి తిరిగే స్త్రీ కి వ్యక్తిత్వంలో తేడా ఒకటే పురుష లక్షణాలు బోనస్ ! ఉద్యోగినులమీద సదభిప్రాయమే ఉంది. మా తరంలో ఇంట్లో ఉంటే చాలనుకున్నారు. ఇపుడు ఉద్యోగం చేసి తీరాలంటున్నాం. ఎందుకూ ? ఆ టీవీ సీరియళ్ళ బారిన పడకూడదనే...బస్సులో జబర్దస్త్ ప్రోగ్రాం యూట్యూబ్ లో చూస్తున్న ఉద్యోగినులపై మీ అభిప్రాయం ఏమిటీ ?

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారు నమస్తే, నేను ప్రత్యేకించి ఏదీ చెప్పాలని రాయడం లేదండి. నాకు ఈ క్షణం ఏం అనిపిస్తుందో అదే రాస్తున్నాను. మీరు అన్నరే సెల్ పట్టుకుని బస్సులో కూర్చున్న స్త్రీలు లేరా అని అలాంటివారూ ఉన్నారు. మారుతున్న జీవన విధానంలో రోజుకోలా మారుతున్న మనుషుల వింత పోకడలు నచ్చని వారూ ఉన్నారు. నావరకూ నేను ఫోన్ రోడ్డు మీద నడిచి వెళుతున్నప్పుడు మాట్లాడను, కదిలే బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, చేతిలో పట్టుకుని ప్రయాణించను. అది ఎక్కడో బ్యాగ్ లో ఉంటుంది. తిరిగి నేను ఓ స్థిరమైన చోటుకు వచ్చాకనే ఫోన్ తీసి మాట్లాడతాను. ఎవరి అలవాట్లు, పోకడలు వారివి.

      Delete

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...