Wednesday, 2 September 2020

పూల సువాసనల్లో.. చిక్కుకున్న నా బాల్యం.. ....




మందారం.. మంకెన్నలు.. బంతులు..చామంతులు.. జాజులు.. అన్నింటికన్నా ముద్దొచ్చే మల్లెపూలు.. 


ఇన్ని సువాసనల మధ్య నాకు తెలిసిన చిన్నతనంలో అమ్మకోసం ఏరుకొచ్చిన బొగడపూలు.. 


నాన్న మాకోసం కాకుండా అమ్మకు మాత్రమే రహస్యంగా తెచ్చే మల్లెలు.. సంపెగలు. 


పూలతో ప్రేమను తెలపచ్చని.. పూలలో ప్రేముందని తెలియని రోజునుంచీ.. తెలిసిన నాటికి నేనో మొక్కల ప్రేమికురాలిని నేనో పూల దొంగను.


వాసంత సమీరంలా.. నునువెచ్చని గ్రీష్మంలా.. అంటూ వస్తున్న టీవి సీరియల్ కి అత్తుక్కుపోయి సన్నజాజులు ముందరేసుకుని మాలకట్టి చిట్టి తలల్లో పెట్టి అమ్మ మురిసిపోయిన నాడు ఇంకా గుర్తు. 


మారాము చేస్తున్న తమ్ముడిని దొడ్లో మల్లె పందిరికిందకు తీసుకుపోయి మట్టి పిడతలు చేసి ఆడుకోవడం ఓ మురిపం.


చెల్లెళ్ళంతా కలిసి జామకాయలు బిజిలీ ఆంటీ తోట గులాభీలు దొంగిలించి పట్టుబడిపోయిన బక్కచెల్లిని విడిపించుకురావడం చిలిపి అల్లరి. 


వీధంటా పోతుంటే మొక్కలాడిని అడ్డగించి పూలతొట్టెలు..కొని చూసి మురిసిపోవడం ఓ బడాయి.


సాయంత్రాలు అమ్మమ్మ ఇంటి గుమ్మంలో విడిచే చంద్రకాంతలు.. రాత్రి చంద్రుని కాంతిలో మెరిసే నక్షత్రాలు.. 


ఉదయాలు నేల రాలే పారిజాతాలు, ముట్టుకుంటే మాసిపోయి, వాలిపోయే.. మాలతీ పూలు..అమ్మ కొప్పున తురిమిన మరిచిపోలేని మధుర క్షణాలు.


సంక్రాంతి రోజుల్లో తాతగారు కొనిచ్చే చిట్టి చామంతుల దండ కోసం తగవులాడుకోవడం ఓ సంబరం.. 


ఊరెళ్లిన ప్రతి సారీ అత్తయ్య కొనిచ్చే కనకాంబారాలు నాకు అబ్బరం. 


దారంట పోతుంటే పూలమ్మి ఓ మూర కొనుక్కోరాదూ అని నా వైపు చూసే చూపుకు తెలిగ్గా నిట్టూర్చడం ఓ.. తిరికలేని రోజు.


ఇన్ని చేసి నేను పెంచే పూలను తెంపి దేవుడి ముందన్నా ఉంచలేని కఠినత్వం.. 


చెట్టుకే పుట్టింది.. ఆ చెట్టుకే చెందాలి తప్పించి నా చేతులతో పెంచి నేను తుంచననే ఓ మెండితనం.


కిందింటామె శ్రద్ధగా చేసుకునే తులసి పూజను భగ్నం చేస్తూ చామంతులు, గులాబిలూ ఎత్తుకెళ్ళడం ఓ.. చిలిపి సంబరం. 


రోజంతా ఆ పూలను నా ముందు ఉంచుకుని మురిసిపోవడం.. చిన్న ఆనందం. 


ఇన్ని రంగుల్లో.. ఎన్నో సువాసనలతో ప్రకృతిలో నాతో పుట్టిన ఈ అందాల మధ్యన నేను ఉంటున్నానంటే.. 


చెప్పలేని ఓ..చిత్రం. ఇప్పుడు పూలంటే పరవశం పోయింది.. పారే సెలయేరులా సాగిపోయిన అందమైన బాల్యానికి గురుతులుగా మాత్రమే నిలిచిపోయిన పూల సందడి.. 


పరుగెత్తే సెలయేరులా దూకుతూ పోయిన బాల్యపు తిపిగురుతులు ఈ పూల అందాలు. 


నాలో స్థిరంగా నిలిచిపోయిన మరుపురాని అందమైన జ్ఞాపకం.

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...