పోస్ట్‌లు

2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎవరు...

చిత్రం
  వృథాగా రాలిపోయే కాలానికి తోటమాలి ఎవరు? కాలపు గులాబీలను దోచుకెళ్ళే పసివాడు ఎవరు? నీడలుగా జాడలుగా నన్ను అల్లుకున్న పరిమళం.. నీ చిగురు పాదాల ముందు ఉంచేందుకు పూలు కోసుకొద్దామంటే.. ఉషస్సు కోసం ఉర్రూతలూగి పూల గుబాళింపుకు కట్టుబడిన తుమ్మెదలు సాక్ష్యమవుతాయేమో తెలియదు..

కల....

చిత్రం
పాతబడిన జ్ఞాపకాల సంతలో పరచబడ్డ గురుతులెన్నో కొన్ని రోజులు..కొన్ని క్షణాలు అన్నీ జ్ఞాపకాలే.. మెరిసి మాయమయ్యే కలల మధ్య మలినం లేని నీ ఊహ ఊపిరై హత్తుకుంటుంది. ఎన్నెన్ని పదునైన చూపులో బిగించి పట్టుకున్న కౌగిళ్ళు.. ఎంగిలి ముద్దుల కవ్వింపులు దీపాల వెలుగు జిలుగుల్లో తడబడి సాగే నీ ఛాయను దగ్గర చేసుకుంటూ... మబ్బుల్ని కప్పుతూ మూల్గుతూ శోక జీరను కళ్ళకు వదిలి మాయమవుతుంది కల. లోలోన రహస్యాల్ని తోడుతూ రెక్కల్ని కొట్టుకుంటూ ఆకాశం వైపు ఎగిరిపోతుంది.

వెలుగై వెంబడిస్తూ...

చిత్రం
 ఎక్కడో దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి  వెలుగు రేఖలు..రాతిరి నా ఒంటరి కాలయాపనకు చిక్కి  మిగిలిన శోక హృదయాన తృప్తిని నింపుతూ..తాకుతుంది నన్ను. నీలి దీపాలను తాకుతూ..దేహమంతా వెన్నెల నింపుకుంది రాత్రి.  వెలుగై వెంబడిస్తూ తరముకొచ్చింది ఉదయం. పక్షులన్నీ ఏక కంఠంతో కిచకిచల గానం అందుకున్నాయి..

తేలుతూ కనిపించి...

చిత్రం
  వెనక్కు వెళ్ళే కొద్దీ గత ప్రేమలు పూల పడవల్లా జ్ఞాపకాల్లో తేలుతూ కనిపించి నవ్వుతాయి. నా ఒడి నిండా మధుర స్వప్నాలతో నిండిన రాత్రులు నీ కౌగిలిలో గుభాళించిన సంధ్యా పరిమళాలు ఆ క్షణం నవ్వు నాకిచ్చిన సంతోషాలు చీకటి సాయంకాలాల్లో ఇవన్నీ కొలుచుకున్నప్పుడు చిక్కటి నిరాశ.. గాలిలో కలిసిపోయిన కలలుగా కనిపిస్తాయి. మరి ఇప్పుడు.. తెంపుకు వచ్చిన పూల పుప్పొడి నేలరాలినట్టూ ఉంటాయి నీ ఊహలు.. ఒకదాన్నొకటి తోసుకుంటూ నేల రాలతాయి.. ఏముంది ఇప్పుడు మన మధ్య ఖర్చయిపోయిన కాలపు ఆనవాళ్లు తప్ప

నిరీక్షిస్తూ..

చిత్రం
  రాతిరి అంటుకుని  ఆరిపోయిన కోరికలా కరిగి నీరైన చిరునవ్వుతో  నిరీక్షిస్తాను నీకోసం. మంచు కు‌రిసిన ఉదయం  వెచ్చగా మారిపోయేంతదాకా అపుడే కాలం దూరంగా  నెట్టివేసిన ప్రేమలా కలలెన్నో పూసి చిగురు  కొమ్మలను చేరతాయి. రాత్రి వెలుగు నీడల్లో ఒంటరితనం శాపమైన వేళ నీ ప్రేమ మత్తెక్కిస్తుంది. రంగుల పొలిమేరల్లో  మబ్బుల వెన్నెల పొర్లాడుతూ నిన్ను చేరుతుంది. ఆ క్షణాలన్నీ రాలిపోయాకా అనేక శరత్తుల దాకా నీకోసం నిరీక్షిస్తూ.. చీకటి దుప్పటిలో ముఖం దాచుకుంటాను.

చందమామే సగమైంది...

