నిన్ను అప్పుడు దిగులు ఆవరించేస్తుంది...

నేను చూసిన చీకటి దారుల్లో ప్రయాణం నీకు కష్టం.. తెలిసిన వాళ్ళేవ్వరూ ఉండరు.. నేను తప్ప.. మాసిన గోడల నిండా కన్నీటి చారికలు ఉంటాయక్కడ.. ప్రయాణంలో అలసటకన్నా నిన్ను ఆవరించే నిరాశే ఎక్కువ.. వేలాడే కన్నీటి చుక్కలు చూసి వెనక్కు మళ్ళిపోతావు.. చేతులు కలుపుకుని నడవాలనుకుని దూరంగా జరిగిపోతావు.. చాలా రోజులు ప్రయాణించాకా అప్పుడు చేరుకోగలం ఆ ఇంటిని.. వెన్నెల పరుచుకునే జాగాలేని ఊరది.. చీకటి తప్ప మరేం లేదక్కడ.. చుట్టూ నీటితో కాలిబాటన్నా లేని.. గుడిసె వైపు నాతో అడుగులు కలిపి వస్తావా మరి.. నేలంతా పగుళ్ళు.. బీటలు తీసిన ఆశలు.. నిండుగా పరుచుకున్న నిశ్శబ్దం.. చెదలు పట్టిన గోడలు.. విషాదం రెక్కల్లో చిక్కుకున్న.. మురికి నిండిన ముఖాలు.. నిన్ను అప్పుడు దిగులు ఆవరించేస్తుంది.. అయినా వస్తావా మరి నాతో..