పోస్ట్‌లు

ఆవిరి సెగ

గాయం తగిలిన గుండెకు  మాటలేం వస్తాయి మునుపు నీతో ఉంది  ఇప్పుడు ఒంటరిది వేగంగా వీచే గాలికి  కాస్త ఊగుతుంది మళ్ళీ సర్దుకుంటుంది వెలివేసిన గుండె అది వేదన బాగా తెలుసు ఊరూరా ఆలోచనలతో  తిరిగి అలసి ఇంటికి చేరుతుంది ఎన్ని కబుర్లు మోసుకొస్తుందో అందులో నువ్వూ ఉన్నావు  తనని ఏడిపిస్తూ ఏ వేళకు నువ్వు ఏం చేస్తావో ఎరుగుదును, ఆలోచిస్తుంది  నువ్వు తిన్నావా అని మోహార్తి తాపాల చెర నుంచీ  విడిపించుకోవాలని  గింజుకుంటుంది నీ నవ్వును ఉదయానికీ  సాయంత్రానికి ముడివేసి  ఆడుకుంటుంది. అప్పుడప్పుడు కలలో  భవిష్యత్తు భయపెడుతుంది శూన్యంలోకి లాక్కుపోతుంది ఎంతటి ఆర్తో నువ్వంటేనూ.. గతాన్ని తలుస్తూ  వాస్తవానికి భ్రమలను జోడించి వెలుగునీడల సంగమంలో  ఆవిరైపోతుంది.

వదలని నీడలు

చిత్రం
గాలికి తలలూపే పచ్చని  చెట్ల నీడలు మౌనాన్ని వీడని  నిటారైన స్తంభాలు జలపాతమంత దుఃఖాన్ని  మింగిన మనుషులు నూనె దీపాల వెలుగులో  ప్రకాశించే నీడలు పరవశం ఎరుగని  మనసుల నీడలు అలజడే ఆనవాలుగా  సాగిపోతున్న గుండెలు నిదురను ఎరుగని  బ్రతుకులు సేదతీరేందుకు ఎదురు చూపులు నీడలు ఎన్ని నీడలో  దారులంట  ఆర్తిగా ఆనందాన్ని వెతుకుతూ పోతున్న నీడలు

ఒక చిరునవ్వును వెతుకుతూ

చిత్రం
ఎందుకు మీరంతా  నన్ను చూసి కన్నీళ్ళను  ఆరబోసుకుంటున్నారు నేను దుఃఖాన్ని  మోయడం లేదు ఆనందపు జాడలను  వెతుకుతున్నాను వర్షించే మేఘాన్ని  కలగంటున్నాను పసికందుల నవ్వులను  తెంపుకుంటున్నాను పూల మకరందాన్ని  దోసిళ్ళతో ఎత్తుకుంటున్నాను ఆకాశం పరిచిన మేఘల నీడలంట ప్రయాణిస్తున్నాను గమనమెరిన దిశ నాది అలుపెరుగని పయనం దుఃఖమే లేని లోకాలను  పట్టుకుందుకు చిరునవ్వుల చిరునామా  తెలుసుకుందుకు

మంచు పలకరింపు

చిత్రం
ఇటుగా బయలుదేరి వచ్చింది  హిమాలయం ప్రతి ఊరునీ కలుపుకుంటూ చలి విత్తనాలు చల్లుతూ గడ్డివాము, పంట పొలము,  సిమ్మెంటు బెంచీ నువ్వు నేనూ అన్నీ చుట్టాలే  ఒకటే ఈ చలిగిలికి వెచ్చగా దుప్పట్లో  జోగుతున్న నగరాలు పొగమంచు కమ్మేసిన దారులు చిటపటలాడే చలిమంటలు ఎదురుచూడని  మంచు దేవతకు హారతులు ప్రేమలు చిగురించి పూలుపూచే కాలం పరువానికి రెక్కలు మొలిచే కాలం సిగ్గు నెరిగిన వాన చినుకులు తోరణాలై  మంచు కన్యను చుట్టుకునే సంబరం

