Wednesday, 16 September 2020

గిజిగాడి గూడ్లు ఎత్తుకొచ్చిన బాల్యం...



ఎన్ని కబుర్ల వరదలో పొంగేవి మామధ్య.. సీతాకోక చిలుకులు వాలిన వనం లాగా మారిపోయేది స్టేషనంతా.


నాలుగు మొక్కజొన్న కండెలు చేతిలో పట్టుకుని దారంటపోతున్న ప్రతి వాడినీ ఏడిపించే సరదా


జీడిమామిడి కొమ్మమీద ఊగిన ఉయ్యాలలు.. ఉప్పుకారంతో నంజుకుతిన్న జామకాయ పిందెలు..


నాన్న జేబులో కాజేసిన పదిరూపాయల కాగితంతో పరమానందంగా.. చప్పరిస్తున్న జీళ్ళు..


బంగారమ్మ జాతరలో పోటీపడి కుట్టించుకున్న లంగావోణీలో ముస్తాబై కొల్లగొట్టిన హృదయాలు.. కొంటె చూపులు

..

చిట్టి ప్రేమలు...గడుసుదనపు చక్కిలి గింతలు.. వాలుచూపులు.. ప్రేమ రాయబారాలు..


గలాటా కబుర్ల ప్రవాహం... నలుగురం కలిస్తే ద్వారపూడి స్టేషనంతా పళ్ళికిలించేది..


తుమ్మచెట్లకు కట్టిన గిజిగాడి గూళ్ళు ఎత్తుకొచ్చిన బాల్యం.. గొంతు కలిపి పాడుకున్న వాన పాటలు


అట్లతద్ది ఆటలతో ముచ్చట్లు.. పూల జడల అలంకారాలు..మనసు తీరా హత్తుకున్న స్నేహితుల రోజులు..


చిన్న బాధలకే ఓదార్చుకున్న పసి హృదయాలు.. కన్నీళ్లు తుడిచిన చిట్టిచేతులు..


మా స్నేహం చూసి మురిసిపోయే జనాలకు.. అల్లరిచూసి విసుక్కునే వాళ్లకూ పోటీ..


చెలిమికి కాలం చెల్లిపోయింది.. చదువు మమ్మల్ని విడదీసింది.. ఇప్పుడు స్టేషన్ బోసిపోయింది.


నాలుగు మూడైంది... మూడు రెండైంది.. ఇప్పుడు నేను ఒక్కత్తినే.. చేతిలో జొన్న కండేతో ఇక్కడ కాచుకున్నాను.. స్నేహుతుల రాకకోసం...


No comments:

Post a Comment

గాజు పూలు..

నిన్న మనం వెళ్ళిన దారిలోనే ఆ మలుపులో నేలను చీల్చుకుని మొలిచిందా మొక్క పూలన్నీ గాజు పూలు నీటి బిందువులే పూలైనట్టు నీటిపూలవి నీ మనసంత స్వచ్ఛత ...