తొలివలపు....
ఉదయం ఆరుగంటల నుంచీ అప్పాజీ కొట్టుమలుపులో తనకోసం ఎదురుచూస్తున్నాను. ఈ అభిగాడి ప్రేమ గోల నా పీక్కి చుట్టుకునేలా ఉంది. శైలూ అంటే వాడికి ప్రాణం.. ఈ ఊరు వచ్చిన తరువాత నాకు అభీ తెలిసింది ట్యూషన్ లోనే. మొదటిసారి మానాన్న పంతులుగారి ట్యూషన్ లో చేర్పించినపుడు మా ఎనిమిదో తరగతిలోనే కొత్తగా చేరిన అభీని ఆయన తమ్ముడి కొడుకని పరిచయం చేసారు పంతులుగారు. అభీ నన్ను చూసి చిన్నగా నవ్వాడు. అంతక మునుపు క్లాసులో తెలిసినా ఎవరితోనూ అంతగా మాట్లాడేవాడు కాదు. ఇద్దరం ఒకే క్లాసు గనక ఒకే దగ్గర కూర్చునే వాళ్ళం. తనకు లెక్కలు బాగా వచ్చు. నాకు తెలియని విషయాలన్నీతన దగ్గరే నేర్చుకునేవాడిని. వాడికి నా అంత చురుకుదనం లేదు. కలుపుగోలు తనం తక్కువ. ఇద్దరం స్నేహితులమయితే అయ్యాం గానీ, ప్రాణ స్నేహితులం కావడానికి మరికాస్త సమయం పట్టింది. పరీక్షలైపోయి ఈలోపు వేసవి సెలవులు రాగానే వాళ్ళ ఊరు నుండీ నాకోసం లెక్కల గైడు తెచ్చాడు. అది వాళ్ళ అన్నయ్యదట. అప్పటితో ఎనిమిది నుండీ తొమ్మిదో తరగతికి ప్రమోషన్ వచ్చేసింది. అదిగో ఇక్కడి నుండే మా ఇద్దరి స్నేహానికీ, వెరసి నాకు కష్టాలు మొదలయ్యాయి. ఓరోజు మాత్రికలు చేసుకుంటూ బిజీగా ఉన్నాం. పంతులుగారు అరు...