రెండవ భాగం...
2004, జూన్, ఆరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలు,
రాత్రంతా పాప ఏడుస్తునే ఉంది. ముసలివాళ్ళు మూలుగుతున్నట్టుగా ఉందా ఏడుపు.
అందులోంచే చిన్నగా గురక. అత్తగారితో చెప్పాను.. “ఏం
లేదు పాలు పట్టి పక్కకు తిప్పి పడుకోబెట్టు సరిపోతుంది”
అన్నారు. కాసేపటి ఆయన లోపలినుంచి నేనున్న గదిలోకి వచ్చి “ఏమైంది
ఏడుస్తున్నట్టుంది. అమ్మకు చెప్పమని” లోపలికి వెళిపోయారు.
రాత్రంతా ఏదో పీడకల, నాచుట్టూ ఆడవాళ్ళంతా
కూర్చుని ఏడుస్తున్నారు. నేను నేలమీద పడిపోయి ఉన్నాను. ఉయ్యాల ఖాళీగా ఉగుతుంది. “ఛా” ఇలా
వచ్చిందేంటి పిచ్చికల.. అప్పటి నుంచే
మనసు భారంగా ఉంది. “ఏమైందీ పిల్లకు మరీ గుక్కతిప్పుకోకుండా
ఏడుస్తుంది”.
అమ్మ ఈ సమయంలో నాతో ఉంటే ఎంత బావుండేది.
నాన్నగారున్నా నాకు ధైర్యంగా ఉండేది. ఎందుకు వాళ్ళు రావడంలేదో.. రేపు పురుడునీళ్ళు
పోస్తారట.. అమ్మకు ఎందుకు కోపం వచ్చిందో తెలీదు. కబురుపెడదామన్నా.. ఎవరూలేరు. నిన్ననగా
తమ్ముడితో చెప్పాను అమ్మను పిలుచురారా అని.
మసగ్గా ఉన్న గదిలో కిటికీ తలుపు తెరిచి
అత్తగారిని పిలిచాను.
“అత్తయ్య పాప బాగా ఏడుస్తుంది. నాకెందుకో భయంగా
ఉంది. పోనీ డాక్టర్ దగ్గరకు తీసుకు వెళదాం రండి”.
“ఈరోజు ఆదివారం అమ్మాయ్... ఏ డాక్టర్లుంటారు.
చూద్దాం ఇలానే ఉంటే ఓగంట చూసి తీసుకెళదాం” అన్నారు.
ఏదో భయం వెంటాడుతుంది. “అత్తయ్య
లోపల పాల సీసా ఉంది ఇలా ఇవ్వండి”.
“ఊ”..
ఆయన బయటకు రాలేదు. మా మాటలు లోపలికి
వినపడుతున్నాయ్.
**
పదికావస్తుంది. పిల్ల ఏడుపులో తేడా బాగా
తెలుస్తుంది. “ఏమ్మా.. ఏమైందిరా.. నా చిట్టితల్లికి.. ఏంటే..
ఎందుకేడుస్తున్నావ్.. ఉండు నాన్నని పిలుస్తాను”.
ఆయన్ని పిలిచాను.
“ఊ.. సరే ఇప్పుడు హాస్పిటల్ అంటే కాస్త
కష్టమే.. పైవాటాలో ఉన్నవాళ్ళకి తెలిసిన డాక్టర్ ఉన్నారన్నావ్ గా వాళ్ళనడిగి అడ్రస్
కనుక్కో.. అక్కడికి వెళదాం”..
“ఈలోపు నేను ఆటో తీసుకువస్తాను”.
“అత్తయ్య.. పైన విజ్జీని కనుక్కోండి. డాక్టర్
ఎక్కడ ఉండేదీ”..
ఈలోపు పాపను పొత్తిళ్ళలోకి తీసుకున్నాను.
వణికిపోతుంది.. శరీరమంతా.. దాని చిట్టి చేతులు, చిట్టి పాదాలు.. మెరుస్తున్నాయి. ఒళ్ళంతా
మరీ కాంతితో తెల్లగా మారిపోతుంది. కళ్ళు మూసుకునే ఏడుస్తుంది. ఇప్పుడు గురక బాగా
వస్తుంది.
పాపను పట్టుకోవాలంటే భయంగా ఉంది. ఎందుకో అది నాకు
దూరమైపోతుందనే భయం నన్ను మరీ ఆవహించేసింది. “అమ్మా..
ఎక్కడున్నావ్..రామ్మా.. నాకేం జరుగుతుందో తెలీడంలేదు. నువ్వుంటే బావుంటుంది”.
