కాళీగా ఉన్న ఆ గదిలో ఎన్ని వస్తువులున్నాయో.. మందంగా పరుచుకున్న చీకటి..
నాలుగు గోడలనూ కప్పేసి మొత్తం తానైపోయి నాతో సహా చీకటి ముద్ద... కళ్ళు చిట్లించి చూసినా శూన్యమే..
నేను లేను. ఎటెళ్ళానో తెలీదు.. శూన్యం తీసుకుపోతోంది నన్ను.. నీకు దగ్గరగా.. దూరంగా.. ఆలోచనతో అల్లిన వలయం లోకి.
అక్కడ రంగులే అంతా.. ప్రతి వస్తువూ రంగులో ముంచినట్టు కళగా ఉంది.. ప్రతీదీ చక్కదనంతో ఇమిడిపోయి ఉంది.
నీలాకాశం రంగు పసుపారబోసినట్టూ ఉందిక్కడ.. చెట్లకు పచ్చదనం లేదు విడ్డూరం.
మీసాలు లేరుగని మనుషులు.. పసుపు ఆకాశంలో మిలమిల మెరుస్తూ ఉదయిస్తున్న సూర్యుడు..
వేల గొంతుకలు నన్ను పలకరించి నా ముందు నుంచీ పోతున్నాయి..
ఎన్నో మాటలు, సంబరాలు, శోకాలు, ఆరాటాలు, ఆత్రాలు లోకం మొత్తం చిత్రంగా జరిగిపోతుంది సాయంత్రంలోకి..
నీ తలపులో నేనూ దానివెనుకే పడ్డాను. సాయంత్రం నుంచి రాత్రిలోకి..
ఉదయపు ఎండను రెండు చేతులతో అపుకుంటూ ముఖాన్ని దాచుకుని నీతో మాట్లాడుతున్నాను..
నీ నిద్దుర ముఖాన్ని నా కళ్ళల్లో దాచుకోవాలని ప్రయత్నం. ఏం కబుర్లుంటాయ్..
ఆ.. ఊలు తప్ప.. అయినా ఏదో సందడి లోపల. ఈ ఉదయం నీతో మొదలు కావడం ...
ఎత్తైన కొండ మీద వాలుగా జారుతున్న జలపాతం.. కింద నీటి పాయలో నిలబడి నేను..
నువ్వు నాతోనే.. ఆశ్చర్యం తప్ప మరో భావన లేదు..ప్రకృతిని చూస్తూ పరవశించిపోతూ..గొప్ప కలలాంటి ఊహ నాకు.
ఆ మెట్రో స్టేషన్ కట్టిన నాటి నుంచీ ఎందర్ని చూసిఉంటుంది.. కానీ మనిద్దరికీ ఉన్న జ్ఞాపకం దానితో అమూల్యం. కూర్చుని కాఫీ తాగిన సంబరం.
పెద్ద గుడి నిండా బొమ్మలు.. మెట్లుదాటి నీ వెనుకగా అడుగులు వేస్తూ నేను.. చేతిలో కొబ్బరికాయతో నీ వెనుక వస్తున్నాను.
ఇద్దరం చేతులు కలుపుకుని నడుస్తున్నాం. కలలాంటి నిజం అది... అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.. అందులో నీ నవ్వు ఎంత చక్కనిదో అప్పుడు మరీ అందంగా తోచింది నా కళ్ళకు.
నువ్వు నాతో లేకపోయినా ఇక్కడే కొన్ని యోజనాల దూరంలో నేను పీల్చే గాలినే పీలుస్తున్నావని అనుకుని ప్రశాంతంగా నిదురించే నాకు ఇప్పుడు నిద్దుర లేదు..
జాడ తప్పిపోయిన లేడిపిల్లలా వెతుకులాటలో ఉన్నాను. దారి తెలియడం లేదు.. ఈ ఆలోచనలు నన్ను కప్పేయకముందే నిన్ను నేను కలవకముందే పలకరించు నన్ను.. ఏలా ఉన్నాననీ..
No comments:
Post a Comment