Saturday, 12 December 2020

చలం రచనా తలం మీద.. అమీనా

 http://pustakam.net/?p=21223

 11 DECEMBER 2020 

వ్యాసకర్త: శ్రీశాంతి

ఈ భూమి మీద ప్రాణం పోసుకున్న ప్రతి జీవికి అన్నపానీయాలు ఎంత అవసరమో మరో ప్రాణి నుంచీ ప్రేమను పొందడం కూడా అంతే అవసరమైన క్రియగా మలుచుకోబడింది. ప్రేమించడం, ఆ ప్రేమను పొందగలగడం రెండూ చాలా పవిత్రమైన కార్యాలే.. అయితే నడుస్తున్న రోజుల్లో ప్రేమకు అర్థాలు మారిపోతూ వస్తున్నాయి. ప్రేమను వ్యక్తపరచడంలోనూ.. ప్రేమను పొందడంలోనూ రకరకాల ధోరణలు పద్దతులు మారుతున్నాయి.. అయితే వీటన్నింటికీ తన లెక్కను ఒకదాన్ని ముందే వేసి అక్షరాల్లో ముద్రించేసి ఉంచాడు చలం. ప్రేమంటే మనకున్న అంచనాలను తారుమారు చేసేసి.. ఓరేయ్ ఇదికాదురా ప్రేమనీ.. తన పుస్తకంలో తలదూర్చి తలెత్తే లోపు ప్రేమకు అర్థాన్నీ.. స్థిరమైన అభిప్రాయాన్నీ ఇవ్వగల ధీశాలి చలం. చలాన్ని చదవడవడమంటే మరో లోకానికి పుస్తకం, ఓ పెన్నూ పట్టుకుని పయనం కావడమే.. చుట్టూ ఏం జరుగుతున్నదో మరిచిపోయి ఆ మరో లోకంలో విహరించడానికే సిద్ధం కావడం. ఆయన రచనల్లో అమీనా ఓ అందమైన రచన. పట్టుకుంటే కందిపోయే అందాన్నీ.. మనసుని మెలితిప్పే కోరికను, ఆరాటాన్నీ కళ్ళకు కనిపించి మనసుల్ని తడిమేసే రచన.

నబుకొవ్ లోలిటా గురించి విన్నప్పుడు ఆ రచనను చదవాలని మరీ బలంగా అనిపించింది. ఆయన రచనలో లోలిటా ఎంత అందంగా లేలేత ముడుచుకున్న అందాన్ని దాచుకుందో అంతకన్నా చక్కగా అమీనా మన లోకంలో ఒదిగిపోతుంది.

అమీనా చదవడంతో చలంలో దాగున్న చాలా కోణాలు కనిపిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా పాత్రల వెంట పరుగులు పెట్టడం కాకుండా పాత్రలతో ప్రయాణం కట్టేట్టు చేయగలడు చలం. అసలు కథలు ఏలా ఉండాలని మనకున్న ఇమేజ్ ను తన కథలకు ఉన్న రూల్స్ ని తానే బద్దలుకొట్టాడు ఈ రచనతో. తన రచనలు నాలాంటి ఏకలవ్య శిష్యులంతా ( పఠనం పరంగా) చదివే పుస్తకాన్ని దాచి దాచి చదువుకునే బాపతు కాకాండా కొత్తగా వెతుక్కుచదువుతున్నవారికి అమీనా గట్టిపరిక్షే పెడుతుంది. నిర్లష్యాన్ని, బద్ధకాన్ని వదుల్చుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని, అర్థమైనంత అర్థం చేసుకోమంటాడు; అర్థం కాని వాటిని వదిలేసి ముందుకు సాగి, అతనికి ఉన్న అనుభవాలు పంచుకోమంటాడు. అతని మాటల్లో అమీనాతో మనకో సాన్నిహిత్యం ఏర్పరుచుకునేలా చేస్తాడు.

అమీనా అంతా చలం తన జీవితంలోంచి దాచి ఒలకబోసిన జ్ఞాపకాలని మనకి ఇట్టే అనిపిస్తుంది. అమీనాతో కలిపి కథలో ఉన్న పాత్రలన్నీ ఆయనతో సావాసం చేసిన అనుభవాలనే కాస్త కథకు తగ్గట్టు తర్జమా చేసి రాసాడనిపిస్తుంది. రాసిన ప్రతి వాక్యం మనలో కొన్ని పూడుకుపోయిన అనుభవాలను పైకితీస్తాయి. మరి కొన్ని వాక్యాలు మనలో కొత్త ఆలోచనలను రేపుతాయి. ఇందులోని ప్రతి సన్నివేశాన్నీ ఏదో సందర్భంలో అనుభవించే ఉంటాం. ఆరాటాన్ని మనసు మెలిపెట్టిన సమయాలను, కోరిక, ఆశ, మోహం ఇలా చాలా ఎలిమెంట్స్ ని చూసిన అనుభూతి అమీనా మనకి ఇస్తుంది.

