పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నీ చేతులతో అడ్డుకో

చిత్రం
  చంద్రుడు సముద్రపు లోతుల్లోకి తొంగి చూసినట్టు ఆ చెట్ల వెనుక నీడలోంచి తీక్షణంగా మెరిసే నీచూపు ప్రకాశించే ఈ కళ్ళ వెనుక కన్నీళ్ళకు ఆనకట్ట నీ ప్రేమా వాత్సల్యాలే కానీ లోన అల్లుకుపోయిన ముళ్ళపోదలెన్నో ఉన్నాయి వాటి మాటేమిటి..? ఈ హృదయ భారాన్ని నీ నవ్వుతో తగ్గించు నీ హృదయపు విచారాన్ని అప్పుడు పంచుకుంటాను. నాముందు జీవితపు సారాన్నంతా నీ రెండు కళ్ళలోనూ చూస్తున్నాను. ఈ గుండెను చీల్చుకుంటూ వస్తున్న గత కాలపు జ్ఞాపకాలను నీ చేతులతో అడ్డుకో నాపై నీ ప్రేమ దృఢమైనది.. ఎప్పటికీ నిలిచి ఉంటుందని విశ్వసిస్తాను.

ఎప్పుడూ నీ తలపులే..వెంటాడేది..

చిత్రం
 నా ప్రేమను విశ్వసించు..ఈ హృదయపు దుఃఖాన్ని పంచుకో..నా ప్రేమ గాఢతను నీలో నింపుకో..పద్మం వికశించినట్లుగా గుభాళిస్తాను. నేను విషాదాన్ని కాదు..కన్నీటిని నింపుకు తిరిగేందుకు.. నేను సంతోషాన్ని కాదు చిరునవ్వును పూసేందుకు..నేను ప్రేమను కాను నీ వియోగాన్ని మోసేందుకు నేను నీ అనంతమైన హృదయస్పందనల సవ్వడిని..ఎప్పుడూ నీ తలపు స్మృతిలో కాలాన్ని ముందువెనకలు చేసి నిన్ను ఆరాధించే మీరాను..

చీల్చుకువచ్చే స్వప్నాన్ని...

చిత్రం
రాతిరి అరుగు మీద రెండు నగ్న దేహాలు నిన్నను వెతుకుతూ వెక్కి ఏడుస్తున్నాయి. అందులో నా శోక హృదయపు తపన కూడా ఉంది. ఆవేశాన్ని గుబులును దూరంలో చూస్తూ విరహ సహవాసంలో ఏకాంత వాసమది. అతని గుండెలు విశాలంగా చిక్కటి దారులు వేసి ఉన్నాయి. తప్పిపోతాననే భయం కలిగిస్తూ.. మళ్ళీ ఉదయం రాబోతుందని గురుతుచేసాడు.. నిద్ర చెదిరి అలసి రొప్పుతుంది మనసు. నన్నిట్లా నిర్దయగా వదిలిపోవద్దని కరుణించమని వేడుకున్నాను. ఒంటరినై నిదుర రాక నగరాల్లో తుఫాను రాత్రుల్లో సంచరించే హోరుగాలినైపోతానని వేడుకున్నాను. చీకటిలోంచి చీల్చుకువచ్చే స్వప్నాన్ని గురుతుచేసాడు. ఎంత కోత గుండెకు ఎంతరోత ఒరుసుకున్న హృదయపు గాయాన్ని అతనిముందుంచాను. నిర్దయగా తోసి నన్ను విదిలించి అడుగులు వేసాడు..రేపటి కన్నా భయంకరమైన ఎడబాటది..మళ్ళీ ఒంటరి పక్షినై హృదయాకాశంలో విహరిస్తాను రేపు.

నువ్వూ అలానే అనుకున్నావా..

చిత్రం
ఇప్పుడు నేనున్న కలలోనే నువ్వూ ఉన్నావు.. ఇద్దరం పక్క పక్కనే.. నన్ను హత్తుకున్న ఆచేతులు.. నీ ఒంటి వాసనా తప్ప మరే లోతైన అనవాలు నాతో రాలేదు ఆరోజున.. గట్టిగా ఒత్తిన నీ చేతి స్పర్శ.. పెదవుల తడి.. ఊపిరి వదిలిన ఆనవాళ్ళే కూడా తెచ్చుకున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆ దృశ్యం పాతబడిందేమో కానీ.. నువ్వు నాలో రేపిన అలజడి అలానే ఉంది.. నువ్వూ అలానే అనుకున్నావా.. తిరిగి వస్తున్నప్పుడు నీచూపులు నాతో అదే చెప్పాయి.. గురుతుంచుకో.. ఆ నల్లని వలయాన్ని.. మన నిద్దురను చెరిచేసి నిన్ను దూరంగా తీసుకుపోతుంది. లోపలెక్కడో దిగులు.. నువ్వు మాయం అయిపోతావనీ.. మరణం అంచులు కదా నిన్ను నానుంచీ దూరం చేసేదనీ.. నాకో నిశ్చింత..

