పోస్ట్‌లు

డిసెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

మంచు పలకరింపు

చిత్రం
ఇటుగా బయలుదేరి వచ్చింది  హిమాలయం ప్రతి ఊరునీ కలుపుకుంటూ చలి విత్తనాలు చల్లుతూ గడ్డివాము, పంట పొలము,  సిమ్మెంటు బెంచీ నువ్వు నేనూ అన్నీ చుట్టాలే  ఒకటే ఈ చలిగిలికి వెచ్చగా దుప్పట్లో  జోగుతున్న నగరాలు పొగమంచు కమ్మేసిన దారులు చిటపటలాడే చలిమంటలు ఎదురుచూడని  మంచు దేవతకు హారతులు ప్రేమలు చిగురించి పూలుపూచే కాలం పరువానికి రెక్కలు మొలిచే కాలం సిగ్గు నెరిగిన వాన చినుకులు తోరణాలై  మంచు కన్యను చుట్టుకునే సంబరం

ఆ గాలేం చేస్తుంది

చిత్రం
  నిశ్శబ్దంగా నా పక్కన చేరి గోరువెచ్చని నీ స్పర్శను  గురుతుచేస్తుంది నీ జాడలు వెతుకుతూ స్వప్న వీధుల్లో వెర్రి ఆలోచనల వెంట తీసుకుపోతుంది ఆ గాలేం చేస్తుంది..  అర్థరాత్రి అలసిన దేహానికి జ్ఞాపకాలతో చికిత్స చేస్తుంది మనసుకు గిలిగింతలు  పెట్టి, ఊహలకు రెక్కలిచ్చి  నీ దగ్గరకు పంపుతుంది ప్రేమలో మాధుర్యాన్నంతా పోగేసి అలల తరంగంలా నన్ను కమ్మేస్తుంది నీవు వదిలిన గురుతులను  తడుముకుంటూ రాతిరిలో మేఘాల  మాటున చందమామనైపోతాను నీకివేం పట్టవు.. ఆ పాడు గాలి నిన్ను  తాకనైనా తాకదేమో కదా

కలల లోకంలో బంధీని నేను

చిత్రం
ఈ కాళ్ళకు చుట్టుకున్న  బంధనాలు ప్రేమగా ఎప్పుడు  అల్లుకుంటాయో చీకటి నుంచి  వెలుగు వైపుకు ఎపుడు  తీసుకుపోతాయో తెలీదు మసక రాత్రుల్లో  ప్రేమతో నిమిరి మరి రాతిరికి పగటి  కలలైపోతాయి ఈ బంధనాలు నన్ను  వదిలివెళ్ళిన బంధాలు కౌగలించుకోవు పలకరించవు బాధపెట్టడమే తెలుసు సుడులు తిరుగుతూ వచ్చి గతంలోనికి  గుంజుకుపోతాయి చిన్నారిగా  నాన్న ఒడిలో ఆడిన ఆటలు అమ్మ చేతి గోరుముద్దలు చిట్టి చెల్లెళ్ళతో చేసిన అల్లరి  మేఘంలా అల్లుకుపోతుంది కల నీరైపోయాక మబ్బులు  పట్టిన ఆకాశమల్లే దిగులు మళ్ళీ  కమ్ముకుపోతుంది.

ఏమంటావు

చిత్రం
  ఏరుకోడానికి ఎన్నిలేవు ప్రతి చోటా నీవు వదిలిన ఆనవాళ్ళే గాలికి ఊగుతున్న ఆ  గుమ్మంలోని గంటలు నువ్వు  వచ్చినపుడు ఎన్ని హొయలుపోతాయనీ ఈ పూలబాలల మాట చెప్పనే అక్కరలెద్దు నిన్ను చూసినప్పుడల్లా  కొమ్మకొమ్మకూ ఒదిగి కొత్త భంగిమలో  నాట్యమాడతాయి  నీ స్పర్శ తెలిసిన కుర్చీలు బల్లలు  నువ్వంటే ఆప్యాయత చూపుతాయి నీపాదం తగిలి పులకించని చోటుందా అక్కడ. ఆగదిలో  నాలుగు గోడలకూ నువ్వు తెలుసు నీ నగ్న దేహాన్ని ఎన్నిమార్లు పలకరించాయో గాలి తరగల్లా., రాత్రింబవళ్ళ  కాలానికి మధ్య జారిపోయిన రోజులెన్ని లేవు. ఆ వర్షమొచ్చిన రోజున  తడిచిన దేహాల మధ్య జరిగిన ముద్దుల యుద్ధం గతానికి ఎదురెళ్ళి ఎన్నని  జ్ఞాపకాలను పట్టుకురాను ఏం నీకు మాత్రం గురుతులెవు. అన్నీ తీపిగా ఉంటే చెదెపుడు చూస్తావు నువ్వేమిటి? నేనేమిటి? ఇద్దరం సమానమే ఈ ప్రేమకు ఇదంతా ఏమిటని కంగారు పడకు అలగకు అలవాటు పడు ఈసారి ఇద్దరం కలిపి ఏరుకుందాం మన ప్రేమ తునకల్ని ఏమంటావు.

