హృదయపు అర..

ఏం చెపితే నమ్ముతావు నువ్వు.. రాత్రి కలనంతా ఆక్రమించి నా ఆలోచనా దారుల్ని చుట్టుకున్నావని చెప్పనా వర్షం తరువాత లేతరెమ్మలు గాలికి వణుకుతూ నిన్నే గుర్తుచేసాయని చెప్పనా పగలంతా పేరుకుపోయిన దిగుళ్ళను రాత్రికి నీ ముందు దింపుకున్నాను.. చెదిరిన స్వప్నంలాగా వచ్చి పోయిన నీకేం తెలుసు.. సాయంత్రాలు అరవిసిన సన్నజాజుల్ని అడిగి చూడు. అవే చెపుతాయి.. కొంచెంసేపన్నా నందివర్దనంలా విచ్చుకుని చూడు. ఈ మనసెంత వయ్యారంగా గారాలు పోతుంది తెలుస్తుంది. కాలపు ఉచ్చుల్లో బిగుసుకున్న నీకేం తెలుసు.. ఈ కౌగిలి నీకోసం కాచుకుందనీ.. నీ స్పర్శకై ఈ దేహం అరను తెరిచినపుడు తెలుస్తుంది మోహంతో రగిలే నా హృదయాన్ని అడుగు నువ్వు చెప్పలేని ఊసులన్నీ గుసగుసగా వినిపిస్తుంది. వింటావా మరి..