కొంచెం నమ్మకం ఇప్పిస్తారా..
ఉత్తరం అందుకోవడం, ఏంరాసాడో చదివాకా పదమూడేళ్ళ పిల్లకి మనశ్శాంతి కరువైపోవడం ఇప్పటి రోజుల్లో పెద్దగా అనుభవంలేని పరిస్థితి..కానీ తనకదో పెద్ద సమస్య.. ఏదో ప్రమాదం వచ్చిపడిందని దిగులు కమ్మేసింది. ఇది తెలిస్తే..అమ్మ తిట్టినా, కొట్టినా తనని ప్రేమగా చూస్తుందనే నమ్మకం పోయింది. నాన్నే ప్రపంచం అనుకునే నాకు ఆ క్షణం చింతబరిక దెబ్బలు మాత్రమే గుర్తుకొచ్చాయి. ఈ కుటుంబ ప్రపంచంలో నేను మాత్రమే ఒంటరిగా, అంటరానిదానినైపోతాననేంత భయం.
నా పసితనం పోయి, లాలింపులు పోయి, ఆరళ్ళు మొదలవుతాయనే భయం కుదురుగా ఉండనీయలేదు. ఈ అనుభవం మా బంధువుల్లో ఆడపిల్లల గురించి బరితెగించారని తిట్టుకోవడం, అసహ్యంగా మాట్లాడటం వల్ల తెలిసింది. ఏం జరిగినా ఈ సంగతి ఇంట్లో చెప్పకూడదని లెటర్ని వీలైనంత ముక్కలు చేసి నూతిలోకి విసిరేసాను.
కొద్దిరోజులు రవిని తప్పించుకుని తిరిగాను. స్కూల్ గేటుముందు, మా వరండాలో కనిపించినా పలకరించకుండా వెళిపోయేదాన్ని.ఏం జరుగుతున్నా అమ్మ వెయ్యి కళ్ళూ గమనిస్తాయని తెలుసు.. ఎక్కడా కుదురులేక జరిగేది ఎవరితోనూ చెప్పుకోలేక ఏడుస్తూ గడిపాను.
(నెత్తిన పిడుగుపడిన రోజు)..ఆడపిల్ల స్వేచ్ఛ పవిట వేసిన క్షణం నుండి పోతుందని తెలీని పసితనం.. ఆ సంబరాలు చూసి మురిసిపోయాను. ఆ ఇంట ఎప్పటికీ పెద్దపిల్లగా మారిపోయాను. ఆడిన ఆటలు, పాటలు, జామకాయ దొంగతనాలు, గిల్లికజ్జాలు అన్నీ ఇప్పుడు నువ్వు పెద్దదానివని గుర్తు చేస్తూనే ఉన్నాయి.. పరుగులు లేవు, గెంతకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, నవ్వ కూడదంటూ ఆంక్షల్లోకి నెట్టేసాయి. ఓపక్క రవి చాపెక్కిన సాయంత్రానికి తాంబూలం పళ్ళెంతో చక్కా ఒచ్చాడు. అప్పటివరకూ గొంతులోకి కుక్కేసిన సంగతి ఏదో బయటపడిందని సంబరపడాలా.. ఇకపై తన సంగతేంటని భయపడాలో అర్థం కాని స్థితి. ఫంక్షన్ అయ్యి చుట్టాలు వెళ్ళేంతవరకూ అంతా ప్రశాంతంగా ఉంది.
ఆ మరునాడు నిద్ర లేచేసరికి కాకినాడలో అమ్మమ్మ ఇంట్లో మంచం మీద నుండి నిద్ర లేచాను. ఏం జరిగిందో నేను ఎలా అమ్మమ్మ ఇంటికి వచ్చి చేరానో తెలీదు. నాన్న వెళిపోతూ నా ముఖంలోకి కోపంగా ముఖం పెట్టి మాట్లాడిన మాటలు పాతికేళ్ళు దాటినా ఇంకా గుర్తే నాకు. "ఎంత పరువుతక్కువ పని చేసావే పాపిష్టి దానా, తల ఎత్తుకోకుండా చేసావ్ కదే.. అప్పుడే మొగుడు కావాల్సి వచ్చాడా" అని.. ఆరోజు మొదలైన అపనమ్మకం.. వయసు గడిచి నాలుగుపదులకు చేరినా ఇంకా బలపడిందే కానీ.. ఎక్కడా నమ్మలేదు. ఒక సంఘటన తర్వాత మరొకటి నేను మంచి పిల్లను కాననే చెప్పాయి. అమ్మ ఆనాడే దూరంగా తరిమేసింది. తోబుట్టువులకు శత్రువు కన్నా ఎక్కువ అయ్యాను.
నేను స్వేచ్ఛ కోసం తపించింది.. స్వేచ్ఛ కోసం ఆరాట పడింది. దానిని పొందింది ఈ అపనమ్మకం కలిగిన తర్వాతే.. అసలు ఆడదానికి కావాల్సింది, కుటుంబం ఇవ్వాల్సింది మేమున్నామనే ధైర్యం. ఆడపిల్ల జీవితంలోకి తొంగిచూసే ప్రతీ ఒక్కడూ ప్రియుడు,మొగుడు కాదని అర్థం చేసుకోవడం కావాలి..
ఇప్పటికాలం చాలా మారింది. బిడ్డ ఏం చేసినా ఎంతో ఎదిగిపోయిందనే కాలం.సోషల్ మీడియాను విచ్చల విడిగా ఎడాపెడా వాడేస్తున్నా తమ బిడ్డ తను వయసులో చేయలేని చట్కారి పనులు చేసేస్తుందనే గర్వం ఇప్పటి తల్లిదండ్రుల లోపలి ఫీలింగ్..ఎంతో పరిపూర్ణమైన విశ్వాసం.. జీవితంలో ఎన్ని తప్పటడుగులు వేసినా చేయి వదలమనే ధైర్యం ఇస్తున్నారు తల్లిదండ్రులు అదే కావాలి కూడా..
స్వేచ్ఛ స్వేచ్ఛ అని కలవరించేస్తే రాదు.చుట్టూ పదిమంది సంగతి మరిచిపోతే వస్తుంది. నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పగలిగితే వస్తుంది. వెధవనిపించుకున్నా నువ్వు నువ్వులా ఉండగలిగితేనే స్వేచ్ఛ దొరికేది.
లేదంటే నీ కేరెక్టర్ ఏంటో పెద్దమనిషి అయినప్పటి నుండి జడ్జ్ చేసేస్తారు. ఆర్థికంగా బ్రతికేందుకు నీకంటూ ఆలోచన ఉండాలి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, భర్త, బిడ్డ ఎవరైనా నీ తర్వాతే అయిన నాడు.. మనఃశాంతి దొరికితే.. నమ్మకం దొరికితే నీ ఈ జీవితానికి పరిపూర్ణత చేరినట్టే..
ఆశ్వాదించు, ఆనందించు, హాయిగా నవ్వు.. మగాడితో సమానంగా బ్రతుకు.. ❤️💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి