Tuesday, 2 April 2019

పిడుగు పడింది....



తుంగపాడు రోడ్డులో సైకిల్ ఆపి కళ్యాణి కోసం చాలా సేపటినుంచి ఎదురుచూస్తున్నాడు కిరణ్. రావుగారి తమ్ముడు కొడుకు కిరణ్. చదువైపోయినా హైస్కూల్ ని ఇంకా వదల్లేదు. అక్కడ చదివే పిల్లలందరితోనూ అన్నయ్య అని పిలిపించుకుంటూ., సీనియర్ స్టూడెంట్ నంటూ..అక్కడే తిరుగుతుంటాడు. స్కూల్లో జరిగే ప్రతి విషయంలోనూ కిరణ్ ఉంటాడు. ఇక ఆడపిల్లల్ని ఏడిపించడంలో కూడా కిరణే ముందు. ఇది తెలిసినా మాస్టార్లు ఏం అనలేరు. ఎందుకంటే కిరణ్ పెదనాన్న ఊరి పెద్ద. వందెకరాల భూస్వామి. రావుగారికి పిల్లలు లేకపోతే దత్తుడిగా ఆ ఇంటికి వెళ్ళాడు కిరణ్. తమ్ముడి కొడుకని ఎప్పుడూ వేరుచేసి చూడలేదాయన. గారాబం ఎక్కువై ఊర్లో అందరిమీదా పెత్తనం చేయడం వరకూ వచ్చింది.

వస్తున్నారా.. లేదా.. చెప్పు.. వెదవ మొహం వేసుకుని అలా వెర్రి చూపులు చూస్తావే..

అది ఈ రోజు నాకు కనిపించాలి దాన్నే కాదు, దానికూడా వచ్చే ఒక్కత్తినీ వదలను, చూస్తూండ్రా ఈరోజు వాళ్ళకి నా చేతుల్లో మూడింది. మొన్న చేసిందానకి, నాకు గానీ సారీ చెప్పలేదో.. ఈ తుప్పల్లోకి లాగిపడేస్తాను. అసలేమనుకుంటున్నారు ఈ కిరణ్ అంటే..

హే.. పోరా..వదిలై.. మరీ సాగదీయకు.. మళ్ళీ మీ పెదనాన్నకి తెలిసిందా.. పెద్ద గొడవైపోద్ది.

ఇప్పటికే స్కూల్లో వాళ్ళు, ఊర్లో వాళ్ళు మనం ఆడపిల్లలని ఏడిపిస్తున్నామని అందరికీ చెపుతున్నారు.

ఆ.. చెపుతారు.. ఎవడికిరా నా మీద కంప్లేంట్ ఇచ్చే దమ్ముంది..

నువ్వు.. పోయి చూడు వాళ్ళొస్తున్నారేమో..

..

తుంగపాడు రోడ్లోంచి పదిమంది ఆడపిల్లల గుంపు ప్రతీరోజూ హైస్కూలుకి వస్తారు. కళ్యాణి వాళ్ళతోనే రావాలి. ఈరోజు ఇంకా రాలేదు. కళ్యాణి బావుంటుంది. తెల్లని మేనిఛాయ, లావుకు తగ్గ ఎత్తుతో, గిరజాల జుట్టేసుకుని, జడలో ఎప్పుడూ ఏదో పూల దండ వేలాడేస్తూ ఉంటుంది. చేపల్లాంటి కళ్ళతోనే అన్నీ మాట్లాడేస్తూ, ఎక్కడికి వచ్చినా, తనతో కాస్త పెంకితనాన్ని తోడుగా తెచ్చుకుంటుంది. ఈ పల్లెటూరిలో ఆడపిల్లకు అంత పొగరేంటని మగపిల్లలకి తనంటే గిట్టదు. కొందరు తగవులు పెట్టుకుంటే, మరికొంతమంది ప్రేమంటూ వెంటపడుతున్నారు.

**

దూరం నుంచీ వస్తున్న కళ్యాణి రోడ్డువార కట్టవలో తీగమల్లి పూలు కోసుకుంటుంది.

ఒసే.. ఇంకా ఎంతసేపు మరీ ఆలస్యమైతే మన డ్రిల్ మాస్టారితో పడలేం. ప్రేయర్ కూడా మొదలైపోతుంది.

త్వరగారా.. నీకీ పూల పిచ్చేమిటే తల్లి.. ఆ పొదల్లో పాములుంటాయ్.. రా.. త్వరగా..

ఆ.. వస్తున్నా.. బావుంటాయే ఈ మల్లెపూలు.. అవంటే నాకు పిచ్చి ఇష్టం.

ఊ.. బావుంటాయ్.. ఓ పాము కనిపించాలి.. అప్పుడు గానీ కేకలేయవ్..

పదండి.. పదండి..

**

దూరంగా రమణతో పాటు సైకిల్ రోడ్డు వారగా ఉంచి, జిల్లేడు చెట్టుకింద ఉన్న కిరణ్ కనిపించాడు.

ఏమే.. నీ పూలరంగడు ఇక్కడ ఉన్నాడేంటే.. నీకోసమేనేమో చూడు..

ఏంటి వాగుతున్నావ్..

అవునే.. అడిగో కిరణ్..

ఆగుదామా”?

ఏం అవసరం లేదు. రండి పోదాం.

**

ఆగు కిరణ్ నీతో మాట్లాడాలట...చెయిపెట్టి ఆపాడు రమణ..

ఏంటి మాట్లాడేది.. నాకు ఎవరితోనీ మాట్లాడాలనే ఇంట్రెస్ట్ లేదు.

స్కూలుకి టైం అవుతుంది. వెళ్ళాలి.

కిరణ్ రోడ్డు మీదకు వచ్చి.. ఏంటే అంతపొగరు నీకు ఏం చూసుకుని ...

చెప్పాగా.. మాట్లాడాలని లేదని దారొదులు..

పోవే.. సైకిల్ తో సహా రోడ్డు వారగా ఉన్న తుప్పల్లోకి తోసేసాడు.

ఒరే. సచ్చినోడా.. పంకజం తిట్లు అందుకుంది.

ఏ.. మీకు అదే సాస్తి జరగాలా నోరు మూయండి. మరీ ఎక్కువగా పేలితే ఇదిగో ఇలాగే జరుగుద్ది.

కోపంగా రమణ సైకిల్ మీద వెళిపోయాడు.

**

తుప్పల్లో పడిపోయిన కళ్యాణికి కొమ్మలు గీసుకుపోయాయ్.. నెమ్మదిగా లేపి, అంతా స్కూల్ వైపుకి వచ్చారు..

మాస్టారు కిరణ్ కళ్యాణిని తుప్పల్లోకి తోసేసాడు. తనకు దెబ్బలు తగిలాయ్..హెడ్ మాస్టార్ కి కంప్లెంట్ ఇచ్చారు.

**
అది మొదలు ఎక్కడ కళ్యాణి కనిపించినా బాగా ఏడిపించేవాడు. తన గురించి కాపుకాసి ఏదో వెకిలి వేషాలు వేయండం... ఇద్దరి పేర్లు స్నేహితుల నోళ్ళల్లో నానడం నచ్చక, తగువులాడేది కళ్యాణి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ తన చదువు ఆపి, పెళ్ళి చేసేస్తారో అని భయపడేది.
**
ప్రతి ఏడు బంగారమ్మ తల్లి తీర్థం ఆ ఊళ్ళో చాలా గొప్పగా జరుగుతుంది ఆ సంబరం. ఈ ఏడు కళ్యాణి నాన్న అమ్మవారికి మొక్కుచెల్లిస్తున్నాడు. కుటుంబం అంతా గుడికి బయలుదేరింది. మధ్యలో కలిసిన ఫ్రెండ్స్ తో కళ్యాణి తీర్ధంలోతిరుగుతుంది. ఎంత మంది జనమో.. తోసుకుంటున్నారు.. వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. కళ్యాణి, పంకజం కనిపిస్తున్న జీళ్ళు, కర్జూరం తిని, గాజుల కొట్టు వైపు వెళుతుంటే, కిరణ్ చెరుకురసం కొట్టుముందు కనిపించాడు.
"ఏ కళ్యాణి.. ఈ లంగా ఓణీలో పిచ్చెక్కిస్తున్నావే.. మరీ ఇంతందంగా ఉన్నావేటి"... నన్ను పెళ్ళి చేసుకుంటావా".. !

"చెప్పు తెగుద్ది.. నీ వేషాలన్నీ మానాన్నతో చెప్పానంటే నీ గుండేల్లో గునపం దించేత్తాడు".

"హే.. రావే.. ఇక్కడి నుంచీ పోదాం".. ముందుకి జరిగింది కళ్యాణి.

వెళుతున్న కళ్యాణి దగ్గరగా వచ్చి నడుం గిల్లి, నవ్వుతూ వెళిపోయాడు కిరణ్.

కళ్యాణి, పంకజం ఇద్దరి ముఖాలు ఎర్రబడిపోయాయి. ఈ అనుకోని సంఘటనకు ఏలా స్పందించాలో కాసేపు అర్ధం కాలేదు. కోపంగా ఏదో అనబోతున్న కళ్యాణిని భుజం పట్టుకుని ఆపింది పంకజం..,.

"ఇప్పుడు ఏం మాట్లాడకు.. నడు ఇక్కడి నుంచి".. బలవంతంగా లాక్కుని వచ్చేసింది" ..

"తీర్ధాలు, సంబరాల్లో ఇలా జరుగుతూనే ఉంటాయ్.. ఈ వెధవలంతా ఆడపిల్లల్ని తాకి, సంబర పడిపోతుంటారు. వదిలై.. ఈసంగతి ఎక్కడ తెలిసినా.. కథలుగా చెప్పుకుంటారు".. అవసరమా..?

" నీకు కొన్ని తెలీవు.. ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే చదువు మాన్పించేసి ఇంట్లో కూచోపెడతారు. ఇక్కడితో ఈ సంగతి మరిచిపో.. ఏం జరగనట్టు మామూలుగా ఉండు.. సరేనా"..
చెంపలపై నుంచీ కారుతున్న కన్నీటిని తుడుచుకుంది కళ్యాణి...

