ముళ్ళు....



తెలతెల్లవారుతుంది. రాత్రి ప్రయాణం వల్లేమో పెద్దగా సమయం తెలీలేదు. నిద్రలోనే హైదరాబాద్ వచ్చేసాం. సికింద్రాబాద్ స్టేషన్ రాగానే దిగాల్సినవాళ్ళంతా నిద్రమత్తులో సామాన్లు గాలించి పట్టుకుని, పాచిముఖాలు సరిచేసుకుంటున్నారు. కొందరిలో ఇంకా అదే మత్తు. కీచుమని శబ్దం చేసుకుంటూ స్టేషన్లో ఆగింది రైలు. ట్రైన్ కంపార్ట్ మెంట్ అంతా రొచ్చుకంపు. ముక్కులు మూసుకుంటూ, తోసుకుంటూ సామాన్లు దింపుకుంటున్నారు. ఎంతటి జనమో గాలి ఆడనంత., సందు దొరకనంతమంది. అతికష్టం మీద స్టేషన్ దాటి రోడ్డుమీదకు వచ్చాం. తెల్లారలేదు. ఆకాశం మబ్బులు పట్టి, మసగ్గా ఉంది.

“ఇంకా ఎంత సేపు.. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి”?

“నాకూ తెలీదు.. కనుక్కోవాలి. అందాకా ఓపికపట్టు..ఇదిగో ఈ గట్టువార కూర్చో, నేను ఇప్పుడే ఫోన్ చేసివస్తాను”.

ఆకాశం ప్రశాంతంగా ఉంది. గాలికి ఊగుతున్నాయ్ చెట్లు.., జనంలో కలిసి, అతను చూపుకు అందడంలేదు. ఫోన్ బాక్స్ ఎక్కడ ఉందో వెతకాలి కదూ.. నాకేం భయంగా లేదు. తను వస్తాడు. కానీ త్వరగా రావాలి. ఇలా ఒంటరిగా ఎదురుచూడటం చాలా కష్టంగా ఉంది.

ఇద్దరు బిచ్చగాళ్ళు భుజం మీద సంచులతో నన్ను దాటుకువెళుతున్నారు. ఏంటో ఈ పరిసరాలు కాస్త ఇబ్బందిగానే ఉన్నాయ్. త్వరగా ఇక్కడి నుంచి వెళిపోతేనే బావుండు.

**

“మనల్ని పంజాగుట్ట లాడ్జిలో దిగమన్నాడు. ఆయన మధ్యాహ్నానికి కలుస్తాడట. మనల్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకి ముసుగులు కట్టుకోమన్నాడు. ఇదిగో ఈ చున్నీ నువ్వు తీసుకో..నేను టోపి పెట్టుకుంటాను. ఊ..పద పోదాం”.

“ఇంకా తెల్లవారలేదు కదా.. మనల్ని ఎవరు గుర్తుపడతారు..ముఖానికి ఈ ముసుగు ఎందుకు కట్టుకోవాలి”.

“ఏమో దారంటా సీసీ కెమెరాలు ఉన్నాయ్.. జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరికంటా పడద్దన్నాడు”.
“ఎందుకు.. మనం మరీ అంత ప్రమాదంలో ఉన్నామా? మనం వచ్చింది లాయర్ దగ్గరికే కదా అతను మనల్ని కాపాడతాడనేగా.. మరెందుకు భయపడాలి”.

“ప్రశ్నలు అడుగుతూ ఇక్కడే ఉంటావా.. కదులుతావా.. నడు త్వరగా”..

“ఎందుకు విసుక్కుంటావ్... ఇప్పుడు నేనేం అన్నాను... పద”..

**

ఆటో పంజాగుట్ట రామకృష్టా లాడ్జ్ ముందు ఆగింది, నాలుగో ఫ్లోర్, 201 గది... మురికి పూసిన గోడలు, కిళ్ళీ ఉమ్ములు, మకిలి పట్టిన లిఫ్ట్, ఇరుకు గదులు, ఎప్పుడు చూడని వాతావరణం భయంగా, బెరుకుగా ఉంది.

తెలీకుండానే అతని చెయ్యి పట్టుకుని మరింత దగ్గరగా నడుస్తున్నాను. బాయ్ గది తాళం తీసి లోపలికి మాతోపాటే వచ్చి “రూమ్ లో ఫోన్ లేదు. కిందకి రావాలి”. “ఏం కావాలన్నా నన్ను అడగండి సార్... క్షణంలో తెస్తాను. వస్తా సార్”..

చేతిలో పెట్టిన పదిరూపాయలు నోటు తీసుకుని వెళిపోయాడు. మంచాల మీద పక్కలు అప్పుడే మార్చినా ముక్కవాసన వేస్తుంది గది. ఎదురుగా బాల్కనీలో పక్కగా ఉన్న తలుపు తెరిచాను. ఇందాక మేము దిగిన రోడ్డు కనిపిస్తుంది. ఉదయం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళతో చూస్తుండగానే రోడ్డు హడావుడిగా మారిపోయింది.

“త్వరగా ముఖం కడుక్కుంటే టిఫిన్ తిని కూర్చోవచ్చు..లేదంటే మళ్ళీ ఆకలంటావ్”..

“అవును నాకే ఆకలి నీకు వేయండం లేదే..పాపం”.

కోపంగా బాత్రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాను.

**

“అతనికి కాల్ చేసాను. పదినిముషాల్లో వస్తున్నాను అన్నాడు”..

“ఊ”..

“నేను కిందకెళుతున్నాను. నువ్వు రూమ్ లో జాగ్రత్తగా తలుపేసుకో.. ఎవరన్నా తలుపు కొడితే ఎవరని అడిగిమరీ తియ్.. సరేనా”.

“ఊ..సరే”..

శేషు నా చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరం లేచిపోయి పెళ్ళిచేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు ఊరుకోరుగా కోర్టు, కేసు.. పోలీసులు వెంటాడుతున్నారు. ఇదిగో ఇలా అందరినీ తప్పించుకుని తిరుగుతున్నాం. ఎవరో స్నేహితుడికి తెలిసిన లాయర్ ని కలవడానికి హైదరాబాద్ వచ్చాం.

**

అవతలి గుమ్మం బాల్కనీలోకి వచ్చాను. గాలి చిక్కగా వీస్తుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని అక్కడే నిలబడ్డాను. రద్దీ ఇంకా తగ్గలేదు.. దుమ్ము కొట్టుకుపోయిన వాతావరణం లాడ్జ్ చుట్టూ పరుచుకుపోయింది. కార్లు, స్కూటర్లు పోటీగా పరిగెడుతున్నాయ్. ఒంటి మీద నీలం చున్నీ గాలికి ఎగిరిపడుతుంది.

బాల్కనీ పిట్టగోడ అంచు పట్టుకుని వంగి లాడ్జ్ గుమ్మం ముందు లాయర్ కోసం ఎదురుచూస్తున్న శేషూనే చూస్తున్నాను. చాలా తెలివైన వాడు. మనిషి నలుపుగా ఉన్నా, నవ్వుతున్నప్పుడు ఆ పెదాల మధ్యన వచ్చిచేరే పళ్ళవరస దానిమ్మ గింజలు పేర్చినట్టుగా బావుంటుంది. గుబురు మీసం, పదునైన గడ్డం, మాటల్లో, చూపుల్లో చురుకుదనం, కళ్ళతో మత్తెక్కించి మైకంలో ఇట్టే పడేసే మగసిరి.. వెరసి శేషు.

కారు చీకటిలో కూడా ఆ కళ్ళు మెరుస్తూనే ఉంటాయ్. ఎన్నో సందర్భాల్లో నన్ను దుఃఖపు పొరలు తాకినపుడు అతడి చేయి దగ్గరకు లాగేది. ఆ ఒడి వెచ్చదనంలో అమ్మ ప్రేమను, నాన్నిచ్చే ధైర్యాన్ని అనుభవించాను. ఒక్కో క్షణంలో కడుపును చీల్చుకువచ్చిన బిడ్డల్లే ఆనతాడు.
నిలువు కాళ్ళతో ఆగి ఉన్న బండికి వారగా నించుని ఉన్నాడు. అలా ఎంత సేపయిందో..రోడ్డు మీద పళ్ళ బండి ముందు ఆగి.. లాడ్జి పేరు చదువుతున్నాడో వ్యక్తి. నలుపు తెలుపుల షర్టు, ఊదారంగు ఫెంటు. లాడ్జి ముందున్న శేషూని పలకరించి, బండి స్టేండ్ వేసి, ఇద్దరూ లోపలికి వస్తున్నారు.

తలకాస్త పైపైన దువ్వుకున్నాను. ఇద్దరు గుమ్మం ముందు ఆగారు., శేషు తలుపు కొడుతున్నాడు.

“నేనే తలుపు తీయ్”..

నెమ్మదిగా తలుపు తీసాను. ముందుగా లాయర్ గది లోపలికి వచ్చాడు. తర్వాత శేషు.

**

పొడుగ్గా, ఆరడుగులకు కాస్త అటు ఇటుగా ఉన్నాడు, మరీ తెలుపు కాదు, కళ్ళు నిప్పుల్లా ఉన్నాయ్...అప్పుడే సిగరెట్ తాగిన వాసనేస్తుంది. తలుపు పూర్తిగా వేయకుండా పక్కనే స్టూల్ లాక్కుని కూర్చున్నాడు.

“ఊ.. ఇప్పుడు చెప్పండి.. ఏంటి మీ విషయం”..

“ముందు మీరు కాఫీ గానీ, టీగానీ తాగండి.. తర్వాత మాట్లాడుకుందాం”.. అన్నాను.

తలకాస్త పైకెత్తి, “అవసరం లేదు.. నేను ఇంటి దగ్గర తాగే వచ్చాను”.

ఫేన్ గాలి పెంచి అతన్నే చూస్తున్నాను. గాలి తగిలేట్టు కాలర్ పెకెత్తి మాటలు మొదలు పెట్టాడు.
“మీరు ఇప్పుడు ఎంత ప్రమాదంలో ఉన్నారో.. మరిచిపోతున్నారు.. ముందు ఆ తలుపు మూయకండి.. ఎవరన్నా వస్తే మన ముగ్గురినీ మూసేస్తారు.. నేను మీకు సాయం చేస్తున్నాను అనుకుంటారు. త్వరగా కేసు వివరాలు చెపితే తర్వాత ఏం చేద్దామన్నది ఆలోచిస్తాను.”
    
“అది కాదండి” శేషు ఏదో చెప్పబోయాడు.

“చెప్పాగా.. అంత టైం లేదు”.

“నాకు ఇది వరకే పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు, ఇప్పుడు నా స్నేహితుడితో వచ్చేసాను. నా భర్తతో సహా అంతా వెతుకుతున్నారు. పోలీసులు తప్పంతా శేషుదే అంటున్నారు. ఇది నా ఇష్టంతో నేను తీసుకున్న నిర్ణయం. ఇందులో అతని తప్పేంలేదు”. చెప్పాను.

అంతా విని.. శేషు వంక కాస్త అనుమానంగా ముఖం పెట్టి.. “నీ ముఖం చూస్తుంటే నువ్వే కిడ్నాప్ చేసినట్టుగా ఉంది. ఈమె కాదంటుందేంటి”.

“లేదండి.. నేనేం బలవంతం చేయలేదు. తన ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం”..

“ఊ”..