అత్తగారు గబగబా మెట్లు దిగి వచ్చారు. “అమ్మాయ్
వాళ్ళు చెప్పిన అడ్రస్ మనకు దగ్గరలో లేదు. అరగంట పైనే పడుతుందట. ముందు దగ్గరలో
ఎవరన్నా ఉన్నారేమో చూద్దాం”..
“సరేనండి.. లోపలి బీరువాలో ఉన్న బట్టలివ్వండి..
పాపకు వేస్తాను”.
“అవెందుకమ్మాయ్.. కొత్తబట్టలు వేయకూడదు. రేపు
పురుడునీళ్ళ తర్వాత వేద్దామని తెచ్చాను”.
“లేదత్తయ్య.. ఇప్పుడే వేద్దాం”..
“సరే.. నీ ఇష్టం”..
నాకే తెలీకుండా కన్నీళ్ళు జారిపోతున్నాయ్..
**
ఈలోపు ఆటో వచ్చింది. ఆటో రోడ్లన్నీ తిరుగుతుంది. వెనక
ఆటోలో ఆయన వస్తున్నారు. బిడ్డను అలా పట్టుకునే కనిపించిన హాస్పటల్స్ తిరుగుతున్నాను.
ఎక్కడా డాక్టర్లు లేరు. అత్తగారు కంగారు పడుతున్నారు.. అమ్మయ్ పాపను నేను
ఎత్తుకుంటాను నాకివ్వు. నువ్వు ఆటోలోనే ఉండు..
సిజేరియన్ కుట్లు ఇంకా పచ్చిగానే ఉన్నాయ్.. ఇలా
మెట్లెక్కితే చాలా ప్రమాదం తల్లి.. నువ్వు కిందుండు..
పరవాలేదు..నేనే ఎత్తుకుంటాను. నన్ను ఆపకండి.. ఆమె
మాట వినిపించుకోకుండా విక్రమ్ కుమార్ హాస్పిటల్ మెట్లెక్కి లోపలికి వెళ్ళాను.
వెనకాలే ఆయన, అత్తయ్య వచ్చారు.
డాక్టర్ గారు లేరండి.. క్లబ్ కెళ్ళారు. అయినా
ఈరోజు ఆదివారం కదా పెద్దగా కేసులు చూడరు.
అది కాదు బాబు.. పిల్ల ఎందుకో గురకగా
ఆయాసపడుతుంది..నాకు ఏడుపుతో గొంతులో ఏదో అడ్డుపడింది.
అదేనమ్మా.. మీరు గవర్నమెంట్ హాస్పటల్ కి
తీసుకువెళ్ళండి..
అమ్మా.. పైవాళ్ళు చెప్పిన అడ్రస్ ఇలా ఇవ్వు.. ఆయన అడ్రస్ తీసుకున్నారు..
ఎక్కడో లోయల్లోకి జారిపోతున్నాను. ఇక్కడ
జరుగుతున్నదంతా నాకు కలలోలా.. అద్దంలోంచి చూస్తున్నట్టుగా ఉంది. ఏలా చెప్పాలో
తెలీనంత బాధ. ఇక కొద్ది క్షణాల్లో బిడ్డ నన్ను వదిలి వెళిపోతుందని ఈ కన్న పేగుకు
తెలుసు. అవును.. నాకు తెలుస్తుంది. ఈ పేగు బంధాన్ని కనురెప్పలు విప్పకముందే.. నా
పొత్తిళ్ళు విడవక ముందే నిన్ను దూరం చేసుకుంటున్నానని... ఈ కన్న పేగుకు తెలుస్తుంది....
నీ స్పర్శ నా నుండీ దూరమవుతుందని...
**
ఆటో చాలా వేగంగా వెళుతుంది.. పాప గురక
ఆగిపోయింది. మెడ పక్కకు తిప్పి నిద్రలోకి జారిపోయింది. కొన్ని క్షణాలు మనల్ని మరీ బాధలోకి
నెట్టేస్తున్నాయని తెలిసినప్పుడు.. మన ఎదురుగా జరుగుతున్న విషయాలకు మనసు, శరీరం
రెండూ వదిలి (దాటి) వివశులమైపోతాం.. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది. ఎదర నేను అందుకోబోతున్న
దుఖఃపు తాలూకు ఛాయలు నన్ను ఆవహించి చాలా సమయమే అయింది.
విశాలంగా ఉంది రోడ్డు.. ఆటో ఓ ఇంటి ముందు
ఆగింది.. ఇదేనమ్మా.. దిగండి..
