పోస్ట్‌లు

ఎవరు...

చిత్రం
  వృథాగా రాలిపోయే కాలానికి తోటమాలి ఎవరు? కాలపు గులాబీలను దోచుకెళ్ళే పసివాడు ఎవరు? నీడలుగా జాడలుగా నన్ను అల్లుకున్న పరిమళం.. నీ చిగురు పాదాల ముందు ఉంచేందుకు పూలు కోసుకొద్దామంటే.. ఉషస్సు కోసం ఉర్రూతలూగి పూల గుబాళింపుకు కట్టుబడిన తుమ్మెదలు సాక్ష్యమవుతాయేమో తెలియదు..

కల....

చిత్రం
పాతబడిన జ్ఞాపకాల సంతలో పరచబడ్డ గురుతులెన్నో కొన్ని రోజులు..కొన్ని క్షణాలు అన్నీ జ్ఞాపకాలే.. మెరిసి మాయమయ్యే కలల మధ్య మలినం లేని నీ ఊహ ఊపిరై హత్తుకుంటుంది. ఎన్నెన్ని పదునైన చూపులో బిగించి పట్టుకున్న కౌగిళ్ళు.. ఎంగిలి ముద్దుల కవ్వింపులు దీపాల వెలుగు జిలుగుల్లో తడబడి సాగే నీ ఛాయను దగ్గర చేసుకుంటూ... మబ్బుల్ని కప్పుతూ మూల్గుతూ శోక జీరను కళ్ళకు వదిలి మాయమవుతుంది కల. లోలోన రహస్యాల్ని తోడుతూ రెక్కల్ని కొట్టుకుంటూ ఆకాశం వైపు ఎగిరిపోతుంది.

వెలుగై వెంబడిస్తూ...

చిత్రం
 ఎక్కడో దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి  వెలుగు రేఖలు..రాతిరి నా ఒంటరి కాలయాపనకు చిక్కి  మిగిలిన శోక హృదయాన తృప్తిని నింపుతూ..తాకుతుంది నన్ను. నీలి దీపాలను తాకుతూ..దేహమంతా వెన్నెల నింపుకుంది రాత్రి.  వెలుగై వెంబడిస్తూ తరముకొచ్చింది ఉదయం. పక్షులన్నీ ఏక కంఠంతో కిచకిచల గానం అందుకున్నాయి..

తేలుతూ కనిపించి...

చిత్రం
  వెనక్కు వెళ్ళే కొద్దీ గత ప్రేమలు పూల పడవల్లా జ్ఞాపకాల్లో తేలుతూ కనిపించి నవ్వుతాయి. నా ఒడి నిండా మధుర స్వప్నాలతో నిండిన రాత్రులు నీ కౌగిలిలో గుభాళించిన సంధ్యా పరిమళాలు ఆ క్షణం నవ్వు నాకిచ్చిన సంతోషాలు చీకటి సాయంకాలాల్లో ఇవన్నీ కొలుచుకున్నప్పుడు చిక్కటి నిరాశ.. గాలిలో కలిసిపోయిన కలలుగా కనిపిస్తాయి. మరి ఇప్పుడు.. తెంపుకు వచ్చిన పూల పుప్పొడి నేలరాలినట్టూ ఉంటాయి నీ ఊహలు.. ఒకదాన్నొకటి తోసుకుంటూ నేల రాలతాయి.. ఏముంది ఇప్పుడు మన మధ్య ఖర్చయిపోయిన కాలపు ఆనవాళ్లు తప్ప

నిరీక్షిస్తూ..

చిత్రం
  రాతిరి అంటుకుని  ఆరిపోయిన కోరికలా కరిగి నీరైన చిరునవ్వుతో  నిరీక్షిస్తాను నీకోసం. మంచు కు‌రిసిన ఉదయం  వెచ్చగా మారిపోయేంతదాకా అపుడే కాలం దూరంగా  నెట్టివేసిన ప్రేమలా కలలెన్నో పూసి చిగురు  కొమ్మలను చేరతాయి. రాత్రి వెలుగు నీడల్లో ఒంటరితనం శాపమైన వేళ నీ ప్రేమ మత్తెక్కిస్తుంది. రంగుల పొలిమేరల్లో  మబ్బుల వెన్నెల పొర్లాడుతూ నిన్ను చేరుతుంది. ఆ క్షణాలన్నీ రాలిపోయాకా అనేక శరత్తుల దాకా నీకోసం నిరీక్షిస్తూ.. చీకటి దుప్పటిలో ముఖం దాచుకుంటాను.

చందమామే సగమైంది...

చిత్రం
  నీ హృదయాన్ని చేరే మార్గాన్ని వెతుకుతాను.. ఆ దారులన్నీ తెలిసినట్టే ఉంటాయి..గమ్యం చేరువైనట్టే కనిస్తుంది..అయినా నేనింకా నీకు వేయి ఆమడల దూరంలోనే ఉన్నాను. ఈ చల్లని వేళ వెన్నెలంతా పవిట కప్పి జడలో జాజుల్ని తురిమాను..సిగ్గుతో చందమామే సగమైంది. నాలో ఇంత చేసి చలికి ఒణుకుతావే..ఎండుటాకులా.. కదిలే పెదవులు, గుండె గడబిడలు ఈ ఒంటరితనాన్ని జీవితం చివరికంటా అరిగిపోనిద్దామంటే ఇవన్నీ అడ్డు..నా ఉనికి ఓ జ్ఞాపకం అయితే..ఎవరు వస్తారు సాక్ష్యం.

నిశ్శబ్దం పుట్టింది...

చిత్రం
  తగలబడుతున్న కలల కోటల మధ్య లోహపు ప్రేమలు  నవ్వుతూ నిలబడ్డాయి వెక్కిరింపుగా మిట్ట మధ్యాహ్నపు వేళ మ్రోగుతున్న గంటల సాక్షిగా సగం తెగిపడిన గుండెలో నిశ్శబ్దం పుట్టింది. నువ్వు ఎర్రగా మండిన ప్రతిసారీ ప్రేమంతా ఆవిరై ఆకు చివర  నీటి బిందువులా అంటుకుంది. పగుళ్ళిచ్చిన నేల నెరల్లో దూరి జ్వలిస్తున్న బాధను పెకిలించకు అప్పుడే ఈ వేదనంతా  గోతిలో కప్పబడుతుంది..  రగులుతున్న కోరికల్లే మళ్ళీ  పుట్టుకొస్తుంది..