**

ఓసాయంత్రం హోరునగాలి నాలుగింటప్పుడు మొదలైంది. కడుపులో నొప్పిగా ఉందని ఒక్కత్తి ఇంటికి బయలుదేరింది కళ్యాణి. దారి పోడవునా చెట్లు విసురుగా తలలూపుతున్నాయ్. సైకిల్ మరీ భారంగా కదులుతుంది. ముందుకు తొక్కడం కష్టంగా ఉంది. శక్తినంతా ఉపయోగించి చాలా దూరం వచ్చేసింది.

ఇంకెంత ఓ కిలోమీటరు.. ఇంటికి వెళిపోవచ్చు.

జీడిపిక్కల ఫాక్టరీ దగ్గరికొచ్చేసరికి ఆకాశం నల్లని మబ్బుతో కప్పేసింది, పెద్ద చినుకులు, ఈదురుగాలి. ఓ పక్కకు విసిరేస్తుంది. ఎలాగా ఎక్కడన్నా ఆగుదాం. ఫ్యాక్టరీ గుమ్మం ముందు గేటుకు ఆనుకుని ఆగింది. ఒరగా జారేసిన గేటు ధబాలున తెరుచుకుంది. లోపల రెండు పెద్ద గొడౌన్లు, చుట్టు ఖాళీ స్థలం, ఓ వారగా చిన్న పాక. సైకిల్ కష్టంగా లోపలికి తీసుకొచ్చి, ఓ గొడౌన్ అరుగుమీద నిలబడింది. ఆ ఫ్యాక్టరీ ఆగిపోయి నాలుగేళ్ళయి ఉంటుంది. లోపలంతా పాడుబడిపోయి, గంభీరంగా, నిశ్శబ్దంగా ఉంది.

మరీ ఇంత భయంగా ఉందేంటి ఇక్కడ. కాసేపు వాన తగ్గగానే వెళిపోవాలి తనలో తనే గొణుక్కుంది.  

గేటు దగ్గర ఎవరో ఉన్నట్టున్నారు. అరె ఇటే వస్తున్నారు. వారగా తొంగి చూసింది. పూర్తిగా తడిచిపోయి, తల దులుపుకుంటూ కిరణ్ అటే వస్తున్నాడు.

ఏంటిది వీడు వస్తున్నాడు.

తను ఇక్కడ ఉన్నట్టు ముందే చూసినట్టుగా పలకరించాడు..

ఏం కళ్యాణి ఇక్కడున్నావ్.. ఎవరికోసం ఏంటి వెటకారంగా నవ్వుతున్నాడు.

నీకోసం కాదులే..

ఈసారి గట్టిగానే నవ్వాడు.

ఎందుకొచ్చావ్ ఇక్కడికి ..

ఏ రాకూడదా..

ఇది మా పెదనాన్న ఫ్యాక్టరీ.. నువ్వే ఎందుకొచ్చావో చెప్పు..

బయట వర్షంగా ఉంది అందుకే వచ్చాను.

నాకు నీతో మాట్లాడాలని లేదు.. నన్ను కదపకు

నాకూ లేదు.

మొన్న తిన్నావ్ గా నా చేతిలో ఇంకా నీకా పొగరు తగ్గలేదే..

పోరా.. నీకు ఎవడు భయపడతాడు.

వాగకు.. ఇక్కడ మనమిద్దరమే ఉన్నాం తెలుసా..

ఆ.. అయితే..

అదే చెపుతున్నా అంతే..

జేబులోంచి జామకాయ తీసి ఇచ్చాడు. తింటావా..

వద్దు..

తిను బావుంటాయ్.. మాచెట్టు కాయలే ఇవి..

అయినా వద్దు.

షెడ్ లోపలికి వచ్చి, కళ్యాణికి పక్కగా నించున్నాడు.

తిను కళ్యాణి.. ఇస్తున్నాగా...

తన వంక కోపంగా చూసి..చేతిలో జామకాయ లాక్కుంది.

ఇంకోటి తీసి ఇచ్చాడు..

ఒకటి చాలు..

కాదు.. ఇది నాకే.. కానీ నువ్వు కొరికి ఇవ్వు..

ఇంకా తీయగా ఉంటుంది..

ఏ.. ఒళ్ళెలా ఉంది..

ఏమో అదే తెలీడంలేదు..

కసురుకుని గోడమూలకు జరిగింది.

బయంటింకా వర్షం పడుతూనే ఉంది. పెద్దగా శబ్ధం చేస్తూ, ఉరుములు ఆకాశాన్ని వెలిగించి పోతున్నాయి. ఒక్కసారిగా పిడుగుపాటు ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ శబ్దం వెయ్యింతలు రెట్టింపై వినిపింనించింది. గుండెలదిరిపోయే శబ్దం.. గభాలున కిరణ్ గుండెల్ని హత్తుకుంది కళ్యాణి.

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...