పోస్ట్‌లు

వికసించిన తామరల్లే...

చిత్రం
  వికసించిన తామరల్లే... చుట్టుకుపోయే అందం  ఆ రాతిరి సొంతం. చందమామ చెదిరిన  మబ్బల్లే మెరుస్తుంది చుక్కలు తోకచుక్కల్లా  రాలి పడుతున్నాయి చప్పుడు లేని వీధులంట  నా చూపులు చక్కర్లు  కొడుతున్నాయి. అంతా నిశ్శబ్దం.. ఓ ఇంట దిగాలుపడి  మినుకు మినుకు మనే దీపం మరో ఇంట వాలిన చీకటి నగరం మౌనంలోకి జారిన వేళ నేనో బాటసారిని వెతుకుతున్నాను వీధి వీధి నీకోసమే నన్ను విడిచి పోయిన నా నీడ కోసం వెతుకుతున్నాను విరాగినై..

ఇదంతా ఎంత స్వార్థం

చిత్రం
 నాది ఎంత చిత్రమైన హింసో తెలుసా! కలలు, కన్నీళ్లు రెండూ నాకు బంధువులు దివిటీలకు మల్లే ఈ కళ్ళు  కాచుకుంటాయి నీకోసం చీకటిలో కూడా  నీ ఛాయనే కలగంటాను దారిలో ఆ ఇసుక నేలల్లో నీకోసం అడుగులు వేస్తూ వస్తాను ఇదంతా ఎంత స్వార్థం మేఘాలు నాతో అంటాయి ఎందుకు అంత ఆత్రమనీ.. నీరు, ఈ గాలి జత చేరి  వెక్కిరిస్తాయి కాలానికీ వెక్కిరింపే తీరా నువ్వొచ్చే ఘడియ కనురెప్ప వాలినంత సేపు ఉండదు ఇట్టే మాయమవుతావు నా వగలన్నీ మూట గడతానా! అవీ ముట్టుకోవు.. ఏం ప్రేమో ఇది.

నేను...

చిత్రం
పరిమళాలు విరిసిన వనంలో  విహరిస్తున్న వేళ నేనో చకోరాన్నై  కొమ్మల్లో వాలిపోతాను. గాలి విసురుకు ఎగిరి  వచ్చిన ధూళి కణంలా ఆటలాడే వేళ చిన్న  పాపాయినైపోతాను. కళ్ళు మిరుమిట్లు గొలిపే  కాంతి సోకినపుడు చిత్రమైన చిరునవ్వుగా  పూస్తాను. వానాకాలం వచ్చిన  మట్టి వాసనలతో మకరందమై మెరుస్తాను. రాతిరి కన్న కలలన్నీ సాయంత్రాలు నిజమైనప్పుడు నేనో రాకుమారినైపోతాను. తేనెపట్టును రుచి చూసేప్పుడు ముసలామె నోటికి పూసినంత ఆనందపడతాను. ఒక్కోసారి పూలమాలలు కట్టి చిన్ని కన్నయ్యకు వేస్తూ గోపికనైపోతాను. వసంతం వచ్చి వాలిన వేళ కోయిలమ్మనై మావిచిగురుకై కాచుకుంటాను. కలగన్న ప్రియుని ఒడి చేరినపుడు ఎన్నో స్వయంవరాలు గెలిచిన వీరుడిమల్లే మురిసిపోతాను.

ఈ గాలికి...

చిత్రం
ఈ గాలికి సుగంధాన్ని  ఎత్తుకెళ్ళడం తెలుసు మనసులో మరిగే ఆలోచనలకు  రూపం ఇవ్వడం తెలుసు చెవిలో గుసగుసలు  ఆడటం తెలుసు ఈ తెమ్మరకు వయసు గిలిగింతలు తెలుసు నీ జ్ఞాపకాలన్నీ ఎగిరి  వచ్చి వాలినపుడు పెదాల మీద చిరునవ్వయి  మెరవడం తెలుసు వేళకాని వేళ నీ రాకను  కలగనడం తెలుసు వేడి నిట్టూర్పులు వదలి  వెచ్చదనాన్నివ్వడం తెలుసు ఏం తెలియదని ఊరికే అలా  వచ్చాననీ చెప్పి  పోవడమూ తెలుసు.. నీకు తెలుసా! ఈ గాలికి మాయమవడం  తెలుసు

చీమలు

చిత్రం
  చీమలు పంచదార డబ్బా చుట్టూ నేల పడ్డ పాల చుక్క చుట్టూ ఎక్కడ చూడు చీమలు హడావుడిగా తిరిగేస్తూ,  ఆహారాన్ని ఎత్తుకుపోతూ.. బానిసత్వం మరిగిన చీమలు మట్టిని దొలిచి పుట్టలు  గుట్టలు చేసి రాజ్యాలు ఏలే చీమలు మనిషికి మల్లే స్వేచ్ఛ  కోసం పోరాడవు బానిసలుగా జీవితాన్ని  సాగనంపే చీమలు వగల యువరాణికి  వంగి వంగి వందనాలు పెట్టె శ్రమ జీవులు కాళ్ళకింద ప్రాణాలు  విడిచి క్షణ బంగురపు జీవితాలు గడిపే  చీమలు

నువ్వు నా సమస్తానివి..

చిత్రం
చెట్లు పోగేసుకు వచ్చిన వసంతానివి ఆ పూమాలలోని మల్లేల సుగంధానివి పాత పుస్తకంలో చదివి వదిలిన పేజీవి చీకటిలో వెలిగే దీప కాంతివి ఒక్కోసారి... పాపాయికి పాడే జోల పాటవు నాలో ధైర్యాన్ని నింపే స్నేహానివి గాలికి ఎగిరే చీర కొంగువు హద్దులే లేక పొంగే ప్రేమవు మరోసారి...  ఉరిమే మేఘానివి వేళ దాటిన భోజనానివి జడలోని మందారానివి ఇంకోసారి... నాలో ఉరకలేసే ఉత్సాహానివి నన్ను దోచుకున్న హృదయానివి అలకలన్నీ తీర్చి బుజ్జగించే అమ్మవు ఇప్పుడు మాత్రం నా సమస్తానివి

ఎవరికి తెలుసు...

చిత్రం
కలలు అలలుగా జారుకున్న నిద్ర  ఎప్పటిమల్లే అదే నిరాశ అవే ఉదయపు నీడలు రాత్రి లోకి కుంగిపోతున్న  సాయంత్రాలు వాలు కళ్ళలో ఆ చీకటి వెనుక నేలరాలని కన్నీళ్ళు మనసు కావల దాగున్న  రూపమే లేని ఆవేదన వెలుగు లోతుల్లోకి ప్రయాణం  కట్టిన సూరీడు నిలువుటద్దం ముందు తేలని  సొయగపు లెక్కలు గడిచిన ఏకాంతపు  ఆనవాళ్లు తడుముతూ విరహంతో మెరిసిన చిరునవ్వు జరగని సమయానికి  చీదరింపులతో వేసిన సంకెళ్లు దీవిటీలకు మల్లే వెలుగుతూ  నాకంటి పాపలు