Tuesday, 27 October 2020

చెట్లు చెప్పిన సాక్ష్యం...

 



మొదట నమ్మలేదు నేను... నువ్వు నాతోనే ఉన్నావని వాదించాను..


లేవంటూ.. నా ఆలోచనలను అక్కడే ఆపేసాయి చుట్టూ ఉన్న చెట్లు..


నువ్వు తడిమి వదిలిన తడి పెదవుల జాడలు ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నాను


నువ్వు నేను కలియదిరిగిన చోట నీ కాలి జాడలు.. నీ చేతి గురుతులు ఉన్నాయన్నాను


తప్పదు బాధగానే ఉంటుంది.. నిజాన్ని ఒప్పుకోవడం.. లేడు పొమ్మన్నాయి..




రాత్రి చలికి ఒణికి తేమగా మారిపోయిన నేలంతా మనం కలిసి నడిచిన ఆనవాళ్ళు..


మౌనంతో కొన్ని.. మైకంలో కొన్ని.. ప్రేమలో తెలియాడిన క్షణాలు..


విచ్చుకున్న కాడమల్లెల సుగంధాల వెంట నీతో గడిపిన క్షణాలకోసం వెతుకుతూ వెళ్ళానటు


రాలిపడిన పూల పుప్పొడిని తొక్కుకుంటూ కాలిబాట వెంట నీ ఆలోచనలను మోస్తూ..


నీతో కలిపి ఎన్నో మధుర జ్ఞాపకాలను పేర్చుకున్నాను ఇక్కడ.. 


గుబురుగా అల్లుకున్న మల్లె పందిరికింద నీతో గడిపిన క్షణాల ఖరీదు తెలపమన్నాను


వెతుకుతున్నాను నీకోసం.. తిరిగి తిరిగి విసిగి వేసారి అక్షరాలను తోడుగా రమ్మన్నాను.. 


నా వేదనా భరిత విరహాన్ని నీ వరకూ చేర్చమనీ..  నీ సమక్షంలో నేను పొందిన ఆనందాన్ని తిరిగి ఇవ్వమనీ..


అప్పుడూ చెట్లు నన్ను చూసి జాలిగా నవ్వుతూనే ఉన్నాయి.. 


నువ్వు లేవనీ మౌనంగా సాక్ష్యం ఇస్తూనే ఉన్నాయి.

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...