అమీనా చలం డైరీలోని పేజీలమల్లే అనిపిస్తుంది. ఎక్కడా తన కోణంలో ఒక పర్సన్ అక్కడ తన అనుభవాన్ని ఉంచుతున్నట్టే కనిపిస్తుంది కానీ దానికోసం రచయిత శ్రద్ధగా తన అభిప్రాయాలనో, తన స్వీయ శైలినో రుద్దాలనుకోకపోవడమే అమీనా అంత మంచి రచనగా నిలవడానికి ఊతం అనిపిస్తుంది. మొదట ఎంత గందరగోళంలోనో పడేసిన ఈ కథ నెమ్మదిగా మరోమారు చదివినపుడు వేగంగా వెళిపోతున్న రైలు నుంచీ ఆకాశాన్ని కూడా తీసుకుపోతున్న అనుభూతిని ఇస్తుంది. అమాయకపు చూపుల అమీనా మనకూ కనిపిస్తుంది.. మనతో ప్రయాణిస్తుంది.

చలాన్ని ఈ అమీనాలో ఊహకు తెచ్చుకున్నప్పుడు ఓ గొప్ప విశాల హృదయం ఉన్న పాతికేళ్ళ కుర్రాడిగా కనిపిస్తాడు. యవ్వనం చేసే అల్లరి, ఆడతనం మీద వ్యామోహం, ఆత్రం కనిపిస్తాయి. కళ్లకు కనిపించే ప్రతి అందంలోనూ ఆనందాన్ని వెతుక్కునే ఆ వయసులో జాలి, వాత్సల్యం, ప్రేమా, బింకం కనిపిస్తాయి. చుట్టూ ఉన్న కట్టుబాట్లను కాదనడంలో కూల్చేసి ఆనందించే వయసది. తోడుగా తనలానే ఆలోచించే మరికొందరి స్నేహం. ఆడవారిని ఉచ్చులు పన్నడం అనడంకన్నా ఉద్దరించాలనే కోరికనే ఎక్కువ చూపుతూ సాగిపోయే పరివారం. చలం ఆలోచనకు వీళ్ళు ఊతాలుగా మిగిలారు. రామ్మూర్తి, ప్రకాశం, విమల, జీవం, తాత, అమీనా పాత్రలన్నీంటి గురించీ మనతో చెప్పేటప్పుడు కథకు తగ్గట్టు చెప్పుకొచ్చాడు. ఎక్కడ విమర్శిస్తున్నదీ ఎక్కడ వారిని సన్నివేశానికి పరిమితం చేస్తున్నదీ మనకు ఇట్టే తెలిసేట్టు ఉంటుంది రచన. అంతేకాదు చలం చాలా కథల్లో మనకు కనిపించని ప్రకృతి వర్ణన ఇక్కడ కనిపిస్తుంది. ప్రకృతి ఆరాధిస్తూ వినే పాటల గురించి తాను ఆస్వాదించిన తుంటరి రాత్రుల గురించి, స్నేహితుల కబుర్ల మధ్య జరిగిపోయిన చలికాలపు రాత్రుల అందాల గురించి, చిందిన చిరునవ్వుల గురించి, ఎన్నో సాయంత్రాలు ఊగే వంతెన దాటి ఏటుగట్టు మీద పారబోసుకున్న చిరునవ్వుల సంతకాల గురించి ఇలా చలం మాటల్లో అమీనా అందమైన కథగా రూపుదిద్దుకుంది. నునులేత పసిడి బంగారపు వన్నెల చిన్నదాన్ని పరికిణీ కట్టి, ఓణీ చుట్టి మనతో పక్కనే కూచోపెట్టుకుని ఊసులాడేంత దగ్గరితనాన్ని ఇచ్చి తనలో బరువునంతా ఇలా దింపేసుకున్నాడు చలం. ఇదంతా రచనలో ఓ భాగం మాత్రమే..

రచయితగా కన్నా తనలే తనకు మాత్రమే పరిచయంలో ఉన్న స్త్రీ హృదయాల వేదనా పూర్వక గాథల్ని మన మెదళ్ళల్లోకి చొప్పించే ప్రయత్నమూ కాదు. అదంతా ఓ నిరంతర ప్రక్రియగా మాత్రమే చూపుతాడు. వికృతమని, వివేకం కాని పని అని నెట్టేసిన ఈ జనాల మెదళ్లకు మరో వందేళ్ళయినా చలాన్ని అర్థం చేసుకునే శక్తిని ఆ పరమేశ్వరుడే స్వయంగా వచ్చి అందీయాలి.

No comments:

Post a Comment

గాజు పూలు..

నిన్న మనం వెళ్ళిన దారిలోనే ఆ మలుపులో నేలను చీల్చుకుని మొలిచిందా మొక్క పూలన్నీ గాజు పూలు నీటి బిందువులే పూలైనట్టు నీటిపూలవి నీ మనసంత స్వచ్ఛత ...