గాలి అద్దాల వెంట.. చీకటి తరగల వెంట నీ ఆలోచనలతో ప్రయాణం.
గులకరాళ్ళను ఏరుకుంటూ.. గత జ్ఞాపకాలను తడుముకుంటూ సాగిపోతున్నాను.
దారులంతా నీతో కలిసిన అడుగుల గురుతుల వెక్కిరింతలు.. చిన్నగా వినిపిస్తున్న పలకరింపులు..
నీ ఊపిరికి నా ఊపిరి జతగా నిలిచిన ఈ గదిచూట్టూ అల్లుకున్న నీ ఒంటి వాసనలు..
నీలి ఆకాశపు గాలి కెరటాలకు కొట్టు కొస్తున్న గాలి పటాలను అడిగి తెలుసుకున్నాను నీజాడను.
మంద్రంగా వినిపిస్తున్న సంగీతానికి చెవులురిక్కించి.. విన్నాను గొంతు సవరిస్తున్న చప్పుడు.
నిదురించే ఆ సామిని లేపిన లేగ దూడలు.. కాలికి తగిలి కదిలిన తీగల డొంకలు. ఎక్కడి నుంచో ఎగిరివస్తున్న బూరుగు చెట్ల క్షేమ సమాచారాలు..
పులిసిన మజ్జిగవాసనలతో నిండిపోయిన అరుగుమీద నేటి తరాన్ని వెక్కిరిస్తున్న పెద్ద తలకాయలు...
అక్కడే నేనూ ఉన్నాను. కాలికి చుట్టుకున్న ఆలోచనల బంధనాలను తెంపుకుందుకు తెగ ప్రేయాసపడుతున్నాను.
ఏ దారి తెలీని మార్గాల గుండా పోతున్న ఊహలకు రెక్కలిచ్చి కూడా పరుగందుకున్నాను.
నీతో కలిపి నడిచేందుకు పాదాలు తొందరపడుతున్నాయి.
మార్గం కాని మార్గంలో ఆ కాలిబాటలో మధ్యలో వెలిగి ఆరిపోతున్న నెగళ్ల చూట్టూ
చలి కాచుకుంటున్న మనకేం తెలుసు ఈ గాలి తుంపరలు ఎటుపయనం కడతాయో..
నీగురించి దిగులుపడే నా హృదయానికేం తెలుసు.. అసలు నేను నీలో ఉన్నదీ లేనిదీ..
పెదవుల మాటున పాటకన్నా తీయగా నువ్వు చెప్పే ప్రేమ కబుర్లకోసం అక్కడే కాచుకుని ఉన్నాను.
మన ప్రేమను పదిలంగా మోస్తున్న ఆ చెట్లకింది సిమెంటు బెంచీ మీద..
No comments:
Post a Comment