వేగంగా ఆటోలోంచి దిగి గేటుదాటి వరండాలోకి
వెళ్ళాను. ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి మాకు ఎదురొచ్చి.. ఇక్కడే ఉండండి. డాక్టర్ గారిని
పిలుస్తాను.. అని లోపలికెళ్ళింది.
డాక్టర్ ఓ అరవైఏళ్ళాయన పాపను తీసుకుని గదిలోకి
రమ్మన్నారు. లోపల గదిలో బల్లమీద పడుకోబెట్టి చాలా పరిక్షలు చేసారు..
లాభం లేదమ్మా.. పాప పరిస్థితి చైయ్ దాటిపోయింది.
ఓ రెండురోజులు ముందుగానీ తీసుకువచ్చి ఉంటే వైద్యం చేసేవాడిని. ఆఖరు నిముషంలో తీసుకొచ్చారు..
ఏం చేయలేను. నిమోనియా.. ముదిరిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు..గవర్నమెంట్
హాస్పటల్ కి తీసుకువెళ్ళండి. అక్కడ ఈ వైద్యానికి సంబంధించిన పరికరాలున్నాయి. అది
కూడా ఈ పూట గడుస్తుందంతే...
లోపల హృదయం ద్రవించి కన్నీరు పెట్టుకుంటుంది. నా
ఉమ్మనీరు తడి ఆరకముందే..ఈ అమ్మ స్పర్శ నీకు తనివి తీరకముందే నిన్ను చేజార్చుకుంటున్నాను.
నేనేం మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. బిడ్డ తేలికగా గవ్వలా మారిపోయింది. మళ్ళీ
ఒళ్ళోకి తీసుకోవాలని ప్రయత్నించలేకపోతున్నాను. లోలోపల చెప్పలేని భాధ, కోపం, కసి..
దేవుడా నన్ను అన్యాయం చేయకు. నిన్నే నమ్ముకున్నాను.
**
ఆటో గవర్నమెంట్ హాస్పటల్ గేటుముందు ఆగింది. తల్లీ
పిల్లల విభాగంలోకి మళ్ళింది. లోపల పై అంతస్థులోకి వెళ్ళాకా అన్నీ మెట్లు
ఎక్కేసరికి ఆయాసం వచ్చింది. చేతిలో బిడ్డని అత్తగారికి ఇచ్చి, గోడకు
జారబడ్డాను...కాళ్ళ మధ్య నుంచీ పచ్చిగా ఉన్న కుట్లు తెగి రక్తం దార కడుతూ కిందకు
జారిపోతుంది.
ఒక్కసారిగా మైకం.. ఆ గోడనే ఆనుకుని, నేల మీదకు
జారిపోయాను. ఎంతసేపలా పడి ఉన్నానో తెలీదు. కళ్లు మూతలు పడిపోతున్నాయ్..లోపల గదిలో
పాపకు వైద్యం చేస్తున్నారు. అమ్మ కంగారుగా నా దగ్గరకు వచ్చింది. అన్నీ నా చెయ్
దాటిపోయాకా ఇప్పుడు వచ్చింది. నన్ను చీకటిలోకి నెట్టేసాకా.. ఇప్పుడు వచ్చింది. ఏం
చేద్దామని..
**
నా చుట్టూ పరిసరాలు ఉచ్చకంపుతో నిండిపోయాయి.
ఉమ్ములు, కాలిన బీడీలు, మురికి పేరుకున్న చెత్తబట్టలు,., పేగులు దేవేస్తున్న
వాసన... ఈ ఆదివారాలు వాటికీ సెలవే.. ఆ ప్రదేశం బాగాలేదని, అక్కడ నేను కూర్చోలేనని
అనిపించలేదు. శరీరం సత్తువ అయిపోయింది. నేను నా బిడ్డ దగ్గరకు వెళిపోతున్నాను.
నాకు తెలుస్తుంది. కడుపులో విపరీతమైన నొప్పి, కుట్లు తెగి కారుతున్న రక్తం నా
చుట్టూ మడుగు కట్టేసి, ఎండిపోయింది. లోపలికి వెళ్ళి పాపను చూడాలి,. లేవడానికి
శరీరం సహకరించడం లేదు.
నన్ను దాటుకుని కొత్తగా వైద్యం నేర్చుకుంటున్న
డాక్టర్లు వెళుతున్నారు. వాళ్ళ చూపులు నన్ను తాకి జారిపోతున్నాయి. లోపలి నుంచీ
కంగారుగా వచ్చిన అమ్మ.. ఏం లేదే..కంగారు పడకు.. డాక్టర్ చూస్తున్నారు. వాంతులు,
విరోచనాలు అవుతున్నాయ్. ఆక్సిజన్ పెట్టారు. అమ్మ మాటలు చెవిని మాత్రమే
తాకుతున్నాయ్.. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా..తమ్ముడు తీసుకు వెళతాడు. వాడితో వెళ్ళు.