కలగన్నాను ప్రియా..

చిత్రం
ఓ ఏకాంత క్షణంలో నీ ఊహతో నా గుండెల గడబిడలను దాచేస్తూ.. అలకలుపోతూ కాలాన్ని అద్దంలో బంధించి నీకు చూపాలని నీ ప్రతిబింబాన్ని గులకరాళ్లతో మలిచాను నీవు ఎన్నిమార్లు కలలోకొచ్చిందీ వెన్నెల బిందువులతో లెక్కించాను అణుచుకున్న కోర్కెలకు రెక్కలిచ్చి నీ విచ్చిన ముద్దుల్ని దీపకాంతిలో పదిల పరుచుకున్నాను. మనసు సవ్వడిని ఎవరికీ వినిపించనీయక మసక రాత్రుల్లో దాక్కున్నాను అలల చేతుల కౌగిలింతలో నిన్ను గుర్తుచేసుకున్నాను పైరు పచ్చదనంలో నీ నవ్వును ఆనవాలు కట్టాను గాలి ఊళలలో నీ ఊసులను దాచుకుని పులకరించాను నీతోటి ఆలోచనలతో ఇసుక మేడలు కట్టాను నీ ప్రేమను అందుకుని పన్నీరైన హృదయాన్ని ఎత్తుకుని మళ్ళీ తిరిగొచ్చాను

నువ్వేనా..అది

చిత్రం
నవ్వేవా..ఆ పూలతీగల గలగలల మాటున అదే జాబిలి చేతిలోకి జారినట్టుగా నీ మనసేం చేస్తుంది నిన్ను నామీదకు ఉసి గొలుపుతూ నిజానికి ఈరోజు తెల్లవారు తుండగా నీ ఆర్తి సెగ తగిలి మోడుబారిన హృదయమల్లే మిగిలిపోయాను నువ్వేసిన గురుతులను తడుముకుని నీ స్పర్శను కలగన్నాను వర్షించే మేఘమల్లే కన్నుల తడి మోహాన్ని భరిస్తూ మౌనంగా మిగిలింది నీ ముందు లజ్జతో ఆవిరిగొన్న ముఖాన్ని ప్రదర్శిస్తూ నీ కౌగిలింతల మాటున నలిగిపోయింది మేను నిటారు సొగసుల నీలి అందాలను అందుకోవాలని బోలెడు ఆశ పాపం

నీ దిగులు కమ్మేసినపుడు

చిత్రం
ఒంటరి ఆలోచనల్లో గాలికి తల ఊగించే లతాంతం నాతో కబుర్లాడిన క్షణంలో ధారాపాతంగా జారుతున్న నీ ఊసులను దోసిళ్ళతో పట్టి దాచుకున్న జ్ఞాపకం హృదయాన్ని వెచ్చగా కమ్ముకుంటున్న ఆలోచనలను పక్కన పెట్టి మాటలను అరువు తెచ్చుకుని చూపులతో వెతుకుతూ నీవు పంచిన అనురాగ మేఘాల వెంట పరుగులు పెట్టిన జ్ఞాపకం నీ క్షేమ సమాచారం తెలియక గుంజుకున్న గుండె పడ్డ ఇబ్బంది నీ నుంచి పారిపోని నన్ను పట్టుకుని ప్రేమలేఖ రాసిన జ్ఞాపకం వెలుతురు ఎరుగని దారులంట నీతో రావాలని పడిన ఆరాటం ఈ బాధను తీయగా నీ విరహాన్ని కమ్మగా అదుముకుంటూ ఆ.. గోదారి గట్టున కాచుకుని నేను

ఓ చలి కాలం రాత్రి

చిత్రం
కమ్మేసిన ఆలోచనలు గాలికి ఊగే సన్నజాజి తీగ పలకని రాతిరికి జవాబిస్తూ సగం తెగినా వన్నె తగ్గని చందమామ తాళుక్కున మెరుస్తున్న చుక్కల అందాలు ఆకాశంలో పరుచుకున్న నిశ్శబ్దానికి జోల పొగమంచును చుట్టుకుని చెట్ల గుబుర్ల ఒణుకు ఒంటరిగా వేచి చూస్తున్న మసకబారిన దారులు నీలి కన్నులు నిద్ర కోసం కాచుకున్నాయి ప్రేమించిన సమయాలను తడుముతూ ఆమె అతని కౌగిలి వెచ్చదనాన్ని కలగంటూ మగత నిద్దురలో రహస్య పరామర్శ

చలం రచనా తలం మీద.. అమీనా

చిత్రం
 http://pustakam.net/?p=21223   11 DECEMBER 2020   వ్యాసకర్త: శ్రీశాంతి ఈ భూమి మీద ప్రాణం పోసుకున్న ప్రతి జీవికి అన్నపానీయాలు ఎంత అవసరమో మరో ప్రాణి నుంచీ ప్రేమను పొందడం కూడా అంతే అవసరమైన క్రియగా మలుచుకోబడింది. ప్రేమించడం, ఆ ప్రేమను పొందగలగడం రెండూ చాలా పవిత్రమైన కార్యాలే.. అయితే నడుస్తున్న రోజుల్లో ప్రేమకు అర్థాలు మారిపోతూ వస్తున్నాయి. ప్రేమను వ్యక్తపరచడంలోనూ.. ప్రేమను పొందడంలోనూ రకరకాల ధోరణలు పద్దతులు మారుతున్నాయి.. అయితే వీటన్నింటికీ తన లెక్కను ఒకదాన్ని ముందే వేసి అక్షరాల్లో ముద్రించేసి ఉంచాడు చలం. ప్రేమంటే మనకున్న అంచనాలను తారుమారు చేసేసి.. ఓరేయ్ ఇదికాదురా ప్రేమనీ.. తన పుస్తకంలో తలదూర్చి తలెత్తే లోపు ప్రేమకు అర్థాన్నీ.. స్థిరమైన అభిప్రాయాన్నీ ఇవ్వగల ధీశాలి చలం. చలాన్ని చదవడవడమంటే మరో లోకానికి పుస్తకం, ఓ పెన్నూ పట్టుకుని పయనం కావడమే.. చుట్టూ ఏం జరుగుతున్నదో మరిచిపోయి ఆ మరో లోకంలో విహరించడానికే సిద్ధం కావడం. ఆయన రచనల్లో అమీనా ఓ అందమైన రచన. పట్టుకుంటే కందిపోయే అందాన్నీ.. మనసుని మెలితిప్పే కోరికను, ఆరాటాన్నీ కళ్ళకు కనిపించి మనసుల్ని తడిమేసే రచన. నబుకొవ్ లోలిటా గురించి విన్...

తడి ఆరని జ్ఞాపకాలు..

చిత్రం
తోటంతా గులాబీలు.. అల్లరి నేర్చిన సీతాకోక చిలుకలు.. గేటువార మల్లె పొదలు.. తుమ్మెదలకు ఆవాసాలు.. వానాకాలం చినుకులను లెక్కపెట్టే నీటి గుంటలు చెట్ల గుబుర్లలో కబుర్లాడే రామచిలుకలు..  తొలివలపుల చిన్నెలెన్నో విసిరిన విరహ జంటలు.. అందకుండా పరుగులు పెట్టే నిద్రనెరుగుని సమయాలు.. కొసరి కొసరి సరసాలాడే ప్రేమ జంటల చెక్కిలిపై నొక్కులు.. జారు సిగలో జాజులు చెప్పే చిలిపి కబుర్లు.. వయసు చేసే అల్లర్లతో బృందావనమే అంతా.. నీలాంబరాన్ని తాకి నిద్దురపోయిన రోజులే అన్నీ.. నిరాశనెరుగని రోజులవి.. ప్రేమను పంచిన దినాలు. బద్దకాన్ని కప్పుకున్న ఉదయాలు..  చంద్రుని కాంతి మాటున తడి ఆరని జ్ఞాపకాలు..

దిగులెరుగని పక్షులవి..

చిత్రం
దిగులెరుగని పక్షులవి.. ...................................... దక్షిణ దిశగా పిట్టలెగురుతాయి చూడు..  అప్పుడు అంటుకుంటుంది.. దిగులు నిండిన రోజుల తడి.. పక్షులే కానీ అవి స్వేచ్ఛకు ప్రతీకలు.. దిగులు గుండెకు ఉత్తేజాన్ని నింపే విహంగాలు.. వనదేవతల్లా.. విహరిస్తూ.. ఆనందాన్ని విరజిమ్మి పోతాయవి.. ముక్కులతో కట్టుకున్న గూళ్ళలో రాజ్యాలనే ఏలతాయి.. ఋతువులెన్ని మారినా ఆనందం అలానే ఉంటుంది వాటి మధ్య.. జంట జంటల్లా ఎగురుతున్న పక్షులన్నీ ప్రేమకు ఆనవాళ్ళు.. ఎగురుతాయి.. నీలి ఆకాశంలో గిరికీలు కొడతాయి.. నిరుత్సాహం ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వెళతాయి.. ఆనందాన్ని తమతో తీసుకెళతాయి..  చీకట్లో వెలుతురు కోసం అర్రులు చాస్తాయి..  చలిగాలిలో ప్రియురాలికి ప్రేమలేఖలు పంపుతాయి..  ఆ పచ్చని చెట్ల గుబుర్లలో కాపురముంటాయి.. దిగులెరుగని పక్షులవి.. నిన్నూ నన్నూ అట్లానే ఉండమంటాయి.. మనకే అది చేతకాదు..  వాటితో పోల్చుకుంటామంతే..