Monday, 22 April 2019

నమ్మకం...



రైల్ ఇంజన్ మోత ఊరి కట్టవ దాటి వినిపిస్తుంది. కట్టెలమోపు తలకెత్తుకుని నడుస్తున్న చిట్టెమ్మ దూరంగా ఉన్న కూతుర్ని గట్టిగా పిలుస్తుంది. రైసుమిల్లులోని ధాన్యం ముక్కిన వాసన గంథిగాడి కొట్లోంచి వస్తున్న అగరబత్తీల సుగంధాన్ని కమ్మేసింది. ఆ సాయంత్రవేళ తాటితోపు దాటి సైకిల్ మీద రైయ్ మని పోతున్నాను. నిన్నరాత్రి ఇంట్లో జరిగిన గొడవ సంగతి ఆలోచిస్తూ...సడెన్ గా.. నా ఎదురుగా వస్తున్న సైకిల్ రాసుకుపోయింది. కాస్తలో పెద్ద ప్రమాదం తప్పింది. రాసుకుపోయిందో, ఎక్కడన్నా గీరుకుందో,.. ఆగి చూసుకుని మళ్లీ తొక్కుతున్నాను. స్కూలు దాటి గుర్కావోళ్ళ బీడు దాటి మలుపుతిప్పాను.. ఊళ్ళోకి.

**

గుమ్మం తెర పక్కకు జరిపి బయటకు వచ్చింది వెంకటలక్ష్మి. ఎత్తరుగు మీద కూర్చోమంటూ సైగచేస్తూ... గరుకునేల, పక్కనే కోడి గంపలు.. ఒకటే రెట్టల కంపు.. తలెత్తితే పైన కప్పులోంచి దూలంమీదకు ఎగిరి కూర్చున్న కోడిపుంజు నా వంకే చూస్తుంది. తోకెత్తుతూ..

కాస్త పక్కకు జరిగాను. నిటారుగా కార్చోడానికి నానా తంటాలు పడుతూ..

లోపలికన్నా పిలవచ్చుగా.... అంతే మొద్దులంటే అందరికీ లోకువే.. దీనికి మరీను. పైగా ప్రాణ స్నేహితురాలు..నేనంటే ఇంత చిన్నచూపున్నా.. దీన్ని ఎందుకు భరిస్తానో నాకే సరిగ్గా తెలీదు.

నాకు ఎదురుగా మొక్కల పీట లాక్కుని కూర్చుంది తను.

ఏంటే.. ఇలా ఒచ్చావ్.. ఇంకా పరిక్షలు కాలేదా.. వెంకటలక్ష్మి వెటకారం నవ్వు..

మొన్నే అయిపోయాయ్...

ఈసారన్నా పాసవుతావా.. లేదంటే మళ్ళీ దండయాత్రేనా..?

ఏమోనే పాస్ కావాలని మాత్రం రాసాను. అవుతానో లేదో సరిగ్గా తెలీదు.

అలా అంటే ఏలా? మీ చెల్లి చూడు.. నీతో చదివి పాస్ అయ్యి ఎంచక్క హాస్టల్లో చేరి కాలేజి చదువు చదువుతుంది. మరి నువ్వో..

ఎదురుగా అరిగిపోయిన రుబ్బురోలు పొత్రం ముఖాన్న వేసి కొట్టాలనిపించింది. 

బలవంతంగా..ఆపుకున్నాను...అవునే.. నేను దద్దమ్మనే నాకు చదువబ్బదు. ఏం చేయను. 
నాకు చదవాలని లేదు మొర్రో అని చెపుతున్నా విని చావడంలేదు.. కొంపలో..

సర్రున లేచి అరుగు దిగాను.

అది కాదే.. నేను నిన్ను ఏం అనడంలేదు. ఏదో మాట్లాడాలన్నావ్.. అనవసరంగా ఏదో మాట్లాడాను. రా ఇలా కూర్చో..

లేదే.. నేను ప్రశాంతి ఇంటికి వెళుతున్నా.. వీలైతే అక్కడికే రా.. అందరం కలుద్దాం..
సరే.. ఓ అరగంటలో నాన్న వస్తారు. చెప్పి వస్తాలే..

..

మెట్లు దిగి.. సైకిల్ దగ్గరకు నడిచాను.

ఏమే..

ఆ..ఆ..

కోపం వచ్చిందా??”

అదేం లేదే.. కోపం ఏం లేదు. విని విని అలవాటైపోయాయి.. ఈ మాటలు.

వస్తా.. నువ్వు త్వరగా వచ్చేయ్..

రవిగాడి మిఠాయికొట్టు సందు దాటి.. ఊళ్ళో ప్రశాంతి ఇంటి వైపుకు వెళుతున్నాను.

**

రైల్ ట్రాక్ దగ్గరగా పెద్ద మండువా లోగిలి ఇల్లు.. చుట్టూ చెట్లు.. దారంతా బురద.. మధ్యలో పళ్ళకిలించి పలకరించే స్నేహితులు. అందరినీ దాటి ప్రశాంతిని చూసి, వాళ్ళ వరండాలో ఈ బరువైన దేహాన్ని వాలుకుచ్చీలో మోపి.. ఆంటీ ఇచ్చే చిక్కని కాఫీ గొంతులో పోసుకున్నాకా గానీ.. మళ్ళీ మనిషినికాలేదు.

ఏదో ప్రశాంతత ఉంటుంది ఆ ఇంట్లో.. అందరూ దేవదూతల్లా ఆనతారు నా కళ్ళకు. ఎంతో ఆనందాన్ని పేర్చి కట్టారనుకుంటాను ఆ ఇంటిని.. ఎవరిని చూసినా నవ్వు ముఖాలతో పలకరిస్తారు. ఇక తిండి విషయంలో అయితే ఆపేసి, కడుపు పట్టనంత కూరి పంపుతారు. ఆంటీకి నేనంటే ప్రాణం. ఒక్క నేనే కాదు వాళ్ళ అమ్మాయి స్నేహితులెవరన్నా ఆమెకు ఇష్టమే...

ఇక మా ప్రశాంతికి నేనంటే మరింత ఇష్టం. బహుశా మా స్నేహితులం అంతా కలిసినప్పుడు అక్కడ నన్ను మాత్రమే ఎక్కువ తలుచుకోవడం..నేను లేనప్పుడు వెలితిగా ఫీల్ కావడం,. బాధన్నా, ఆనందమైనా ఇద్దరం కలిసి పంచుకోవడం.. ఇందుకేనేమో.. నా తోబుట్టువులకన్నా అదో పదిరెట్లు ఎక్కువ నాకు.

నాకు బాధ కలిగితే దాని కళ్ళల్లో కన్నీరొలుకుతుంది. ఈ విషయంలో నేను చాలా లక్కీ. మనసు మరీ భారంగా.. నా చుట్టూ జరుగుతున్న చాలా సంగతులను నేను డీల్ చేయలేని క్షణం వచ్చినప్పుడు నేను పలకరించే గుమ్మం ప్రస్తుతానికి ఇదొక్కటే...

**

అమాయకత్వాన్ని, కాస్త గడుసుదనాన్ని సమపాళ్ళలో కలిపితే అది అచ్చంగా మా ప్రశాంతిలా తయారవుతుంది.

ఏమే.. కనకాంబరాలు పెట్టుకుంటావా.. మా దొడ్డోవే.. చూడు ఎంత బావున్నాయో.

చేతిలో నాలుగు మూరల పూలదండ పట్టుకుని నా ఎదురుగా నిలబడింది ప్రశాంతి. లూజు పంజాబీ డ్రస్సులో మరీ పుల్లలా ఆనుతుందీరోజు. ఆ బక్కశరీరానికి ఇక ఒళ్ళు రాదు. ఇది మా అందరికీ తెలిసిన సంగతే..

కానీ జుట్టు కూడా తక్కువే. ఆ పలచని బుర్రకు రోజూ నరకమే.. చూసిన ప్రతి పువ్వూ తలలో తురిమేసి.. సాయంత్రానికి తలపోటంటూ వాలిపోతుంది. ఇక కొన్నాళ్ళకు బలహీనమై జుట్టు రాలిపోతుందని... 

మల్లీపూలు, సన్నజాజులు, చామంతులమీద ఇష్టాన్ని చంపుకుని తేలిగ్గా ఉండే కనకాంబరాల మీద పడింది. ఇదిగో ఇప్పుడు నాకు అవే ఇస్తుంది పెట్టుకోమని.

వద్దే తల్లి.. నాకు ఇప్పుడు ఏం పెట్టుకోవాలని లేదు. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. 
తమరు ఈ డెకరేషన్ కానిస్తే మన అడ్డాకు పోదాం..

నేనా.. ఇప్పుడా..అమ్మ పేరంటానికి వెళదాం అందే..

సరే.. రేపొస్తాలే.. బై

ఆగవే బాబు..నీకు మరీ దొందరే.. చెప్పేది అస్సలు వినవు..సరే పద.. అమ్మకు ఏదోటి చెపుతాలే..

**

అసలు మరొకరిని నా సైకిల్ మీద మోస్తున్నానన్న సృహే నాకు లేదు. అంత తేలిగ్గా ఉంది ప్రశాంతి.. రైల్వే కోటర్స్ దాటి స్టేషన్ వైపు వచ్చాం. ఇదే మా అడ్డా... నేను, ప్రశాంతి ఎక్కువగా కలుసుకునే చోటు. ఈ రైల్వే స్టేషనంటే మాకు చాలా ఇష్టం. ప్రశాంతంగా ప్రశాంతితో కలిసి ఎన్ని కబుర్లు పంచుకున్నానో ఇక్కడ. మేం ఇద్దరమే కాదు. ఇంకో నలుగురు ఉన్నారు. అంతా వీలుదొరికితే ఇక్కడే కలుస్తాం.

స్టేషన్ కు మూలగా ఉన్న బెంచీ మీద కూర్చున్నాను. వెనగ్గా వచ్చింది తను.

వెంకటలక్ష్మి కాసేపట్లో వస్తానంది. అది వచ్చేలోపు నీకు ఓ సంగతి చెప్పాలి. రెండు చేతులూ నలుపున్నాను.. చేతులకయిన చెమట స్కట్ కి తుడుచుకుని ఏదో చెప్పబోయాను.

ఏంటది.. కూడా తెచ్చుకున్న జీళ్ళు చప్పరిస్తూ.. నా పక్కనే కూర్చుంది ప్రశాంతి.

ముందు నువ్వా తిండి ఆపు..తర్వాత చెపుతాను.

మరేం మాట్లాడకుండా పక్కనే తుప్పల్లోకి కోపంగా నోట్లో జీడి విసిరేసి, చేతిరుమాలుతో చేయి తుడుచుకుంటూ.. చెప్పవే బాబు.. మరీ అంత కొంపలు మునిగిపోయే విషయం ఏంటో.. విసుక్కుంది.

నీకు కాదుగానీ.. నా కొంప మునిగే సంగతే..

ఆ.. ఏంటి.. అర్థం కాలేదు.

అవునే.. నాకు పెళ్ళి చేసేస్తున్నారు..ముహుర్తం పెట్టేసారు.

అవునా.. అదే మీ మావయ్య అన్నావ్.. ఆయనేనా..

ఆ.. అవును.

మరి అతనంటే నీకు ఇష్టం లేదన్నావ్ కదా..

లేదు..

మరి అంకుల్ కి చెప్పు..

ఏంటి చెప్పేది. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు చిన్నగా చెప్పాను. మావయ్యంటే నాకు ఇష్టంలేదు. అతను అందరిలా సరదాగా ఉండడు. కనీసం నాతో మాట్లాడడు. పైగా నాకు అతనంటే భయం అని. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని,. మీరే అమ్మతో చెప్పండి అన్నాను.

మరి అంకులేమన్నారు.

ఏమీ అనలేదు.

ఆయన కీ దగ్గరకు వెళ్ళి ఇదే మాటచెప్పారు.

కీ.. ఎవరే..

అదే నే మా అమ్మ..

మరి ఆంటీ ఏమంది

దానికి మా అమ్మ.. ఏం వెధవ వేషాలేస్తుందా.. నా తమ్ముడికేం బంగారం. ముండని.. కాళ్ళు విరగ్గొట్టి మరీ.. పెళ్ళి జరిపిస్తానని చెప్పండి అన్నదట. అదే తిరిగొచ్చి చెప్పారు. అప్పటి నుంచీ అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. ఇంట్లో ఉండాలంటేనే చిరాగ్గా ఉంటుంది. ఎవరూ నాతో సరిగా మాట్లాడరు. ఏదో నేరం చేసినదాన్ని చూసినట్టు చూస్తున్నారు.

అవునా.. పోనీ నేను మాట్లాడనా ఆంటీతో..

నవ్వొచ్చింది.

ఎందుకే నవ్వుతున్నావ్..

ఏం లేదే.. మా అమ్మ చేతిలో నువ్వు దెబ్బలు తింటున్నట్టు ఊహించుకున్నాను..

పోవే..

మా అమ్మ ఎవరి మాటా వినదే.. ఇక నాన్నగారు... బసవన్న జాతి... అక్కడ మన ఆర్తనాదాలు ఎవరికీ చెవుల వరకూ చేరవ్..

మరెలాగే..

ఏమో..ఆలోచించి.. ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది. అమ్మనాన్నే అర్థం చేసుకోకపోతే ఎవరితో చెప్పను. ఏదైనా మాట్లాడితే మునుపు జరిగిన సంగతులన్నీ ఎత్తి తిడుతున్నారు. నేను వాళ్ళ గుండెల మీద కుంపటినంట.. నన్ను వదిలించుకుంటేగానీ వాళ్ళ పరువు నిలబడదట.. ఇంకా ఎన్నాళ్ళు ఈ దరిద్రాన్ని భరించాలని అంటున్నారు. నాకు తెలీక అడుగుతాను. కన్నప్పుడు, పెంచినప్పుడు ఉన్న ప్రేమ పెళ్ళిచేసి పంపేటప్పుడు ఎందుకు ఉండదే... ఏదో పాత వస్తువును వదిలించుకున్నట్టు వదిలించికోవాలని చూస్తారెందుకు. మనల్ని కనమని మనం అడిగామా?” కన్నీరు పొరకట్టి చూపుకు అడ్డుపడింది.

అసలేం జరిగిందే.. తల్లీ..

అదే చెపుతున్నా...

తెలుసుగా నేను కాస్త అందంగానే ఉంటాను. అదే నాకు శాపమై కూర్చుంది.. పైటేసిన పదోరోజే నన్ను పెళ్ళి చేసుకుంటానని మా యార్డులో బిల్టింగ్ కాంట్రాక్టర్ రవీంధ్ర కబురంపాడు. అమ్మకు ఇదేం నచ్చలేదు. 

నాకు మేనరికం ఉందని, రవీధ్రవాళ్ళతో గొడవపడింది.. దీనంతటికీ నేను వాడితో చనువుగా మసలడమే కారణం అన్నారు అమ్మానాన్న.. ఎవడో పరాయి వాడిని నమ్మినంతలో సగమన్నా కన్న కూతుర్ని నమ్మలేదు ఇద్దరూ.. నెల రోజులు ఎవరికీ కనిపించకుండా అమ్మమ్మ దగ్గరకు పంపేసారు నన్ను. అక్కడ కూడా నన్ను సరిగా బతకనీయలేదు.. మరోకడు నేను నచ్చాను.. నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అందులోనూ అంతా నాదే తప్పన్నారు. భరించాను.. ఇప్పుడు నాకన్నా 13 ఏళ్ళు పెద్దాడిని తెచ్చి, నాకు నచ్చని పెళ్ళి చేస్తూ.. ఇంట్లో అంతా నాకోసం త్యాగాలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు...నేను బంగారు పూలతో పూజ చేస్తే మావయ్య లాంటి భర్త వస్తున్నాడని తెగ మురిసిపోతున్నారు.

నా చుట్టూ జరిగినదానికి..  నేనేదో కానిపని చేసి చెడిపోయిన దాని నన్నట్టు.. నన్ను చేసుకోకపోతే చస్తామని, వాళ్ళ పరువు కాపాడమని మావయ్య కాళ్ళమీద పడి ఒప్పించారు. ఇదీ నా మీద నా వాళ్ళకున్న నమ్మకం.

ఎంత కాని పని చేసివచ్చినా కొడుకుని అయితే నెత్తిన పెట్టుకుంటారు. వంశోద్ధారకుడంటారు మరి అదే ఆడదాని విషయంలో అది ఇంటికి పట్టిన శని.. చీడ.. అంటారే..

మరి ఇంతా తెలిసి మీ మావయ్య  మాత్రం ఏలా ఒప్పుకుంటాడు..

"అదే నీకు తెలీదు.. ఇంత తెలిసాకా ఇక ఏ మగాడన్నా ఏం కోరుకుంటాడు. తనకు అందంతోపాటు ఇలా అణిగి మణిగి తన చెప్పు చేతల్లో ఉండే పెళ్ళామయితే అన్నివిధాలా కావాలనుకుంటాడు. మావయ్య కూడా అందుకే ఒప్పుకున్నాడు.. ఎప్పుడన్నా నేను తోకజాడిస్తే నా గురించి తను చేసిన త్యాగాన్ని ఏకరువు పెట్టి.. నా కోరలు పీకి మూల కూర్చోబెడతాడు.. తన వరకూ ఎందుకు .. అతనిమీద భక్తితో నా తల్లితండ్రులే నామీద గుఢచారులైపోతారు.. ఇదే జరుగుతుంది..

నాకు తెలుసు ఈ పెళ్ళి నేను తప్పించుకోలేనని.. 

నాకు తెలియకుండానే కన్నీళ్ళు బుగ్గల్ని తడిపి కంఠం మీదుగా కిందకి జారిపోతున్నాయి. ప్రశాంతి నా చేతులు తన ఒడిలోకి తీసుకుంది. దూరంగా కాకినాడ వైపుగా వెళుతున్న రైలు పెద్దగా కూత పెడుతూ పట్టాలను పలకరించి పోతుంది. ఎంత మోతో.. నా గుండెల్లో నిండిన శూన్యమంతా చెదిరిపోయేంత.. మోత..

*





2 comments:

  1. బాగా రాసారు.మంచి ప్రయత్నమే. మీ పేరేమిటో చెప్పలేదు. వెంకట లక్ష్మీ, ప్రశాంతి . టైపింగ్ తప్పులున్నాయి .వాటిని సరి చేస్తే బాగుంటుంది.

    ReplyDelete
  2. Yekkadunnarandi intha kaalam..super andi..

    ReplyDelete

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...