రామకృష్ణ మాస్టారు చాలా మంచాయన. మాస్టారంటే ఒక్క
పాఠాలు చెప్పడమేకాదు. ఆయనలో అంతా ఆశ్చర్యపోయే ఎన్నో కళలు దాగున్నాయి. సకల కళావల్లభుడు
అంటారే ఆయనకు ఆపేరు ఇట్టే సరిపోతుంది. మనిషి పొట్టిగా కాస్త నల్లగా ఉన్నా, మనసు
ఎంతో మంచిది. తక్కువ కులం వాడినని సంఘం తనమీద చిన్న చూపు చూస్తుందనేవారు. చదివింది
ఎమ్. ఎస్. సి , ఉద్యోగం కోసం చూస్తూనే ముగ్గురు బిడ్డల తండ్రయిపోయాడు.
బాధ్యతలు పెరిగాయి. డబ్బు అవసరం అంతకన్నా
పెరిగింది. అలా అని ఇప్పటివాళ్ళలా ఫెనుకింద ఉద్యోగమే చేస్తానని బిరిగీసుకుని
కూచోలేదు. ఏ పని దొరికినా, సీజన్ కు తగ్గట్టు చేసుకుని పోయేవాడు. మాస్టారుకి రాని
విద్యంటూ లేదు. ఎలక్ట్రీషియన్, ఫ్లంబర్, వడ్రంగి పనులు చేసేవారు. వైరు కుర్చీలు అల్లేవారు. ఆయన దగ్గర అల్లడం నేనూ నేర్చుకున్నాను. ఇంకా నాకు తెలీని పనులెన్నో చేసేవారు. ఇప్పుడున్నాయోలేదో గానీ చదువుకోడానికి పగలు వీలులేని వాళ్ళకు అంటే పెద్దాళ్ళకు రాత్రిళ్ళు బడిపెట్టేవారు..
దానికి వచ్చేవారికి స్కూలు వరండాలో గుడ్డిలైటు వెలుతురులో పాఠాలు చెప్పేవారు. ఇక
అరటికాయల సీడన్ వస్తే అరటిగెల్లు సైకిల్ కి కట్టుకుని జొన్నాడ నుండీ రావులపాలెం
అంతకన్నా పైకే వెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు.
ఎన్ని చేసినా.. ఎంత పనుల్లో మునిగిపోయినా మా
మాస్టారు ఎదురుచూసేది మాత్రం గోదారికి వరదెప్పుడు వస్తుందా అనే.. ఎందుకంటే అప్పుడే
ఎవరన్నా నాలుగు కాసులు వెనకేసుకునేది. ఎక్కడో నాసిక్ లోని త్రయంబకంలో పుట్టి కరీంనగర్, ఖమ్మం గుండా తెలుగుదేశంలో కాలుమోపిన
గోదారమ్మకు ప్రజలంతా సమానమే... ఎంత గొప్పవాడినైనా పునీతం చేయగల చల్లని తల్లి.
ఎన్నో మలినాలను తనలో కలిపేసుకుని, గలగల లాడుతూ ప్రవహిస్తూ పోతుంది.
ఇక వరదలప్పుడు సరే సరి. తన దోవకు అడ్డొచ్చే
చెట్టూ, చేమనంతటినీ తనతో పాటూ కూకటివేళ్ళతో సహా లాక్కొచ్చి ఎక్కడో ఒడ్డున
పడేస్తుంది. అలా వరదలప్పుడు ఎంత కలప వచ్చి పడుతుందో.. లేక్కేలేదు. సరిగ్గా
చెప్పాలంటే.. గోదారమ్మకు వరదలెప్పుడు వస్తాయా అని వెయి కళ్ళతో ఎదురుచూసేవారెందరో
ఉన్నారు. ఆ వరదల్లో ఎక్కడినుండో కొట్టుకువచ్చే ఆ కలపంతా ఏరుకుని అమ్మి సొమ్ము
చేసుకుంటారు.