చిత్రం
  నీ హృదయాన్ని చేరే మార్గాన్ని వెతుకుతాను.. ఆ దారులన్నీ తెలిసినట్టే ఉంటాయి..గమ్యం చేరువైనట్టే కనిస్తుంది..అయినా నేనింకా నీకు వేయి ఆమడల దూరంలోనే ఉన్నాను. ఈ చల్లని వేళ వెన్నెలంతా పవిట కప్పి జడలో జాజుల్ని తురిమాను..సిగ్గుతో చందమామే సగమైంది. నాలో ఇంత చేసి చలికి ఒణుకుతావే..ఎండుటాకులా.. కదిలే పెదవులు, గుండె గడబిడలు ఈ ఒంటరితనాన్ని జీవితం చివరికంటా అరిగిపోనిద్దామంటే ఇవన్నీ అడ్డు..నా ఉనికి ఓ జ్ఞాపకం అయితే..ఎవరు వస్తారు సాక్ష్యం.

నిశ్శబ్దం పుట్టింది...

చిత్రం
  తగలబడుతున్న కలల కోటల మధ్య లోహపు ప్రేమలు  నవ్వుతూ నిలబడ్డాయి వెక్కిరింపుగా మిట్ట మధ్యాహ్నపు వేళ మ్రోగుతున్న గంటల సాక్షిగా సగం తెగిపడిన గుండెలో నిశ్శబ్దం పుట్టింది. నువ్వు ఎర్రగా మండిన ప్రతిసారీ ప్రేమంతా ఆవిరై ఆకు చివర  నీటి బిందువులా అంటుకుంది. పగుళ్ళిచ్చిన నేల నెరల్లో దూరి జ్వలిస్తున్న బాధను పెకిలించకు అప్పుడే ఈ వేదనంతా  గోతిలో కప్పబడుతుంది..  రగులుతున్న కోరికల్లే మళ్ళీ  పుట్టుకొస్తుంది..

విముక్తి..

చిత్రం
  అంగీకరిస్తాను...ముక్కలైన ఈ హృదయపు గదిని దాటి నువ్వు చేరగలవనీ..ప్రపంచ ధ్వనుల్లోంచి నా రక్తం పారే నరాల మార్గాల వెంట నీపై ప్రేమ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంది. నీ నిరాదరణే బాకై గుచ్చుకుంది గుండెలో..వీలైతే కాస్త సాయం చేయి..ఈ బాధ నుంచి విముక్తిని ప్రసాదించు..

నీ కబుర్ల కోసం..

చిత్రం
  ఆ నదికి ఒడ్డున సాయంత్రాలు నిలబడి ఎదురుచూస్తాను. పిట్టలు తెచ్చే నీ కబుర్ల కోసం నా స్వప్నాల్లో విచ్చుకున్న నీ సందేశాన్ని అవి ఎత్తుకొస్తాయి. గాలికి ఊగే తోరణమల్లే ఊగుతుంది మనసు ఎప్పుడో లీలగా దూరం నుంచి నువ్వు పిలిచే పిలుపుకి హృదయం కోతపడి అరనిమిషం ఆగుతుంది. చేతికి అంటిన ఆవిరి కురిసి వెలిసిన వాన గాలికి తలలూపే ఆకులు నిరాశ చెందని హృదయపు అర కాసిన్ని జ్ఞాపకాలన్నీ ఓచోట పోగేసి చూసుకుంటానా అప్పుడూ.... దోసిట్లో ఇసుకమల్లే జారిపోతావు. హఠాత్తుగా రోదిస్తూ ఒక్క క్షణం తీరిక లేని సమయాల్లో కూడా నీ ఊసు గుండెను పిండుతుంది. అన్నీంటిలోనూ పాతను తవ్వుకుంటో జ్ఞాపకాలను పోగుచేసుకుంటూ...

జాలినెరుగని హృదయం తనది...

చిత్రం
 గడ్డి పొదలు చేసే సవ్వడిని విన్నావా ఎప్పుడైనా.. గాలికి తలలూపుతూ..పొగమంచు కమ్ముకునే వేళ నీ ఊసును ఎత్తుకొస్తాయి. నీ జ్ఞాపకాలతో తలనూపుతూ నేనూ అట్లాగే.. రాతిరి పూసిన బీరపువ్వు అందం నీనవ్వుది .. ఆకులపై కురిసే మంచు బిందువుల మల్లే మనసులో నిలుస్తుంది ఒక్కోసారి. జాలినెరుగని హృదయం తనది... ఎప్పుడూ దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది ఇట్టే చేజారిపోతుంది..తామరాకుపై నీటిబొట్టల్లే.. మరీ ఆలస్యం చేయకు..మనసంతా గాయాలే ఇక్కడ.. నీ రాకతోనైనా కాస్త సాత్వంతన కలుగుతుందేమోననీ నా తొందర.

