పోస్ట్‌లు

ఎవరికి తెలుసు..

చిత్రం
  ఎవరికి తెలుసు  ఇక్కడంతా నిశ్శబ్దం తేలియాడుతున్న కోరికలు గిరికీలు కొట్టే మోహాలు ఈ హృదయం పడే  వేదనను కాస్త లక్ష్యపెట్టు ఎందుకంటే మనమధ్య కొట్టుకుపోయే ఘడియలెన్నో పుట్టుకొస్తాయి. ఉద్వేగంతో ఉద్రేకంతో గాలి పట్టుకొచ్చిన అగరబత్తీల సువాసనలే కాదు. వేడెక్కిన మనసు పంపే విరహతాపాలు కూడా కొట్టుకొస్తాయి. కాస్త భరించు ఎప్పుడైతే నువ్వు  హృదయంతో పలకరించడం మరిచిపోయావో అప్పుడే వెన్నెలను మరిచిపోయింది లోకం చీకటిలోకి తోసుకుంటూ గోడల మీద పడిన నీడలు నీ జాడ వెతుకుతున్నాను. ఒక్క క్షణం కనిపించు మసకబారిన మనసుకు మంత్రం వేయి

జ్ఞాపకాల్లోంచి ..

చిత్రం
  ప్రేమ ఊసు ఎత్తినప్పుడల్లా జీవిత సారాన్ని వేళ్ళతో లెక్కగట్టి నీటిపాయలా జారుకుంటావు.. అయినా నీ చిరునవ్వు కోసం ప్రాధేయపడతాను. జ్ఞాపకాల్లోంచి తొంగి చూస్తున్నప్పుడు వేకువనే మేలుకున్న సుర్య బింబమల్లే కనిపిస్తావు. ప్రేమనీ..విరహాన్నీ నీమీద చల్లి పోతున్నప్పుడు నా ఆలోచనామృత జ్వాలలోంచి నిప్పుకణికవలే ప్రకాశిస్తావు. యవ్వనం జారిపోతూనే ఉంది దోసిలిలోని ఇసుక మాదిరి.. నేను నీ గురించే ఆలోచిస్తాను.. చమ్మగిల్లే కళ్ళతో వ్యర్థమైన కోరికను గుప్పిట పట్టుకుని ఒంటరితనాన్ని సాయం అడుగుతాను.

యవ్వనం జారిపోతూనే ఉంది

చిత్రం
  యవ్వనం జారిపోతూనే ఉంది దోసిలిలోని ఇసుక మాదిరి.. నేను నీ గురించే ఆలోచిస్తాను.. కాంతి వలయాల సాయంతో లీలగా ఎక్కడో ఒకచోట నీ మాటలు వినిపిస్తూనే ఉంటాయి.. కవ్వింపు లేని మాటలవి. ఉత్త జ్ఞాపకాలుగా మిగిలిన ఆనవాళ్ళు భావాల బంధాల్లోంచి తొంగి చూస్తున్నప్పుడు నువ్వు గోపురం నీడల్లోంచి వేకువనే మేలుకున్న సుర్య బింబమల్లే కనిపిస్తావు. ప్రేమనీ..విరహాన్నీ నీమీద చల్లి పోతున్నప్పుడు నా ఆలోచనామృత జ్వాలలోంచి నిప్పుకణికవలే ప్రకాశిస్తావు. అప్పుడు.. నీ పెదవుల మీద ఒలికే చిన్న చిరునవ్వు కోసం ప్రాధేయపడతాను. జీవిత సారాన్ని నీ ముని వేళ్ళతో లెక్కగట్టి నీటిపాయలా జారుకుంటావు.. చమ్మగిల్లే కళ్ళతో వ్యర్థమైన కోరికను గుప్పిటిలో పట్టుకుని మళ్ళీ ఒంటరితనాన్ని సాయం అడుగుతాను.

మాట్లాడు..

చిత్రం
 మాట్లాడు.. ఏ మంత్రమేస్తే నీ హృదయపు  శిల పగులుతుంది.. ఏ హొయలు కుమ్మరిస్తే నీ మనసు నాదవుతుంది. నీ మౌనంతో ముక్కలైపడి ఉన్న గుండెను బూడిద చేయకు కాస్త సవ్వడి చేయి..మిణుమిణుకు మని మెరిసే ప్రేమను జ్వలింపచేయి ఏమాత్రం ఆలస్యం చేయకు కలిసి నడిచిన దారులన్నీ ఇప్పుడు నేనులేక మూగబోతే ఒంటరిగా ఆదారిలో ప్రయాణించు.. తిరిగి చూడు..ఆ వాకిలికి నీ చూపులు తగిలించు నా పరిమళం మళ్ళీ  నిన్ను అల్లుకుంటుంది. పైకిచూడు..వేల చుక్కలను దివివిటీలుగా వెలిగించి పట్టుకో నా ఆత్మలోకి ప్రాణమల్లే చొచ్చుకుని పో.. నాకోసం ప్రేమగీతాలు ఆలపించు మళ్ళీ వసంతమల్లే నీ గుండెల్లో పూస్తాను. ఇకనైనా సాహసం చేయి.. భగ్న హృదయాన్ని కౌగలించుకొని ప్రేమించు..

