పోస్ట్‌లు

హృదయపు అర..

చిత్రం
ఏం చెపితే నమ్ముతావు నువ్వు.. రాత్రి కలనంతా ఆక్రమించి నా ఆలోచనా దారుల్ని  చుట్టుకున్నావని చెప్పనా వర్షం తరువాత లేతరెమ్మలు గాలికి వణుకుతూ నిన్నే  గుర్తుచేసాయని చెప్పనా పగలంతా పేరుకుపోయిన దిగుళ్ళను రాత్రికి నీ ముందు దింపుకున్నాను.. చెదిరిన స్వప్నంలాగా వచ్చి పోయిన నీకేం తెలుసు.. సాయంత్రాలు అరవిసిన  సన్నజాజుల్ని అడిగి చూడు. అవే చెపుతాయి.. కొంచెంసేపన్నా నందివర్దనంలా విచ్చుకుని చూడు. ఈ మనసెంత వయ్యారంగా గారాలు పోతుంది తెలుస్తుంది. కాలపు ఉచ్చుల్లో బిగుసుకున్న నీకేం తెలుసు.. ఈ కౌగిలి నీకోసం కాచుకుందనీ.. నీ స్పర్శకై ఈ దేహం అరను తెరిచినపుడు తెలుస్తుంది మోహంతో రగిలే నా హృదయాన్ని అడుగు నువ్వు చెప్పలేని ఊసులన్నీ గుసగుసగా వినిపిస్తుంది. వింటావా మరి..

ఏదీ?

చిత్రం
  ఈ వర్షంలో మెరుగుపెట్టిన  దిగుళ్ళన్నీ నా నుంచి వేరైపోయి చెట్ల కొమ్మల్లో చేరి నవ్వుతున్నాయి. ఏదీ? పగలంతా గాలిలో చక్కర్లు కొట్టి నా కూడా బోలెడు కబుర్లు మూటగట్టుకుని రాత్రికి నీ గుండెలోకి చేరతాను. ఎన్ని చీత్కారాలో ఎన్ని వెక్కిరింపులో మరెంత అలుపులోనో ఆవేశాన్ని అణచుకుని పైపూతగా నీ ప్రేమను పూస్తాను. సుందర దృశ్యాలను  నీతో కలిపి కలగంటాను ఒక్కోసారి నువ్వూ నాతో వస్తావు మరోసారి నేను ఒంటరి బాటసారినై సాగిపోతాను. ఒంటరితనం మళ్ళీ వెక్కిరింపుగా నన్ను గురుతు చేసుకుంటుంది. వెకిలిగా వెర్రిగా కేకలు వేస్తుంది దానికి తెలుసు నువ్వు రావని నాకే తెలియంది. అయినా నీ ఊహ వదలదు.. దిగుళ్ళ బావిలో కూరుకుపోయి నిశ్శత్తువుగా ఆగిపోతాను మళ్ళీ నీ ఊహ నెమ్మదిగా తల  నిమురుతూ నాలోకి ప్రవేశిస్తుంది.

ప్రియా..! ఓసారి వొచ్చి పో ఇటు..

చిత్రం
 ప్రియా..! ఓసారి వొచ్చి పో ఇటు.. మాయచేసి మత్తుజల్లి హృదయానికి హత్తుకున్న నీ గురించి ఘాటుగా ఓమాట చెప్పనా.. నీ చూపులతో ఆశచూపి ప్రతి ఉదయాన్నీ బద్దలు చేసుకుని ఎప్పటిమల్లే అమృతాన్ని ఒంపిపోతావు.. నీరసించి, అలసిపోయి నిన్ను హత్తుకుంటానా కౌగిట్లో కరిగిపోతావు వొంటరై విరహమోర్వలేక విసుగుచెందిన నాకు  నీ పలుకుచూపి మత్తెక్కిన నీ కళ్ళతో  నీలోనికి లాక్కుపోతావు పుట్టుకొస్తావు వెంటాడతావు ఆవరిస్తావు కలగా..కవ్వింపుగా నువ్వు నా వాడివి ఉదయానికి ఆనందాన్ని పులుముతూ నా ఎదుటే నువ్వు మాయమైతే రాలిపడే పూల మల్లే ఒణికిపోతాను.. మళ్ళీ తిరిగిచూస్తే మాయమవుతావు నిద్ర నటించి దూరంగా తోసిపోతావు.

పసితనం..