హృదయపు రొద..

చిత్రం
వేగంగా కొట్టుకుపోయే జీవితపు గందరగోళంలో చెదరని చిత్రానివి నువ్వు. నిశ్చలంగా జ్ఞప్తికి వచ్చి సాయంత్రపు గాలికి మల్లే తాకి పోతావు. ఎగిరే కురులకు తెలుసు నీ స్పర్శ. నిరంతర నా ప్రేమను వెక్కిరిస్తూ అంతటా నిర్జీవమైన రాత్రి పరుచుకుంది. మనసు తలుపులను బద్దలుకొట్టే శక్తినివ్వు అలిసిన ఈ హృదయాన్ని జ్ఞాపకం ఉంచుకో ఎన్ని రాత్రుల్ని ఖర్చు చేయాలో గురకరాళ్ళను ఎత్తుకొచ్చి లెక్కవేయి. మిణుకు మిణుకుమనే మిణుగురులు వాలిన హృదయానికి ఎంత తేజస్సో తరచి చూడు ప్రేమకు మోహానికి మధ్య ఏది నిలుస్తుంది మబ్బుల ముసుగు కప్పుకుంది ఆకాశం చూడు. నువ్వు పిలిచే అపురూపమైన మాట ఏమిటది..? బావున్నావా ప్రియా..ఎంతటి నిర్మలత్వాన్ని నింపుతుందో నాలో ఆ పిలుపు కోసమే వేచి ఉన్నాను.. తడిచిన హృదయపు రొద సాక్షిగా..

ప్రియా...! నిన్ను ప్రేమించాను.

చిత్రం
గడిచిన ప్రతి రాతిరికొక కవితను బహుకరిస్తాను అందుకో... నీ స్మృతి లోంచి మరో జ్ఞాపకంలోకి జారిపోతూ..వసంతాన్ని వెతుకుతాను. పారిజాతపు పరిమళాన్ని తడుముతూ నీ వెనుకే నిలబడినప్పుడు.. మేఘ సందేశాన్ని, తారల అల్లరినీ నీ ప్రేమలోనే చూసాను. మూసిన తలుపుల వెనుక నీ కోసం వేచి ఉన్నాను. గతాల ఆనవాళ్లతో అవే బాధలు అవే కన్నీళ్ళు నన్ను తరిమినపుడు నిస్సారంగా... నిర్దయగా కరిగిపోయే ఉదయాలకు నువ్వో వ్యాపకానివి. ఈ కోర్కెల గుయారానికి దారిచూపే దివిటీని ఎత్తి పట్టుకో..ఎప్పటికీ చల్లారని విరహ జ్వాలలు ఇవి నాలోని నిశ్శబ్దాన్ని చీల్చుకు వచ్చే ధ్వని తరంగాలకు ఎక్కడో దూరంగా నీ మాటలో నేను కనిపిస్తాను.

నా జ్ఞాపకాల గని..నువ్వు

చిత్రం
  ఎప్పటికైనా నీ పరిమళాన్ని సెంటుగా పూసుకోవాలి. ఎప్పటికైనా నీ సమక్షాన్ని అందరికీ చూపాలి..గాలిలో తేలివచ్చే ప్రేమను పట్టి అప్పగించాలి. విత్తు నాటిన చేతి స్పర్శను మరిచిపోతుందా చెట్టు.. నీళ్ళులేని ఈ బావిలో ఎన్ని జీవాల రొదలు పడి ఉన్నాయో..లోలోతుకు పోయోకొద్దీ నేనూ ఉన్నాను. నా జ్ఞాపకాలను తవ్విపోస్తున్నాను. ఇకేం దొరకనున్నాయో.. ఎన్నిమార్లు ఆలోచనల్లో మోస్తూ తిరిగానో నిన్ను..ఎన్నిమార్లు కన్నీళ్లు జారవిడిచానో...ఏనాటి బంధమిది.,ఎందుకు పదే పదే గుర్తొస్తావో..నిశ్శబ్దంగా జరిగే రాతిరిలా మెల్లగా..

