పిరికి ప్రేమ.. మొదటి భాగం
బాధ చెప్పుకోలేని పసి హృదయం.. ఏడుపొస్తున్నా పంటి కింద నొక్కిపెట్టి, పెదవులకు బలవంతంగా నవ్వు పులుముకున్న నాటిది ఈ జ్ఞాపకం.
అమ్మనాన్న వీళ్ళు మనకు తెలిసిన హీరో, హీరోయిన్.. వాళ్ళ ప్రేమ, కోపం, గిల్లికజ్జాలు పిల్లలు చూసినంతగా మరెవరూ సాక్ష్యం రాలేరు. అమ్మ తిడితే నాన్న వంక జాలిగా ముఖం పెట్టే రోజుల్లో.. నేనో ప్రేమలేఖ అందుకున్నాను. ప్రేమంటే అదో పిరికి ప్రేమ..
నీళ్లు లేని ఎడారిలో ప్రయాణం చేస్తుంటే వాడికి పుచ్చకాయ దొరికిందే అనుకోండి ఎంత సంబరం అలాంటి సంబరం అన్నమాట.. సదరు వ్యక్తికి నేను కనిపించడం..
చాలా రోజులు ఇంట్లో మనిషిగా అమ్మానాన్నలతో మసిలి.. స్నేహం పెంచుకుని, నేను చాపెక్కిన వారానికే తాంబూలం పళ్ళంతో ఇంటి ముందుకు వచ్చేసాడు.
ఆఆఆఆ.. ప్రేమ లేఖ సంగతి చెప్పలేదు కదూ. ఇదో పెద్ద గుండెల్లో రైలు పరిగెట్టినంత భారమైన సంగతి నాకు.
వాడు ఉత్తరం ఇచ్చాడు సరే.. అందులో ఏముంది.. ఏం చెప్పాలని ఈ ప్రేమలేఖ.. రోజూ మాట్లాడుతున్నాడు కదా ఇంకా ఏముంటాయ్.. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి చెప్పాలి. హమ్మో.. ఈ బరువు ఎలా మోయాలి. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఏంటి ఈ ప్రేమంటే.. ఇదేనా.. మరీ ఇంత ఇబ్బంది పెడుతుంది.
చాలా వేగంగా లెటర్ పట్టుకొని పక్క దొడ్డోకి పరుగులు తీసాను. ఎవరూ లేని చోట గుండె దడ తగ్గే వరకూ ఆగి.. రెండు తెల్లకాగితాల మడత విప్పి చదవడం మొదలు పెట్టాను. అన్నాళ్ళుగా ఇంట్లో ఓ స్నేహితుడిగా తెలిసిన వ్యక్తి ప్రేమంటూ, నేనే ప్రాణమంటూంటే పదమూడేళ్ళ నాకు ఎలా అర్ధం చేసుకోవాలో తెలీలేదు. భయం వేసింది. అమ్మకు చెప్పాలనిపించింది కానీ భయం. నాన్న కొడతారేమోననే భయం. ఇదేమైనా పెద్ద సమస్య అవుతుందేమోనని ఆడుకోవడం మాత్రమే తెలిసి నేను మొదటిసారి నా అమ్మనాన్నాలకు చెప్పుకోలేని సమస్య వస్తుందని గాబరా పడ్డాను.
లేఖ..ప్రేమలేఖ
(నా జీవితంలో అందుకున్న ప్రేమలేఖ ఇదే..)
పండు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ నవ్వు ముత్యాలు ఆరబోసినట్టు ఉంటుంది. ఈ ఏరియాలో నేను చూసిన మొదటి అందం నువ్వు. నిన్ను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇష్టపడ్డాను. ప్రేమించాను. నీతో ఈ సంగతి చెబుదామంటే మీ అమ్మంటే నాకు భయం. చాలా భయం. ఆమె నా వైపు పులిలా చూస్తుంది. ఆమె ఉన్నప్పుడు నా కళ్ళు నీ వైపు తిప్పలేను. నిన్ను ప్రేమగా చూడలేను. అయినా నీతో మాట్లాడాలని ఆరాటపడతాను. అందుకే నిన్ను ఆటపట్టించాలని చూస్తాను. నువ్వు చిన్నపిల్లలా నా మాటలకి అర్ధం తెలీక కోపంగా చూసి పోతావు. నన్ను అర్థం చేసుకునే వయసు నీకు వచ్చే వరకని ఎదురు చూసాను. నీకు నాకు చాలా ఏళ్ళు తేడా ఉంది. అలాగే మన కులాలు కూడా వేరు. మీకన్నా మేం చాలా డబ్బున్న వాళ్ళం. అయినా నేను ఇంట్లో ఒప్పిస్తాను. కానీ మీ అమ్మానాన్న ఒప్పుకోరేమో.. నువ్వు నన్ను అర్థం చేసుకో......నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మీ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోతే నిన్ను తీసుకొని వెళిపోవడానికి కూడా ఆలోచించను. నీకు కూడా నేను ఇష్టం అని చెప్పు చాలు. త్వరగా ఏదోకటి చెప్పు.. లెటర్ రాసి ఆ మర్రి చెట్టులో పెట్టు.. మీ అమ్మకు ఈ సంగతి చెప్పకు.. నువ్వు చెబితే చేయికోసుకుంటాను.. చెప్పకు పండూ.. కాస్త నవ్వుతూ చూడు నావైపు. మీ వాళ్ళకు దొరక్కూడదు. మీ స్కూల్ గేటు దగ్గర రేపు కనిపిస్తాను....................... రవి..
పదమూడేళ్ళ పిల్లకు ఇప్పుడు ఉన్నట్టుగా సోషల్ మీడియా ఖాతాలేదు. వెనక సలహాలు చెప్పే స్నేహితులు కూడా లేరు. ప్రేమలేఖ అందుకోవడం బూతైన కాలం అది. మోయలేని బరువుగా తనలో తాను మథనపడి, గింజుకుని ఎవరితో చెప్పాలో తెలీక తనలో తాను ఏడ్చుకుంటూ ఉండిపోయిన కాలం. ఇప్పుడు పరిస్థితి అలాలేదు. స్వేచ్ఛ అంతులేని స్వేచ్ఛ సోషల్ మీడియా ఇచ్చేసిన స్వేచ్ఛ.. ఈ స్వేచ్ఛలో బరితెంచే పిల్లలూ ఉన్నారు. బంధీలైపోయే వారూ ఉన్నారు.
ఒకరు, ఇద్దరు, ముగ్గురని తన హృదయంలో స్థానాలు ఇల్లు అద్దెకు ఇచ్చినట్టు ఇచ్చేసేవాళ్ళూ నాకు తెలుసు. అసలైన ప్రేమ కోసం వెతుకుతున్న వారందరికీ సిసలైన ప్రేమ దొరకడం లేదు. ప్రేమను గుర్తించేందుకు ఓ పరికరం కావాలి. అది ఇసుకలో, మట్టిలో బంగారం, వజ్రాలను వెలికితీసేందుకు ఉపయోగిస్తారే అలా ఉండాలి. ఎవడిది సరైన ప్రేమో టక్కున చెప్పేయాలి... ఊ. తరువాయి భాగం రేపు..
13-3-2026..సమయం ఉదయం ఏడుగంటలుదాటి ఎండ సుర్రుమంటుంది. మీ శ్రీశాంతి మెహెర్ ❤️🤓
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి