మరో ప్రపంచమే.. మరింత చేరువై... 💐❤️🤓
ఏది ఈ దేహానికి, మనసుకు సుఖాన్నిచ్చేది.. ఏది ఆనందం.. ఆహ్లాదం. పుట్టి, పెరిగి, పెళ్లి బంధంలోకిపోయి, నాన్నయి, అమ్మయి, బిడ్డల్ని సాకి.. ముసలితనంతో చచ్చేంతలోపు డబ్బు కాంక్షలోపడి, ఆశతో, అవసరాలతో కాలం గడిపేసి.. నేను గొప్పవాడినంటే.. నచ్చింది చేయలేని జీవితంలో ఇరుక్కుపోవడం ఏం ఆనందం.. ఇవన్నీ రోజూ బుర్రలో దూరేసి తెగ సాధింపు..
పూలలో సోయగం, తేనెలో తీయదనం అని అంటావేగానీ నిజంగానే పూలతో సావాసం ఉందా నీకు.. నీ పెరట్లో విచ్చుకునే పూల పేర్లు తెలుసా.. ఏ మొక్క, ఏ మొగ్గ ఏ పిందె.. తెలీదు. కానీ నీ బుర్ర వాటిని ఆస్వాదించండి మొర్రో అంటుంది.. కదిలి వెళ్లి వాటితో సమయం గడిపే సమయమేది.
కొండ మీదకు అతి కష్టం మీద కాళ్ళు నొప్పులు ఒచ్చినా ఎక్కి దేవుడి గుడికి నాలుగు అడుగుల దూరంలో ఉండగా.. అంత పైనుంచి విశాలంగా కనిపిస్తున్న ప్రకృతిని చూసి మురిసిపోతాం. అంతవరకూ నొప్పితో పీకేసిన కాళ్ళు కష్టాన్ని మరిచిపోతాయి. అనంతమైన హాయి.. ఎన్ని కోట్లు పెట్టి కొన్నా దొరకని హాయి.. మనం ఎప్పుడూ గమనించని ప్రకృతి అందం అంత కష్టం తర్వాత మాత్రమే నిజరూపంతో కనిపిస్తుంది. ఇక దైవదర్శనం తర్వాతి మాట. ఇప్పుడు ప్రకృతే దేవుడు. అలాంటి అనుభవమే ప్రతిరోజూ అందుకోగలిగితే..
చింతలూరు తీర్థం ప్రతి ఉగాదికీ జరిగేది. అమ్మ దిష్టి తీసేందుకు కాగడాలు వెలిగించి అమ్మవారి ఆశీస్సులు బిడ్డలకు ఉండాలని మాతో ప్రయాణం అయ్యేది. దారంతా పొలాలు, నల్లమట్టి గుంతలు, అక్కడక్కడా బురద కన్నాల్లో పీతలు, కప్పలు.. మేం మాత్రం పాములున్నాయనే బ్రమలో భయపడుతూ వెళ్ళేవాళ్ళం. అమ్మ చీర చెంగు గట్టిగా పట్టుకుని నక్కి నక్కి.. భయం భయంగా పడేవి అడుగులు.. అమ్మ ప్రేమగా కాసేపు, విసుగ్గా కాసేపు చెబుతూనే ఉండేది.. అవన్నీ పీత కన్నాలనీ.. పాములు లేవనీ.. గుడి ప్రాంగణం చేరేలోపు తెగ విసిగించే వాళ్ళం. ఆమె ఓపికతో భరించేది. తనకి కూడా తెలీదు అన్ని కన్నాల్లో ఎక్కడో పాములు కూడా ఉండవచ్చు కానీ అప్పటికి ధైర్యం చెప్పాల్సిన పాత్ర ఆమెది. తనతో వెళుతున్న నలుగురు పసివాళ్ళకు ఆమెనే మార్గదర్శి మరి. గుడి చేరాకా ఆ భయం అంతా మరిచిపోయి అమ్మ చెంగు వదిలేసి జీళ్ళు దుకాణం వైపు పోయేవాళ్ళం.ఆ జీళ్ళపాకాన్ని గోడకేసి లాగుతుంటే అర్థం అయ్యేది కాదు.. అదో అద్భుతమైన ప్రక్రియ.. సాగుతున్న పాకాన్ని కాస్త గట్టిపడ్డాకా. కత్తెరతో ముక్కలుగాచేసి, పిండి అద్దేవారు.. అప్పుడు ఈ చేతులు శుభ్రంగా ఉన్నాయాలేదా అనే ఆలోచన కాదు.. ఎప్పుడెప్పుడు ఆ వేడి వేడి జీళ్ళు తింటామా అనే ఆలోచనే ఉండేది.
నాన్నతో కూడా ఈ అనుభవం ఉందిమాకు.. అందరం అందంగా ముస్తాబయ్యి చింతలూరు బయలుదేరాం.ముఖ్యంగా నేనైతే గులాబీ,నీలం రంగులతో రెండేసి రిబ్బన్నులతో రెండు జడలు వేయించుకున్నాను. నీలం రంగు గౌను వేసుకున్నాను. సైకిలు మీద ఇద్దరు ముందు సైకిల్ కడ్డీ మీద, ఒకరు సీటు మీద, ఒకరు వెనక కేరేజీ మీదా కూర్చుంటే.. నాన్న సైకిల్ నడిపించుకుని తీసుకెళ్ళారు. మేం వెళ్ళేనాటికి మూడురోజుల తీర్థం అయిపోయింది. దూకాణాలన్నీ తీసేసారు. పరిస్థితి అర్థం అయ్యి నాన్న తీసుకొని వచ్చేస్తుంటే నేను సైకిల్ దిగి ఆ నేలమీద పడి మట్టితన్నుకుంటూ దొల్లిదొల్లి ఏడవడం ఇంకా గుర్తే.. అతి కష్టం మీద ఇంటికి ఒచ్చాం.
కాస్త పెద్దయ్యాకా అమ్మచేయి పట్టుకొని కబుర్లు చెబుతూ.. చుట్టూ పొలాల్లో దూరంగా కనిపించే జనాలను పరిశీలనగా చూస్తూ తీర్థం వైపు నడిచేవాళ్ళం.. అప్పుడూ పీత కన్నాలున్నాయి. గమనింపు తగ్గింది అంతే.. ఇప్పుడు జ్ఞాపకాల్లోకి చేరి పీతకన్నాలకు కూడా భయపడ్డామనే విషయం నవ్వు తెప్పిస్తుంది. జీళ్ళు, ఖర్జూరాలు కొనుక్కొని అమ్మ కొనిచ్చే రబ్బరు గాజుల కోసం పోటీలు పడేవాళ్ళం. వందరూపాయల సంబరం అది. పెద్ద పండుగ వాతావరణం ఉండేది ఇంట్లో.. నాలుగు రోజులు తీర్థంలో కొన్న బొమ్మలు తప్ప ఆకలి కూడా గుర్తు ఉండేది కాదు. ఇప్పుడో లక్ష ఖర్చుకు కూడా ఆ కిక్కు లేదు.
జీవితంలో ప్రతి అనుభవమూ అంతే.. కాలం గడిచేకొద్దీ భయం నుండి జ్ఞాపకాల్లోకి చేరాకా భారం తగ్గిపోతుంది. తేలికైపోతుంది. ఇక్కడ డబ్బు కాదు. మనసు అందుకున్న తృప్తి, హాయి మాత్రమే లెక్క.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి