Sunday, 29 September 2024

నీలోకి ఒలికిపోయాననీ..



ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది.. 
కొన్నిసార్లు అనిపిస్తుంది. 
నేను నీలోకి ఒలికిపోయాననీ.. 

నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి వీడ్కోలు పలికాను.
అసంపూర్ణంగా ఉన్న చాలా ప్రశ్నలకు జవాబులు వెతికాను.

నీకిదంతా ఉత్త చాదస్తంగా 
అనిపిస్తుంది కానీ..
రద్దీ రద్దీ దారులంట పోతున్నా 
నీ ఆలోచన నిలువనీదు.

ఏదో కంగారు..
పూల దారులంట నడిచినా మబ్బులు, మెరుపులు, చినుకులు..నువ్వు కమ్మేసినట్టూ ఉంటుంది. 

ఉదయాలన్నీ నక్షత్రాల వేళలోకి కలిసిపోయేవేలే అనే భావన కలుగుతుంది. 

విషాదాన్ని మోయగలిగేది, 
కన్నీరును ఆపగలిగేదీ నీ ఊహే
నాలోకి తొంగి చూసుకున్నా నువ్వే.. నమ్ము

Tuesday, 24 September 2024

మనసు ఆగం అయిపోనాది.. థ్యాంక్యూ 'సన్ ఆఫ్ జోజప్ప'



ప్రతి జీవితానికి దాటి వచ్చిన దారి ఒకటి ఉంటుంది. పుట్టుక నుంచి చావుదాకా దాటేసి వచ్చిన బాల్యం, కౌమారం, యవ్వనం ఇలా దశలన్నీ దాటి వచ్చి అనుభవాల మధింపులో పూర్తిగా జీవిత పరమార్థం తెలుసుకుని నిలబడేందుకు పట్టే సమయం అంటూ ఒకటి ఉండే తీరుతుంది. ముఖ్యంగా ఈ దశలన్నింటిలోనూ ప్రధానమైనది బాల్యం. బాల్యాన్ని తల్లిదండ్రులు మాత్రమే మోస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ బిడ్డల చూట్టూ ఉండే వాతావరణం, పెరిగే తీరు, మాట్లాడే మాట, బంధాల పటుత్వం, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, సమాజం కూడా వాళ్ల పెరుగుదలను శాసిస్తుంది. ఇదంతా వేదంతంగా కనిపించినా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య దశ బాల్యమే. బాల్యానికి అమ్మానాన్నల ప్రేమతో పాటు చాలా కావాలి. పుట్టుక మనచేతిలో లేనట్టే పెరిగే విధానం కూడా మన చేతిలో లేదు. నాకు తెలిసి బాల్యం ఇంత ప్రాధాన్యమైన దశ అని నేను నొక్కి చెప్పడానికి చాలా కారణాలున్నాయి. బాల్యంలో భయం తెలియక పెరిగే విధానం ఒకలా ఉంటుంది. భయం తెలిసి పెరిగిన పిల్లల తీరు మరోలా ఉంటుంది. అసలు బాల్యమే శాపంగా మారిన పిల్లల జీవితాలు కూడా నేను చూసి ఉన్నాను. మనం మామూలుగా అనుకునే చాలా విషయాలు పిల్లల మనసుల్లో ఎంతగా ముద్రవేసుకుంటాయో..


ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చాలారోజులు అయింది నేనో పుస్తకాన్ని పూర్తిగా విడవకుండా చదివి. చలం ప్రపంచం నుంచి పక్కకు వచ్చి చదివిన పుస్తకం, కథ ఏదైనా ఉందంటే అది మెహెర్ పుస్తకమో, కథో మాత్రమే అవుతుంది. అలాంటిది ఆయన చదివి ఇచ్చిన 'సన్ ఆఫ్ జోజప్ప', సోలోమాన్ విజయ కుమార్ గారు రాసిన ఈ నవలను ఈరోజే పూర్తి చేసాను. కథ తీరు గురించో, కథ శైలి గురించోకంటే ఓ పసివాడి మనసు కనిపించింది నవలంతా. చాలా దగ్గరగా పరిశీలించి చెప్పిన విధంగా అనిపించింది. ప్రతి డిటేల్ అంత చక్కగా ఇవ్వగలగడం విషయంలో రచయితకు నెనర్లు.. లోతుగా చెప్పిన ప్రతి విషయం నేరుగా గుండెల్లో దిగింది. శాపం బాల్యానిదే కాదు పిల్లగాడి జీవితంలోనే ఉంది. పుట్టుక తన చేతిలో లేదు దానికన్నా విషమమైన పరిస్థితులు.. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం, తల్లి మరో దారిలో వెళ్లడం, మేనమావలు సరిగా పట్టించుకోకపోవడం, చులకనగా చూడటం, పుట్టుకతో వచ్చిన (వైకల్యం) మార్పుతో రోజురోజుకూ మథనపడటం ఇలాంటి విషయాలు చాలా దగ్గరగా గమనించి చెప్పినట్టుగా అనిపించాయి.