నీ చేతులతో అడ్డుకో

చిత్రం
  చంద్రుడు సముద్రపు లోతుల్లోకి తొంగి చూసినట్టు ఆ చెట్ల వెనుక నీడలోంచి తీక్షణంగా మెరిసే నీచూపు ప్రకాశించే ఈ కళ్ళ వెనుక కన్నీళ్ళకు ఆనకట్ట నీ ప్రేమా వాత్సల్యాలే కానీ లోన అల్లుకుపోయిన ముళ్ళపోదలెన్నో ఉన్నాయి వాటి మాటేమిటి..? ఈ హృదయ భారాన్ని నీ నవ్వుతో తగ్గించు నీ హృదయపు విచారాన్ని అప్పుడు పంచుకుంటాను. నాముందు జీవితపు సారాన్నంతా నీ రెండు కళ్ళలోనూ చూస్తున్నాను. ఈ గుండెను చీల్చుకుంటూ వస్తున్న గత కాలపు జ్ఞాపకాలను నీ చేతులతో అడ్డుకో నాపై నీ ప్రేమ దృఢమైనది.. ఎప్పటికీ నిలిచి ఉంటుందని విశ్వసిస్తాను.

ఎప్పుడూ నీ తలపులే..వెంటాడేది..

చిత్రం
 నా ప్రేమను విశ్వసించు..ఈ హృదయపు దుఃఖాన్ని పంచుకో..నా ప్రేమ గాఢతను నీలో నింపుకో..పద్మం వికశించినట్లుగా గుభాళిస్తాను. నేను విషాదాన్ని కాదు..కన్నీటిని నింపుకు తిరిగేందుకు.. నేను సంతోషాన్ని కాదు చిరునవ్వును పూసేందుకు..నేను ప్రేమను కాను నీ వియోగాన్ని మోసేందుకు నేను నీ అనంతమైన హృదయస్పందనల సవ్వడిని..ఎప్పుడూ నీ తలపు స్మృతిలో కాలాన్ని ముందువెనకలు చేసి నిన్ను ఆరాధించే మీరాను..

చీల్చుకువచ్చే స్వప్నాన్ని...

చిత్రం
రాతిరి అరుగు మీద రెండు నగ్న దేహాలు నిన్నను వెతుకుతూ వెక్కి ఏడుస్తున్నాయి. అందులో నా శోక హృదయపు తపన కూడా ఉంది. ఆవేశాన్ని గుబులును దూరంలో చూస్తూ విరహ సహవాసంలో ఏకాంత వాసమది. అతని గుండెలు విశాలంగా చిక్కటి దారులు వేసి ఉన్నాయి. తప్పిపోతాననే భయం కలిగిస్తూ.. మళ్ళీ ఉదయం రాబోతుందని గురుతుచేసాడు.. నిద్ర చెదిరి అలసి రొప్పుతుంది మనసు. నన్నిట్లా నిర్దయగా వదిలిపోవద్దని కరుణించమని వేడుకున్నాను. ఒంటరినై నిదుర రాక నగరాల్లో తుఫాను రాత్రుల్లో సంచరించే హోరుగాలినైపోతానని వేడుకున్నాను. చీకటిలోంచి చీల్చుకువచ్చే స్వప్నాన్ని గురుతుచేసాడు. ఎంత కోత గుండెకు ఎంతరోత ఒరుసుకున్న హృదయపు గాయాన్ని అతనిముందుంచాను. నిర్దయగా తోసి నన్ను విదిలించి అడుగులు వేసాడు..రేపటి కన్నా భయంకరమైన ఎడబాటది..మళ్ళీ ఒంటరి పక్షినై హృదయాకాశంలో విహరిస్తాను రేపు.

నువ్వూ అలానే అనుకున్నావా..

చిత్రం
ఇప్పుడు నేనున్న కలలోనే నువ్వూ ఉన్నావు.. ఇద్దరం పక్క పక్కనే.. నన్ను హత్తుకున్న ఆచేతులు.. నీ ఒంటి వాసనా తప్ప మరే లోతైన అనవాలు నాతో రాలేదు ఆరోజున.. గట్టిగా ఒత్తిన నీ చేతి స్పర్శ.. పెదవుల తడి.. ఊపిరి వదిలిన ఆనవాళ్ళే కూడా తెచ్చుకున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆ దృశ్యం పాతబడిందేమో కానీ.. నువ్వు నాలో రేపిన అలజడి అలానే ఉంది.. నువ్వూ అలానే అనుకున్నావా.. తిరిగి వస్తున్నప్పుడు నీచూపులు నాతో అదే చెప్పాయి.. గురుతుంచుకో.. ఆ నల్లని వలయాన్ని.. మన నిద్దురను చెరిచేసి నిన్ను దూరంగా తీసుకుపోతుంది. లోపలెక్కడో దిగులు.. నువ్వు మాయం అయిపోతావనీ.. మరణం అంచులు కదా నిన్ను నానుంచీ దూరం చేసేదనీ.. నాకో నిశ్చింత..