నేను, మీ అత్తగారు, మీ ఆయన ఉన్నాంగా.. కంగారు పడకు.. నీకు నీరసం వస్తే కష్టం..
వెళ్ళు..
నాకు తెలుసు లోపల ఏం జరుగుతుందో.. పాపని
చూడాలనిపించింది. అద్దంలోంచి పసిప్రాణం ఆక్సిజన్ గొట్టం బరువును మోయలేకపోతుంది.
గుండెల్లోకి వెళుతున్న గాలి, బయటకు ఊపిరిని బరువుగా లాగుతుంది. ఎన్ని
గంటలయ్యిందిరా నువ్వు నా రక్తాన్ని చీల్చుకు వచ్చి, అప్పుడే నిన్ను తిరిగి పంపించేస్తున్నాను.
ఎవరు తీరుస్తారీ బాధ.. ఎవరికి తెలుస్తుంది. నా చనుపాల రుచికి నువ్వు అలవాటు
పడకముందే.. నా తొమ్మిది నెలల కలల పంటను దూరం చేసుకుంటున్నాను. ఇలా నువ్వు
నేలపాలైపైతావని తెలిస్తే, నా రక్తమాంసాలు నీకు పంచి ప్రాణం పోసేదాన్నే కాదు ఈ
నిర్భాగ్యపు తల్లిని.. క్షమించు..
**
సాయంత్రానికి దగ్గరిలోని చుట్టాలంతా వస్తున్నారు.
వాళ్లేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నాన్నగారు, ఆయనా, అమ్మా, అత్తగారు
అంతా నేనున్న గదిలోకి వచ్చారు. అమ్మ ఏడుస్తు నా భుజం మీద చెయ్యి వేసింది.
**
గొంతెత్తి ఈ తప్పు ఎవరిదని అడగాలనుంది. ఎవరు ఈ
పంతాలు తెచ్చింది. అంతా నా చుట్టూ ఉంటే నేనీరోజు నా బిడ్డను పోగొట్టుకుందునా.. నిండా
ఇరవై ఏళ్ళు రాని నేను. ఓ బిడ్డకు జన్మనిచ్చి, మరో బిడ్డను పోగొట్టుకున్నాను. ఈ భాధను
పేగులు తెగేలా అరిచి ఎవరికైనా చెప్పాలనుంది. ఆయన ఒళ్ళో తలవాల్చుకోవాలని ఉంది.
గుండెలు బరువు దిగిపోయేదాకా ఏడవాలనుంది. ఏడి, ఎక్కడున్నాడు. అసలు నాకెవరున్నారు.
ఈ బాధను ఎవరు తీరుస్తారు. ఓదార్పు ఎవరిస్తారు.
కట్టుకున్నవాడా.. అతనికి నేనో పిల్లల్ని కనిచ్చే యంత్రాన్ని మాత్రమే.. మరే విధమైన
ఆశను, భరోసాను పెళ్ళితో అతడు నాకు ఇవ్వలేకపోయాడు. అంతా కలిసి ఒక చిన్ని దీపాన్ని
చిదిమేసారు. ఎన్ని జీవరాసులు పుట్టి చనిపోవడంలేదు అని తేలికగా మాట్లాడే వాళ్ళను ఈ
జాబితాలోంచి తొలగిస్తే.. నాకు మనుషుల మీద విరక్తి కలిగించింది.. ఈ భాధ.
అతనితో
వేసిన అడుగుల్ని వెనక్కుతీసుకునే నిర్ణయానికి బీజం పడింది ఇక్కడే... ఎన్నో
భరించాను. మరెన్నో సహించాను. కానీ ఇద్దరు కలిస్తే, ఓ రూపం దిద్దుకున్న ప్రాణాన్ని
కాపాడుకోలేని అసమర్ధునితో ఇక ఈ ప్రయాణం సాగించే స్థితి నాలో నశించిపోయింది.
ఇంత జరిగినా మరో ఎనిమిదేళ్ళు నేను అతనితోనే
ఉన్నాను. బ్రతికే ఉన్నాను. మరో ప్రాణానికి ప్రాణం పోసాను. అప్పుడు కూడా అతను నాకు
లేడు.
*
Santi super mana ok Mansu untudu
ReplyDelete