అవును..కొంచెం స్వేచ్ఛ కావాలి.
కాలపు అంచులు సవరించి
జ్ఞాపకపు ఆవిరి కాచుకునే స్వేచ్ఛ
గుంపు గుంపులుగా
ఎగిరే పక్షుల రెక్కలకు
అంటుకుని ఎగిరే
స్వేచ్ఛ కావాలి.
చిక్కటి చీకటిలో వెలుతురు
విత్తనాలు చల్లే స్వేచ్ఛ కావాలి.
పిట్టవాలని తోటనుంచి కొరకని
జాంపడును ఎత్తుకు రావాలి.
కిటికీ ఊచకు ఊహలు
తగిలించి ప్రియునితో
కబుర్లు చెప్పే స్వేచ్ఛ కావాలి.
ప్రేమ తొడిగిన హృదయాన్ని
బహుకరించాలి.
పొద్దుటి పూట ప్రశాంతంగా
నిద్ర లేచే పూలతో కొత్త
మొలకల సందేశాన్ని పంపాలి.
వినడం మరిచిపోయి
మాట్లాడే స్వేచ్ఛ కావాలి.
దూరాన్ని దగ్గరచేసే స్వేచ్ఛ
కొత్త దారులను పట్టుకునే
నేర్పు కావాలి.
లాంతర్లు వెలుగులో మేఘాల
లెక్క తేల్చాలి. చినుకుల లెక్క
రాసి పెట్టుకోవాలి.
కొంచెం స్వేచ్ఛ కావాలి.
No comments:
Post a Comment