ఈరోజు నేను పుట్టానని,
ఈరోజు నా పుట్టినరోజని ఎవరూ గుర్తుచేయరే... ఇంత పొద్దెక్కినా నా సంగతి ఎవరికీ
గుర్తురాదే. ఛీ... వీళ్ళందరి పుట్టినరోజులూ నేను వారం ముందు నుంచే
గుర్తుంచుకుంటానే.. మరి ఇదేంటి. మరీ ఇంత మతిమరుపా.. లేదా నేనంటే ఇష్టంలేదా.. ఉదయాన్నే
నలుగుపెట్టి, తలస్నానం ఏది. జుట్టుకి సాంబ్రాణి ధూపం ఏది. నేను ఏం తినకుండా
ఉన్నానే అక్షింతలు వెయ్యారా.. కొత్త బట్టలు ఏవి. మీ అందరి దీవెనలు కావాలమ్మా..
నన్ను దీవించండి. చాలా బాధగా ఉంది. అమ్మా.. మరి నేను నీ మొదటి బిడ్డనే నీకన్నా నా పుట్టినరోజు
గుర్తులేదా.. తమ్ముడి పుట్టినరోజు రెండువారాలుందనగా గుర్తుపెట్టుకుని ముందే
హడావుడి చేస్తావ్..
చిన్నతనంలో
స్కూల్లో పుట్టినరోజున చాక్లెట్లు పంచుకుంటానంటే, కొత్తబట్టలు కొనమన్నా అమ్మ
విసుక్కునేది. ఆ.. కొంటారు.. ఈనెల నీది, వచ్చే నేల సరిగ్గా ఇదే తేదీలో మీ
చెల్లెది.. ఆపై నెల మీ చిన్న చెల్లెది. ఆగష్టులో మీ తమ్ముడి పుట్టినరోజు.. మధ్యలో
ఉగాది, శ్రీరామ నవమి ఇవన్నీ కాక మా పెళ్ళిరోజు ఎన్నింటికి కొత్త బట్టలు కొంటారే..
ఇలా ప్రతిదానికీ కొత్త బట్టలంటే ఏలా.. మీ నాన్నగారు ఓ బట్టలషాపు పెట్టాలి”’. అమ్మ ఉపన్యాసం ఎందుకో అలా గుర్తుండిపోయింది.
అప్పుడు తెలీలేదుకానీ ఇప్పుడు అనిపిస్తుంది. అవును అమ్మ అన్నది నిజమేనని..
ఇక స్కూల్లో
చాక్లెట్లు పంచలేదని చాలా బాధగా ఉండేది. అప్పటికి కేకులు కట్ చేసుకోడాలు లేవుకనుక
ఏడవలేదుగానీ.. లేదంటే అదీ పెద్ద బాధగా మిగిలిపోయేదినాకు. తరువాత జరిగిన ఏ
పుట్టినరోజునా నేను ప్రత్యేకించి ఇది కావాలని ఇంట్లో అడగలేదు. ఆరోజుకూడా ఏదో
మామూలుగా గడిచిపోయేది. అంతే..
కానీ ఈ మెదడులో
కొన్ని బలంగా ముద్రపడిపోతాయి. నేను ఏం కోల్పోయినా, అవమానపడ్డా, బాధపడ్డా..
ఆనందపడ్డా అన్నీ అన్నీ రిజిస్టర్లో రాసుకుంటాను. మళ్ళీ ఎప్పుడో గుర్తుకువస్తుంది.
అప్పుడు సందర్భం వచ్చినపుడు ఇదిగో ఇలా బయటపెడతాను. నా మెమరీ అంటే నాకు చాలా ఇష్టం.
అందులో ఎన్ని కబుర్లో, ఎన్ని మరిచిపోలేని సంఘటనలో.. గుర్తుంచుకున్నవి చాలానే
ఉన్నాయి. ముఖ్యంగా బాల్యంలో జ్ఞాపకాలు చాలా పదిలంగా దాచుకున్నాను.
అందుకే నాబిడ్డల
విషయంలో పుట్టినరోజు ఉన్నంతలో బాగా చేయ్యాలని ఆరాటపడతాను, ఏదో అప్పుడు నాకు జరగంది
ఇప్పుడు జరపాలనే కోరిక. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అంటే నా ఈ పుట్టినరోజుకు ఓ
ప్రత్యేకత ఉంది. నా కడుపున పుట్టిన బిడ్డ నాకు పుట్టినరోజు చేసాడు. ఇప్పటి వరకూ ఊహ తెలీలేదు. పుట్టినరోజులు గురించి
వాడికి చేస్తున్నాం కదా అందుకేనేమే..వాడికి నాకోసం ఆరాటం. కేకు కట్ చేయాలని, అది నా ముఖానికి రాయాలని ఎన్నో ఫ్లేన్స్ వేసుకున్నారు
ఇద్దరూ.. ఎంతటి గొప్ప మనసో వాడిది. నాతో పాటు మేలుకుని మరీ దగ్గరుండి కేక్ కట్
చేయించాడు. మా ఫణీ చిన్న లెటర్ చేతిలో పెట్టాడు. అందులో బాగా రాసుకోరా.. బావుండు
అంటూ.. ఎంత ఆనందంగా ఉందో మాటలు, అక్షరాలు సరిపోవడంలేదు ఆ ఆనందాన్ని చెప్పాలంటే... i love u ra..
No comments:
Post a Comment