గతంలో చదివిన మోహన స్వామి నవల ఎప్పుడూ తెలియని విషయాలను, అసలు ఆలోచనకు రాని సంగతులను తెలిసేట్టూ చేస్తే, ఈ నవల మాత్రం ఆ ప్రపంచానికి మరో ద్వారాన్ని తెరిచినట్టుగా అనిపించింది. ఇది ఓ మనిషి రొద. అతనికి మాత్రమే తెలిసిన ప్రపంచం, పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, డైరీ రాసుకోవడం, చిన్నతనంలో పోయిన నాన్నను దైవంలో చూసుకోవడం, కోరిక కన్నా మించిన ఆత్మీయతను కోరుకోవడం ఇవన్నీ కాస్త భిన్నంగా తక్కువ మందికి మాత్రమే దక్కే ఆత్మీయ ఆలింగనాలు.. మనసు భారాన్ని, లోపలి కల్లోలాన్నీ చెప్పుకునే దారి ఆపిల్లాడికి అవిమాత్రమే అయ్యాయి. తల్లిచాటు బిడ్డగా బ్రతకాల్సి రావడం, అన్నీ తెలిసీ పరాయివాడిని నాన్నా అని పిలవాల్సిరావడం, అతని చేతిలో పెరిగిన విధానం, భయం, నలుగురిలో పొందిన అవమానాలు, మానసిక సంఘర్షణ పూర్తిగా అతనికి మాత్రమే సొంతం అయిన బాధ అది. మరో హృదయానికి తెలిసే అవకాశమే లేని బాధ.

ఇక్కడ ఎక్కడా నేను sexuality గురించి మాట్లాడటం లేదు. అది పూర్తిగా ఎవరి చేతిలోనూ లేనిది. అతనిలోని బాధను మాత్రమే కేంద్రంగా చేసుకుని చెప్పాలనేది నా ఉద్దేశ్యం., ఒకడు ఎందుకు తీవ్రవాదిగా మారాడు, లేదా హంతకుడిగానో, పిరికిగానో మారాడంటే దానికి వెనుక బాల్యం నుంచి పెరిగిన, చూసిన పరిస్థితులే కారణం అవుతాయని నేను బలంగా నమ్ముతాను. విజయ్ కుమార్ గారు రాసిన ఈ కథలోని సుధా, సిన్నమ్మ, అమ్మ, బాబు పాత్రలన్నీ పిల్లాడి చూట్టూ వాడు అనుభవించే మనసు ఘోషను పట్టించుకున్నవి కాదు. అవ్వ, లింగ దగ్గర మాత్రమే పిల్లాడికి ప్రేమ, ఔదార్యం దక్కాయి. అతగాడి మనసులోని బాధను అర్థం చేసుకోగలిగాయి. పుట్టుకతో వచ్చిన తేడాలను వేలెత్తి చూపగలిగితే.., వెలుతురు రాగానే దైవాన్ని కొలిచే ఎందరో చీకటి పడగానే వెతికే ఈన్యానికి, చీడకు ఎన్ని పుస్తకాలు రాయాసినా సరిపోదు. సమాజం చూసే చూపు, మాట్లాడే విధానం, ఎదుటివారిని తమలోకి తీసుకునే తీరు ఇవన్నీ అతని కులం, మతం, ఆస్తి అంతస్తుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇప్పటి రోజుల్లో. అందుకే బాల్యంలో స్నేహంలో ఉండే అమాయకత్వం, పెరిగి పెద్దయ్యాకా అదే బాల్య స్నేహితుల మధ్య కరువైపోతుంది. స్టేటస్ మధ్యన వచ్చి చేరాకా, స్నేహానికి తూట్లు పడటం ఎంత గొప్పవారికైనా ఎదురయ్యేదే.

