చిక్కని రాత్రికి చెక్కుచెదరని
కథలెన్నో చేరాయి. రేపటిని
కలగంటూ నిన్నటిని మరిచిపోతూ..
దారపు పోగుల్లాంటి బతుకులు
ఒకేచోట పెనవేసుకుపోయి
బ్రతుకుదారిని వెతుకుతున్నాయి.
కాళ్ళీచ్చుకుంటూ
ఇంటికి చేరిన ఆసామికి పిల్లాడి
చిరునవ్వు చెదరని కానుకైంది
పైరుకు శ్రమను ధారపోయడం
తెలుసుగానీ ఆకలికి మంత్రం
తెలీదు మరి..
నాగలి ఆడించే రైతున్నకు
ఇల్లాలి చేతి బువ్వే ధాన్యరాశి..
కేరింతలు కొట్టే బాల్యం, కళతప్పని
యవ్వనం, కన్నెతనాన్ని గుమ్మానికి
పసుపుగా పూసి ముగ్గులా పరిచింది.
ముసలితనం 'ఆరోజుల్లో
అంటూ' గతాన్ని వర్తమానంతో
ముడి వేస్తూ.., కాలాన్ని గెంటేస్తూ
ముచ్చట్లలో పడింది..
వాకిట్లో పక్కలపై పుట్టుకొచ్చిన..
పెదరాశి పెద్దమ్మ రాజ్యాలు..
రాజులు, రాణులు.
జోలపాటలు, బుజ్జగింపులు
ముద్దుమురిపాలకు వెన్నపూసల్లే
కరిపోయింది వెన్నెల
నిరాశలో ఆశను పోగుచేసి బతుకు
చల్లిన విత్తులు మొక్కలై మానులై
బిడ్డలుగా పుట్టుకొస్తే..
మురిసిపోతూ పక్కమీద వాలిన
అమ్మనాన్నలు..
No comments:
Post a Comment