ఆ గాలేం చేస్తుంది

చిత్రం
  నిశ్శబ్దంగా నా పక్కన చేరి గోరువెచ్చని నీ స్పర్శను  గురుతుచేస్తుంది నీ జాడలు వెతుకుతూ స్వప్న వీధుల్లో వెర్రి ఆలోచనల వెంట తీసుకుపోతుంది ఆ గాలేం చేస్తుంది..  అర్థరాత్రి అలసిన దేహానికి జ్ఞాపకాలతో చికిత్స చేస్తుంది మనసుకు గిలిగింతలు  పెట్టి, ఊహలకు రెక్కలిచ్చి  నీ దగ్గరకు పంపుతుంది ప్రేమలో మాధుర్యాన్నంతా పోగేసి అలల తరంగంలా నన్ను కమ్మేస్తుంది నీవు వదిలిన గురుతులను  తడుముకుంటూ రాతిరిలో మేఘాల  మాటున చందమామనైపోతాను నీకివేం పట్టవు.. ఆ పాడు గాలి నిన్ను  తాకనైనా తాకదేమో కదా

కలల లోకంలో బంధీని నేను

చిత్రం
ఈ కాళ్ళకు చుట్టుకున్న  బంధనాలు ప్రేమగా ఎప్పుడు  అల్లుకుంటాయో చీకటి నుంచి  వెలుగు వైపుకు ఎపుడు  తీసుకుపోతాయో తెలీదు మసక రాత్రుల్లో  ప్రేమతో నిమిరి మరి రాతిరికి పగటి  కలలైపోతాయి ఈ బంధనాలు నన్ను  వదిలివెళ్ళిన బంధాలు కౌగలించుకోవు పలకరించవు బాధపెట్టడమే తెలుసు సుడులు తిరుగుతూ వచ్చి గతంలోనికి  గుంజుకుపోతాయి చిన్నారిగా  నాన్న ఒడిలో ఆడిన ఆటలు అమ్మ చేతి గోరుముద్దలు చిట్టి చెల్లెళ్ళతో చేసిన అల్లరి  మేఘంలా అల్లుకుపోతుంది కల నీరైపోయాక మబ్బులు  పట్టిన ఆకాశమల్లే దిగులు మళ్ళీ  కమ్ముకుపోతుంది.

ఏమంటావు

చిత్రం
  ఏరుకోడానికి ఎన్నిలేవు ప్రతి చోటా నీవు వదిలిన ఆనవాళ్ళే గాలికి ఊగుతున్న ఆ  గుమ్మంలోని గంటలు నువ్వు  వచ్చినపుడు ఎన్ని హొయలుపోతాయనీ ఈ పూలబాలల మాట చెప్పనే అక్కరలెద్దు నిన్ను చూసినప్పుడల్లా  కొమ్మకొమ్మకూ ఒదిగి కొత్త భంగిమలో  నాట్యమాడతాయి  నీ స్పర్శ తెలిసిన కుర్చీలు బల్లలు  నువ్వంటే ఆప్యాయత చూపుతాయి నీపాదం తగిలి పులకించని చోటుందా అక్కడ. ఆగదిలో  నాలుగు గోడలకూ నువ్వు తెలుసు నీ నగ్న దేహాన్ని ఎన్నిమార్లు పలకరించాయో గాలి తరగల్లా., రాత్రింబవళ్ళ  కాలానికి మధ్య జారిపోయిన రోజులెన్ని లేవు. ఆ వర్షమొచ్చిన రోజున  తడిచిన దేహాల మధ్య జరిగిన ముద్దుల యుద్ధం గతానికి ఎదురెళ్ళి ఎన్నని  జ్ఞాపకాలను పట్టుకురాను ఏం నీకు మాత్రం గురుతులెవు. అన్నీ తీపిగా ఉంటే చెదెపుడు చూస్తావు నువ్వేమిటి? నేనేమిటి? ఇద్దరం సమానమే ఈ ప్రేమకు ఇదంతా ఏమిటని కంగారు పడకు అలగకు అలవాటు పడు ఈసారి ఇద్దరం కలిపి ఏరుకుందాం మన ప్రేమ తునకల్ని ఏమంటావు.