దారి తప్పిన కాలానికి నాలేఖ..
బాల్యానికి నా ఆలోచనతో ముడివేసాను ఈ ఉదయం. ఎప్పుడో గడిచిన కాలం కదూ. అంతా లీలగా జ్ఞాపకానికొచ్చింది. పోలిక వెతుక్కునేంతగా మాసిపోతున్న ఆనవాళ్లు ..
ఆటపాటల మధ్య అల్లరి మధ్య ఏదో అమాయకత్వం.. అదిప్పుడు ఎక్కడా... మచ్చుకైనాలేదు.
చెరువుగట్టున ఊగిన ఉయ్యాల కన్నా.. బలమైన కొమ్మలకు వేలాడే కొబ్బరి తాళ్ళు చేసే శబ్దం జ్ఞాపకానికొస్తుంది. వెక్కిరిస్తూ.. నేనా కాలం దాటిపోయానని గుర్తుచేస్తూ..
నీలంరంగు యూనీఫాం మాసిన తెల్ల చొక్కా.. చెదిరి చింపిరైన తలకట్టు.. ఏదీ సరిగ్గా లేకపోయినా అసెంబ్లీలో నేనే ముందు వరసలో నించున్న ఠీవీ ఇప్పుడు ఎక్కడిది..
స్నేహితులు లేని బాల్యాన్ని ఊహించగలనా.. ఉప్పులేని కూడేకదూ.. ఏరీ నీ స్నేహితులు ఇప్పుడంతా వేరే.. అక్షరాలు పోగేసినా చెప్పలేని వెర్రి కాలం..
ప్రేమతో నిండిన పసికాలం.. ప్రేమ మాత్రమే ఉన్నకాలం.. గుండెను పిండేసే గడబిడ సమయాలు.. ఆలోచనతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రేమ సమయాలు.. దోబూచులు, దొంగాటలు, తొలిప్రేమలు, తొలి ముద్దులు... ఎన్ని ఎన్నని.. ఇప్పుడంతా వేరే.. అంతా కల్తీ.. హృదయ తృప్తి తప్ప మరేం లేదు.
సోకులు, సవరింపులు, చిలిపి కలలు, కవ్విస్తూ.. కలల లోకానికి ఎత్తుకొని పోతూ.. ఊరించే ఊహలు..తెల్లని గుర్రం స్వారీ చేస్తూ రాకుమారుడు వస్తాడనీ.. రెండు చేతుల్లో ఎత్తుకొని తిప్పేస్తాడనీ..ఊహల కవ్వింత
కాలం తిప్పి తిప్పలు పెట్టాకా కానీ.. అసలు నిజం బోధపడలేదు. ఎంత మాయదారి కాలమో.. కోపం కాదు. ఊహలే.. భవిష్యత్తు భయం లేక, ఆశ మాత్రమే తెలిసిన కాలమది..
మరిప్పుడో కరిగిపోతున్న మంచు ముక్క అయిపోయింది..జాలిలేని కాలం. జ్ఞాపకాలు మాత్రమే ఇక తోడు.. అందులో ఎంత బాధో.. అంత హాయి.. ఎంత చేదో అంత తీపి. ఏదీ నీ తీయని జ్ఞాపకం చెప్పు నాతో..❤️
(శ్రీశాంతి మెహెర్) (12-3-2026 ఉదయం 7 గంటలు) ఎండను తప్పుకుంటూ రాస్తున్న అనుభవం😊
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి