యవ్వనం జారిపోతూనే ఉంది
దోసిలిలోని ఇసుక మాదిరి..
నేను నీ గురించే ఆలోచిస్తాను..
కాంతి వలయాల సాయంతో
లీలగా ఎక్కడో ఒకచోట నీ మాటలు
వినిపిస్తూనే ఉంటాయి..
కవ్వింపు లేని మాటలవి.
ఉత్త జ్ఞాపకాలుగా మిగిలిన ఆనవాళ్ళు
భావాల బంధాల్లోంచి
తొంగి చూస్తున్నప్పుడు
నువ్వు గోపురం నీడల్లోంచి
వేకువనే మేలుకున్న సుర్య
బింబమల్లే కనిపిస్తావు.
ప్రేమనీ..విరహాన్నీ నీమీద
చల్లి పోతున్నప్పుడు నా
ఆలోచనామృత జ్వాలలోంచి
నిప్పుకణికవలే ప్రకాశిస్తావు.
అప్పుడు..
నీ పెదవుల మీద ఒలికే చిన్న చిరునవ్వు
కోసం ప్రాధేయపడతాను.
జీవిత సారాన్ని నీ ముని వేళ్ళతో లెక్కగట్టి
నీటిపాయలా జారుకుంటావు..
చమ్మగిల్లే కళ్ళతో వ్యర్థమైన కోరికను
గుప్పిటిలో పట్టుకుని మళ్ళీ ఒంటరితనాన్ని
సాయం అడుగుతాను.
No comments:
Post a Comment