ఇక ఆ ఏడు వరదకు నాలుగురోజులుందనగా మా మాస్టారు
పొరుగూరి పనులన్నీ ముగించుకుని గోదారమ్మ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. పెళ్ళాం,
పిల్లలకు కావల్సినవన్నీ ఇచ్చేసి. స్నేహితుడు రామంతో గోదారమ్మకు ఓ నమస్కారం పెట్టి,
బయలుదేరారు మాస్టారు. “చూడవే ఈసారి మన ఇంటికి బాత్రూంలేదుకదా ఇప్పుడు
వచ్చే డబ్బుతో అది కట్టించేస్తాను” అంటూ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయారు.
నాలుగు రోజులు గడిచాయి, గోదాట్లోకి వెళ్ళిన
వాళ్ళంతా వచ్చేసారు. మా మాస్టారు రాలేదని అంతా కంగారు పడుతుంటే ఓ సాయంత్రపేళ
రొప్పుతూ సైకిల్ మీద ఇంటికి వచ్చి చేరాడు. భార్యతో సహా అంతా కంగారు పడ్డారు. “ఏమీలేదు
పెద్ద దుంగ, మాంచి చేవమీదుంది. నరికిచే పెద్ద కలపే..గుమ్మాలకు సరిపోద్ది.
సూరిగాడికి ఇచ్చేసాం. అది తేల్చుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యమయింది అంతే”
అన్నాడు. సరే అని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆరోజు నాలుగురోజులు గడిచిపోయాయ్ ఓరోజు
రాత్రి ట్రంకు పెట్టి తీస్తున్న చప్పుడు విని భార్య గబుక్కున లేచి కూచుంది. “ఈ ఏళప్పుడు ఆ పెట్టెతో పనేంటి”.. అని
గసురుకుంది. “ఆ..ఆ.. ఏం లేదులే”.. అని
నసిగేసి.. మళ్ళీ మంచంమీద కూలబడ్డాడు.. తెల్లారి మళ్ళీ ట్రంకు పెట్టె ముందు
టచ్చాడుతున్న మాస్టారుని గట్టిగానే అడిగింది భార్య.. “ఏంది
నీ యవ్వారం నాలుగు రోజుల్నించీ ఇదే తంతు... ఈ గోదాట్లోకి ఎల్లిన్నకాడ్నించీ
చూత్తన్నా”.. ఏంది అంత రెహస్యం.. ఆ”..
“అదేం లేదే బాబు”..
అంటూనే ఎవరూ చూడకుండా..తలుపులేసి.. ట్రంకుపెట్టె తెరిచాడు. ఎర్రటి గుడ్డలో చుట్టి
ఉన్న పొడవాటి వస్తువునేదో తీసి ఇదిగో గోదాట్లో నాకు దెరికింది. “గోదారమ్మ
కానుకే ఇది. ఏటై ఉంటుందా అనేది తెలటం లేదు”.. “టార్చిలైటే
అనుకుంటున్నా.. బాగుంది కదా ”అని చూపించి మురిసిపోయాడు. “సరే..
ఇదా సంగతి .. నేనింకా ఏదో బంగారం వత్తువే అనుకున్నా”..సర్లే
అనేసి వంటగదిలోకి పోయింది. ఈలోపు రహస్యం ఎలాగూ
బయటపడిపోయింది కదాని.. స్ర్కూడైవర్ పట్టుకుని ఆ పొడవాటి వస్తువుని తిప్పబోయాడు..
అంతే అదికాస్తా పెద్దగా శబ్దం చేస్తూ, చేతుల్లోంచి పొగలు కక్కుతూ.. ఇంటి పైకప్పు
చీల్చుకుని ఆకాశంలోకి పోయి గట్టిగా పెలిపోయింది.
ఇలా జరిగిన గంటకి మాస్టారింటి చుట్టూ జనం, మధ్యలో
పోలీసులు గుమిగూడిపోయారు. ఇంతకీ విషయం ఏమంటే మాస్టారుకి దొరికింది నక్సలైట్లు వాడే
చిన్నసైజు బాంబు..
మీరేవిటీ ఉన్నట్లుండి బాంబ్ పేల్చేసారు ?
ReplyDeleteమాష్టారెలా ఉన్నారు ?
మాస్టారు భేషుగ్గా ఉన్నారు :)
ReplyDelete