ఆ ఒంటరి వర్షపు రాత్రిళ్ళు..

చిత్రం
 ఎన్నిమర్లు ఈ వెలుతురు  పిట్ట రాగానే జాలిజాలిగా  రాలిపడే పారిజాతాలమల్లే  నిశ్శబ్దంగా నేల రాలాలి... ఎన్నిమార్లు ఈ కన్నీళ్ళను  కనపడనీయకుండా లోనలోనే ఏడ్వాలి. నగ్నత్వం నిండిన  నీ మనసు సుఖ  స్వప్నాలను కంటూ ఉంటే... ఆ ఒంటరి వర్షపు రాత్రిళ్ళు  ఎంత వేదనతో గడిచాయో... జారిపడిన ముత్యపు చినుకుల్లా  నా కోర్కెల్ని ఒలకబోసాను. గుండెలు హత్తుకున్న ఆ రెండు మేఘాలను  చూస్తున్నప్పుడు పచ్చని చెట్లపై వాలే పిట్టల గుంపుల ప్రేమ ఊసులే జ్ఞాపకం వచ్చాయి. నవ్వకు...నేను సంతోషించి ఎరగను. కాలం చెక్కిలిపై నువ్విచ్చిన గోరువెచ్చని ముద్దు సాక్షిగా ఇంకా ఒంటరినే..

గాలికి వేలాడుతున్న చెట్లు

చిత్రం
 నన్ను వదలి నువ్వెళ్ళిన ప్రతిసారీ ఎవ్వరూ లేని తీరానికి పోయి దుఃఖపు పొరను అడ్డం పెట్టుకుని ఈ ప్రాణాన్ని విడుస్తాను. నడుస్తున్న దీపపు నీడల మధ్య గాలికి వేలాడుతున్న చెట్లు ఊగుతూ తలలూపుతూ నిశ్శబ్దాన్ని ఛేదించే లోపు  ఆయుధం కోసం ఎదురుచూస్తాను. నడిరేయి నిదురలో కలవరింతలై ఆకాశం కార్చే కన్నీరు ఆగితే నిన్ను ప్రేమించడం మరిచిపోతాను. ఈ మాయలో చేతికి దొరికిన ఆనందాన్ని జారవిడుస్తాను. మాటలన్నాలేని ఒంటరితనంలో నీ తలపు పొలమారక ముందే బయటి ప్రపంచంలోకి పారిపోతాను

నిజమైన ప్రేమకు చిహ్నాలు ఎవంటావా!

చిత్రం
 నిజమైన ప్రేమకు చిహ్నాలు ఎవంటావా! అవే..ఆ పూలే...అటు చూడు ఆ పారిజాతాల చెట్టు కింద  నిలబడినప్పుడు నీకోసం  చూస్తూ ఆ బాల్కనీ  మెట్ల దారిని పూజిస్తాను. ఈ హృదయానికి  పెద్ద అరలను అమర్చుకుని  ఖాళీగా ఉంచుతాను. నీవు వచ్చి ఆ నీడనే నిలబడతావని  ఆశ పడతాను. కన్నుల నుంచి ఇన్నాళ్లూ  పారించిన కన్నీటి ధారకు జవాబును అక్కడే వెతుకుతాను. పచ్చని ఈ చెట్ల చాటున వాలిన గోరువంకల జంట సాక్షిగా ప్రశాంతంగా ఉండటం కోసం  నీ సమక్షాన్ని కోరుకుంటాను. ఈ పారిజాతాలు ఉన్నాయి చూడు నీకోసం రోజూ పూస్తాయి. మెరుపు మెరిసినప్పుడల్లా మెరుస్తూ  సువాసనల్ని సుదూరాలకు వెదజల్లుతాయి.  వెచ్చని నీ ఊహలను చల్లబరుస్తాయి. ముళ్ళునెరగవు,  సువాసనే వాటి చిరునామా మరి వలపును తెలిపేందుకు గులాబీల కన్నా ఏమాత్రం తీసిపోవు.ఒసారటుగా వస్తే నీకూ చూపిస్తాను.