ప్రతిరోజూ నేను చూసే ఉదయమే ఈరోజు వన్నెతగ్గి కనిపించింది..
నా ఆలోచనల శ్మశానపు రోదనలను చీల్చుకుని పుట్టిన ఉదయం..
దారితప్పిపోయాను ఈ అడవిలో.. ఎంత నడుస్తున్నా తరగని దూరం
ఆ చెట్లకేం తెలుసు నేను ఎదురుపడతానని.. వాటి నీడలో సేదదీరుతాననీ.
.
అడివంటే చుట్టూ ప్రకృతి ఒడిలో రాత్రికి పగలుకూ భేదమే తెలీని స్వర్గమనీ భ్రమ పడ్డాను..
పక్షుల కూతన్నా వినపడని ఈ అడవిలో అందాన్నంతా ఎవరెత్తుకెళ్లారు..
దారంటా చేతులు నరికేసిన చెట్లను పలకరించాను.. కుశలం అవేం చెపుతాయి.
అసలు శూన్యంలో గిరికీలు కొట్టే నా ఆలోచనలకు కుశలమడగడం ఏం తెలుసుననీ..
మరో మనిషి ఆహాకారాలు చెవిన పడని దారులంట పోతూ...
పగటి కలల్లో పల్టీలు కొట్టే కోరికలు ఒంపిన కాళీలను పూరిస్తున్నాను..
ముళ్ల పొదల్ని తప్పించి కాలిబాటలు వేస్తూ.. సుదూర తీరాలకు నడక..
అడవినంతా రాజుకున్న దావాగ్నిలో ప్రాణాలకోసం పరుగులెత్తే జీవాలతో నేనూ పరుగెడుతున్నాను..
కాలి బూడిదైపోతున్న అడవి దారంతా పగుళ్ళు పడిన నేల..
భీతిల్లి పరుగుతీస్తున్న జీవాలతో కలిపి నిప్పంటుకుని నివురునైపోతానేమో తెలీదు..
No comments:
Post a Comment