చిత్రం
అమ్మ కొంగు పట్టుకుని జోల పాటకు జోగుతూ ఊగే సంగీతం లాలి పాటై నిద్ర పుచ్చుతుంది. గిట్టల చప్పుడుతో చెదిరిన ఆవులమందను చూసి పరవసించి పాడేది మోగే పిల్లనగ్రోవి తూలుతున్న నిద్ర ముఖాలకు నాన్న తెచ్చిన మిఠాయి పొట్లం తాయిలం అమ్మవారి ఊరేగింపుకు  అతిథిగా వచ్చేది రథచక్రాలకు హుషారు నింపేదీ ఈ బుడంకాయలే నులకమంచం చుట్టూ చేరి ఆకాశ రహస్యాల్ని చేదిస్తూ  తలలూపే  బుల్లి శాస్త్రవేత్తలు వీళ్ళు గుడిలోని దీపాలు చీకటిని ఎత్తుకుపోయిన రోజు  అగరబత్తీల వాసనల మధ్య  చక్రపొంగలి నైవేద్యం  దోసిళ్ళకు చాలనంత ఇసుక తిన్నెల మీద ఆటలాడి అలసిపోయి  ఇల్లు చేరిన పసితనం ముందు పడవంత సంతోషాన్ని  రెక్కలాడిస్తూ  పిచ్చుక మనసు గాలిలో గిరికీలు కొడుతుంది.

ఏలా మరిచిపోను.

చిత్రం
 నీకోసం వేల క్షణాలు  అరువు తెచ్చుకున్న  ఆ రోజులు మళ్లీ తిరిగి  వస్తాయని అనుకోలేదు.. అప్పటి రోజును మరిచిపోలేదు.  వానచినుకుల అక్షింతలు  ఈరోజు అక్షరాలుగా  అమరిపోతాయనీ..అనుకోలేదు. మబ్బల్లే ఎదలో చేరి కురిసిన అకాల వర్షానికి నాలో తడవని భాగమే లేదు. కోర్కె రెక్కలు కట్టుకుని ఎగిరిన రోజును మరిచిపోలేదు. నీ చేయి అందించిన రోజును ఏలా మరిచిపోను. గాలికి ఊగే చెట్లమాటున నిలబడి  తడిచిన దేహాలను ఆరబెట్టుకున్న క్షణాన్ని ముద్దుకున్న హద్దులు చెరిపి పెదాలను చెరిసగం పంచుకున్న గడియలను ఏలా మరిచిపోను.

సాయంత్రం నవ్వుతుంది.

చిత్రం
 ఒంటరిగా కూర్చుని ఆలోచనలు చిలికినపుడు చిగురులు వేసిన చిన్నతనం కనిపిస్తుంది. బాల్కనీ కొసల్లో నిలబడి  చూస్తుంటే పరుగులెత్తి కలలు కన్న పసితనం వెక్కిరిస్తుంది. ఈ భయంకర ఏకాంతం మరిచిపోయిన గురుతులెన్నో తడుముతూ ఎన్నో  జ్ఞాపకాలను నిద్ర లేపుతుంది. స్నేహితుల కబుర్లు అమ్మ విసుర్ల మధ్యలో మధ్యాహ్నం పంచుకు తిన్న పప్పన్నం జ్ఞాపకంగా  తడుముతుంది పొలిమేర్లలో గంతులేస్తూ ప్రేమకోసం వీధులన్నీ వెతికిన యవ్వనం  నవ్వుతుంది తోటలోని సీతాకోకలన్నీ పట్టు పావడా కట్టుకుని అల్లుకున్న కల తరుముతుంది. సంధ్యాకాశంలో చెట్లని  పెనవేసి గాలి నీడన సేదతీరిన సాయంత్రం నవ్వుతుంది. బెరుకు గుండె వదులుకున్న ప్రేమలేఖ చిత్రంగా వాస్తవంలోకి చొరబడుతుంది. పక్షుల్లా రెక్కలు లేవని ఎగిరెగిరి పడే ఏకాకి  హృదయాన్ని తోడు కోసం  గతం వైపు పంపుతుంది.

ఏటి ఒడ్డున

చిత్రం
  ఏటి ఒడ్డున ఎన్ని వేల అడుగులో నావి.. ఎన్నివేల గురుతులో మనవి. ఆషాడపు ఛాయతో ఎర్రని సంధ్య దీపపు వెలుగులో నీ కోసం ఎన్ని ఎదురుచూపులో ఖర్చు చేసాను.. ఏదీ..నువ్వు రావే. నీడన నిలబడిన శ్రావణాన్ని చామంతుల సొగసులు అరువిచ్చి పొమ్మన్నాను. గలగల గాజుల మోతలతో కాలి మువ్వలు సందడిలో కనిపిస్తుందా నా నిరీక్షణ