పరిమళాలు విరిసిన వనంలో
విహరిస్తున్న వేళ నేనో చకోరాన్నై
కొమ్మల్లో వాలిపోతాను.
గాలి విసురుకు ఎగిరి
వచ్చిన ధూళి కణంలా
ఆటలాడే వేళ చిన్న
పాపాయినైపోతాను.
కళ్ళు మిరుమిట్లు గొలిపే
కాంతి సోకినపుడు
చిత్రమైన చిరునవ్వుగా
పూస్తాను.
వానాకాలం వచ్చిన
మట్టి వాసనలతో
మకరందమై మెరుస్తాను.
రాతిరి కన్న కలలన్నీ
సాయంత్రాలు నిజమైనప్పుడు
నేనో రాకుమారినైపోతాను.
తేనెపట్టును రుచి చూసేప్పుడు
ముసలామె నోటికి పూసినంత
ఆనందపడతాను.
ఒక్కోసారి పూలమాలలు కట్టి
చిన్ని కన్నయ్యకు వేస్తూ
గోపికనైపోతాను.
వసంతం వచ్చి వాలిన వేళ
కోయిలమ్మనై మావిచిగురుకై
కాచుకుంటాను.
కలగన్న ప్రియుని ఒడి చేరినపుడు
ఎన్నో స్వయంవరాలు గెలిచిన
వీరుడిమల్లే మురిసిపోతాను.
No comments:
Post a Comment