“మరి ఆమె కుటుంబం అంతా నువ్వే చేసావంటుంది. కాదని ఏలా చెపుతావ్...ఇదంతా కాదు గానీ నేను ఒకటి చెప్పనా..ఇక్కడ నాకేదో అనుమానంగా ఉంది.. మా ఇంటికి రండి.. సాయంత్రం ఈ సమస్యను సింపుల్ గా మాట్లాడుకుని తేల్చేద్దాం.. ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే మీకే ప్రమాదం”.
అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇద్దరం.. బరువుగా ఊపిరి తీసుకున్నాం.

“శేషు మనం మరీ ప్రమాదంలో ఉన్నామా.. లాయరే అలా కంగారుపడుతున్నాడు”..

“ఏమో.. తెలీదు.. చూద్దాం.. సాయంత్రం వెళుతున్నాంగా.. ఏం జరుగుతుందో”.. పక్కమీద వాలిపోయాడు శేషు.  
       
**

బంజారా హిల్స్.., సాయంత్రం ఆరు దాటింది. విశాలమైన అపార్ట్ మెంట్.. గేటు దాటి లాయర్ పేరు చెపితే, సెక్యూరిటీ మూడో అంతస్థుకు వెళ్ళమన్నాడు. గేటు ముందు నాలుగు వరసలుగా కట్టి, లాన్ లో రకరకాల మొక్కలు వేసారు. అన్నీ క్రోటన్ మొక్కలే. వాటినే చూస్తూ లిఫ్ట్ ఎక్కాను. గుమ్మం ముందు భూషణం ఎమ్.ఎ.ఎల్.ఎల్.బి అని ఉంది. శేషు రెండుమార్లు కాలింగ్ బెల్ నొక్కాడు. మూడోమారు తలుపు తెరుచుకుంది.

ఓ నలభై ఐదేళ్ళామె తలుపు తీసి మేము తెలిసినట్టుగా మావంక చూసి నవ్వింది. పలకరింపుగా మేమూ నవ్వాం.  పెద్ద హాలు సోఫా సెట్, పైన షాండ్లియర్ వేలాడుతుంది. నిలువుగా అద్దాల తలుపు.. దాన్ని దాటి యాక్వేరియం.. నాలుగు టైగర్ ఫిష్ లు తిరుగుతున్నాయ్. లోపల గవ్వలు పేర్చి, బ్లూ లైట్ వెలుతుంది.

ఇద్దరం సోఫాలో కూర్చున్నాం. ఆయన లోపలి నుంచి వచ్చాడు. “అదే మీ సంగతే ఆలోచిస్తున్నాను. మా ఆవిడ సలహా కూడా అడిగాను. మీరు ఈ ప్రమాదం నుండీ బయటపడాలంటే ఒకటే మార్గం.. ఆ అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే”.
“మరి.. వాళ్ళ వాళ్ళు తీసుకుపోతే”..శేషు కంగారు పడ్డాడు.

“ఆగవయ్యా.. ఎందుకు తొందర… చెపుతున్నాగా.. ఆమె బాధ్యత నాది. నేను ఇలా ప్రవేశపెట్టి అలా తీసుకు వచ్చేస్తాను. సరేనా”..

“లేదండి. మీకు తెలీదు. నేను ఒకసారి వెళితే తిరిగిరానీయరు. ఇంత జరిగాకా నేను అక్కడ ఉండలేను. అర్థం చేసుకోండి”. గట్టిగా అనేసాను.

ఆమె మా మాటలు వింటూ.. “అలా కాదు. ఆమెని నేను కొన్నిరోజులు మా ఆర్గనైజేషన్ లో పెడతాను. అన్నీ సర్దుకున్నాకా తిరిగి వస్తుంది. ఏమంటారు.. ఈ సమస్యకు ఇదే సరైన పరిష్కారం”.

మేం ఇద్దరం ముఖం ముఖం చూసుకున్నాం.

ఆయన “సరేనయ్యా.. మీరు ఉదయం కలవండి కొన్ని పేపర్స్ ఉన్నాయి అమ్మాయి సైన్ చేయాల్సినవి.. సరేనా.. ఇక వెళ్ళిరండి”.