అలలపై తేలుతూ,

చిత్రం
  గాలి విసురుకు జ్ఞాపకాల బుడగలు పగులుతున్నాయి. అలలపై తేలుతూ, అప్పుడప్పుడు పలకరిస్తాయి. కాలి అడుగులకు బయపడి దారి మార్చుకుంటూ.. ఎక్కడా ఎవరికీ కనిపించక లోలోన దాగి.. మోయలేని భారమిది. ఎన్ని గురుతులవి ఎన్ని జ్ఞాపకాలు.. తడారిన ఒంటిపై నీటి బిందువుల గురుతులు ఎన్నని మోసుకెళ్ళను. ఎక్కడివో మల్లెలు దోసిలిలో పోసినట్టు ఎక్కడని దొరుకుతావు ఈ జ్ఞాపకాల్లో తప్ప పిచ్చి గాలి చెప్పినా వినదు. సంధ్యలోనూ నేనున్నానంటూ నిన్ను అప్పగించి పోతుంది.

ఊహించు..

చిత్రం
ఊహించు నేనెవరినై ఉంటానో స్పర్శను మరిచిన దేహాన్ని కునికిపాట్లు పడే కలవరాన్ని ఆకాశాన్ని కప్పేసే మేఘాల తెర వేగం తగ్గిన డేగల ఒగుర్పు దేనికి నాకీ ఆశ ఎన్నని అనుభవాల్ని కుప్పగా పోస్తే ఈ గుండె వెలుగులో మరణాంతర జీవితం చూస్తావు. నరనరమూ కాల్చే జ్ఞాపకాలను తడిమిచూడు ఎన్నని చూపగలను కరిగిన కాలానికి ఆనవాళ్లు అంటుకున్న ఆలోచనల సావాసాన్ని గురుతుపట్టావా నేనెవరో రాతిరిని జారవిడిచిన విషాదాన్ని ఒరుసుకున్న విషాదపు మధ్యాహ్నాన్ని ఎదురుచూపులో దగ్ధమైన ఏకాంతాన్ని మసకబారిన హృదయపు గదిలోకి తొంగి చూడు గతకాలపు ఆనవాళ్లు తప్పక తడుముతాయి అప్పుడైనా ఊహించు నేనెవరినో...?

మళ్ళీ వస్తాను..

చిత్రం
చీకటి లోతుల్ని నెగ్గుకువచ్చేవేళ పిడికెడంత గుండెల్లో ఆనందాన్ని కళ్ళలోకి ఆహ్వానిస్తూ... మౌనంలోకి తప్పిపోయి మళ్ళీ వస్తాను. సిగ్గును నీ కళ్ళచివర తగిలించి నీవైపు దొంగచూపులు చూస్తాను. ఇద్దరి మధ్యనా నెగ్గని మల్లె సుగంధాలకు విడ్కోలు పలికి మర్మమే లేని నా మనసును నీముందు పరుస్తాను. తప్పిపోయి నీస్పర్శతో సిగ్గుపడ్డ కురులను సవరిస్తూ దోరనవ్వు విసురుతాను. మన ఏకాంతాన్ని లెక్కలు కడుతూ జ్ఞాపకాలను కళ్ళలో దాస్తాను పూలమాలలుగా గుర్చి నీ మెడలో అలంకరిస్తాను. రాతిరి రహస్యాల్ని నెమరు వేస్తూ ఉదయం నీముందుకు మళ్ళీ వస్తాను.

వర్ధిల్లు...

చిత్రం
  రాత్రి కోరికలతో కరిగిపోయింది మనసు మూలుగుతూ నీ మైకంలో చిక్కుకుంది నువ్వు వస్తున్న జాడ నీ అడుగుల శబ్దం నీ నవ్వే కళ్ళు రవి చూపులేని పద్మంలా ముడుచుకున్న కనురెప్పలు తెలుసు..నీ ప్రేమ మూలాలు నీ ప్రేమను విశ్వసించాను చీకటి నక్షత్రల్లో ఘనీభవించిన నీ మెరిసే నవ్వు.. ఎన్ని కబుర్లాడేది.ఇంకా నీ నవ్వు ఈ కళ్ళలో తోవ తప్పిపోయింది నీకు తెలుసా? నీకళ్ళ అగాధాలలో నా పాటలను వెతికి నీరసించాను. ప్రణయ వాంఛలతో నీ ముందుకు వస్తున్నాను. నన్ను చుట్టుకో.ఈ వాంఛ అంతం తెలియనిది.

ఎప్పుడో మరణించాను..

చిత్రం
  ఎప్పుడో మరణించాను.. నేనని తెలియక మునుపే నాతల్లి కడుపున మళ్ళీ పుట్టేందుకు శక్తిని కూడదీసుకుంటున్నాను. నేలలో పడి ధూళి కణంలా మారి నీ ఊపిరిలో కలిసిపోయి నీ స్పర్శను మలినం చేస్తూ రక్త నాళాల్లోంచి పెకిలించుకు వచ్చాను. ఎంత మూర్ఖత్వమోనాది నా వొంతు వాగ్దానం చేయలేదు మౌనంగా తల వంచుకుని నీకేసి చూస్తూ రెక్కలు చాచుకుని ఆకాశం కేసి ఎగిరి పోయాను. అప్పుడే మరణించాను. ఉషస్సులేని కళ్ళతో ప్రార్థిస్తున్నాను. నీ రూపాన్ని మళ్ళీ నాకివ్వు నన్ను నీ పాదాలకు కట్టి వెయ్యి వజ్రాన్ని కాకపోయినా నీవు పూజించే పుష్పాన్ని అవుతాను. మళ్ళీ నీ కడుపున పుట్టే వరాన్ని ఇవ్వు