ఇద్దరూ గుమ్మం వరకూ వచ్చి సాగనంపారు.

**

లాడ్జిలో మంచం మీద దొర్లుతున్నాం.. మనసంతా చిరాగ్గా ఉంది. “ఇంతా చేసింది దూరం కావడానికా.. ఇన్ని కష్టాలు పడ్డామే.. ఛీ”.. విసుక్కున్నాను.

“అది సరే.. అసలు వాళ్ళిద్దరూ నా గురించేం చెప్పరే.. అంతా నీ విషయమే మాట్లాడారు”..
“అదే.. నాకూ అర్థం కాలేదు” అన్నాను.

ఈలోపు ఎవరో తలుపు కొడుతున్నారు. శేషు తలుపు తీసాడు. ఎదురుగా బాయ్.. “ఏంటి?.. “మీకు ఫోనొచ్చింది సార్”... “మాకా”..?

“అదే లాయర్ గారికి ఇచ్చాం గా.. అక్కడి నుంచే అయి ఉంటుంది. పద నేనూ వస్తా”..చున్నీ మెడ చుట్టూ వేసుకుని.. కూడా నడిచాను.

**

“హలో.. చెప్పండి సార్”..

“ఏం లేదయ్యా.. నాకు అర్జెంట్ పని తగిలింది, ఊరెళ్ళాలి.. మీరు రేపు ఇక్కడే ఆగండి.. నేను ఎల్లుండి కలుస్తాను.. సరేనా”..

“ఆ.. ఆ.. సరే సార్”..

“ఫోన్ అమ్మాయికివ్వు”..

“ఇదుగోండి ఇస్తున్నా”..

“చూడు మాట్లాడతారట”..

“నాతోనా”..

“ఊ”..

“హలో సార్”..

“ఆ.. అమ్మాయ్.. నీకో మాట చెపుదామని ఫోన్ చేసాను. నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావ్.. నాకెందుకో అతను నమ్మదగే వ్యక్తిగా కనిపించడం లేదు. నీకెందుకు అంతా నేను చూసుకుంటాను.. నువ్వు నా దగ్గరే ఉండిపో.. ఇక నువ్వు ఏలాగూ ఇంటికి వెళ్ళినా మీవాళ్ళు రానివ్వరు. వీడితో ఎన్నోరోజులు సుఖపడలేవు. నా మాటవిను. నేను నీకు మా ఆఫీస్ లో టైఫిస్ట్ కింద ఉద్యోగం వేయిస్తాను. మంచి భవిష్యత్ ఉంటుంది. ఏమంటావ్.. ఏంటి వింటున్నావా”!...

“ఆ.. వింటున్నానండి”..

“చెప్పేది విను.. ఇలాంటి వన్నీ మీరు డీల్ చేయలేరు”.. నేనంటే సంఘంలో పేరున్నోడిని... వెకిలి నవ్వు”..

ఫోన్ శేషుకి ఇచ్చేసాను.

**

“పద పోదాం”..

“ఎక్కడికి”?

“ఎక్కడికైనా సరే.. ఇక్కడమాత్రం వద్దు”..

“ఎందుకు”..??

 “దారితప్పి వచ్చాం.. ఇది మన దారికాదు”.

మనసులోనే ఈ దారంతా ముళ్ళున్నాయ్” అనుకుంటూ... శేషు చేయి పట్టుకుని మెట్లు దిగాను.
*







కామెంట్‌లు

  1. కదనం చాలా ఆసక్తికరంగా వంది.
    కథ లోని పరిస్థితులు బుర్ర తిరిగిపోయేంత
    పచ్చి నిజాలు. మనుషులు పచ్చి అవకాశ వాదులు
    ఇందులో ఆడ, మగ తేడా లేదు. శాంతి కలానికి తిరుగులేదు

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అల్లం శేషగి రావు కథ "చీకటి"

ఆశ నిరాశల దోబూచులాట “ఊరి చివర ఇల్లు”

అమరావతి కథల పై సమీక్ష