మళ్ళీ కథలోకి వస్తే పిల్లగాడు నాకు చాలా బాధను చెప్పుకున్నాడు. అతగాడి బాధను అమ్మగా విని, ఓదార్చాలనిపించింది. పిల్లగాడు సమాజం కన్నా తల్లికి చెప్పుకోలేక పడే బాధే ఎక్కువగా కనిపించింది. కథ సాగిన తీరు, ప్రతి మనిషిలో రగిలే కోరిక వెనుక పడే పాట్లు చదువుతుంటే మనిషికి కావాల్సిన కనీస అవసరాల్లో సెక్స్ అనేదానికి ఇంత పాత్ర ఇవ్వాల్సిరావడం మనిషికి అసలైన శాపం అనిపించింది. ఈ నవలలోని కథ మొదలు కావడమే పిల్లగాడితో మొదలవుతుంది. వాడి అయోమయానికి, అర్థంకాని తనానికి జతగా మనం నడిచి కథలోకి వెళ్ళడానికి కాస్త తిరుపతి యాస అడ్డంపడాలని చూస్తున్నా పిల్లాడు చేయిపట్టుకుని తనతో పాటు నడిపించుకుని తీసుకుపోతాడు. విజయ్ కుమార్ గారి రచనకు, పాత్రలను దగ్గర చేసిన విధానానికి మరోమారు మంగిడీలు.. థ్యాంక్యూ..

బాల్యం లెక్కలు..


ఇప్పటి నేను ఏ హీరోనూ ఫాలో కాను. ఫ్యాన్ అస్సలే కాను. ఏ రాజకీయ నాయకులతో నాకు పనిలేదు. ఎవరికీ నేను మద్దతులు ఇవ్వను. ఇదంతా స్వవిషయం. సరే దేవానంద్, షమ్మీ కపూర్, గోవిందా, ఇలా కొందరిని మాత్రమే ఆరాధించే నాకు చిన్ననాటి జ్ఞాపకంలో ఓ హీరో అలా నిలిచిపోయాడు. ఎంత ఆరాధనో అది. అతని పోస్టర్ ఎదురుగా కూర్చుని ఎంత ఆలోచించేదాన్నో, ఇంటి నిండా సినిమా పోస్టర్లు అతికించే రోజుల్లో పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. తాటాకు తడికలకు సినిమా పోస్టర్లు అతికించేవారు, హోటళ్లకు, ఇళ్ళల్లో కూడా అలా అంటించడం అలవాటుగా ఉండేది. ఇప్పటి రోజుల్లో అయితే గోడ పాడవుతుందని, పెయింట్ పోతుందనే గొడవ అప్పుడు లేకపోవడం సంతోషం. అప్పటి ఊహ, ఆలోచనలు భలే ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పటి రోజులకు పూర్తి భిన్నంగా..
కొన్ని జ్ఞాపకాలు ఎంత తీవ్రంగా బలపడిపోతాయంటే ఎంత కాలం అయినా అలా నిలిచిపోతాయి. ప్రేమ అనే మాటకొస్తే అది పుట్టేందుకు వయసుతో లెక్కలు వేస్తాం కానీ.. అప్పటికి ఆరేళ్ళు కూడా లేని నేను ఇతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎవరో ఏంటో కూడా తెలీదు. సరిగ్గా చెప్పాలంటే ఇప్పటికి, ఈరోజు వరకూ కూడా అతని కోసం చూసానంటే నమ్మండి. ఈవేళ ఏదో రీల్ చూస్తుంటే కనిపించాడు. వెతగ్గా అతనే ఇతనని తెలిసి ఆశ్చర్యం వేసింది. పేరు కనుక్కుని చూసాకా నా ఆనందం విలువ ఇంతని చెప్పలేను. ప్రేమో, ఆరాధనో మరేదో.. మనిషిని చూసి పుట్టింది కాదు. నాయనమ్మగారి ఇంటికి అతికించిన చిన్న ఫోటో అక్కడే చక్రవర్తి అని రాసి ఉండేది. అది చూసి అతని పేరు చక్రవర్తే అని చాలా ఏళ్లుగా అనుకుంటూ వచ్చాను. తలమీద క్యాప్‌తో, మంచి స్టైల్‌తో ఉండే అతగాడి పోస్టర్ నా జ్ఞాపకాల్లో బలపడిపోయింది.
నాయనమ్మ ఇంటికి వెళ్ళిన ప్రతిసారీ గుమ్మానికి కాస్త దూరంలో అంటించిన ఈ పోస్టర్ దగ్గరకు వెళ్ళి అతన్ని చూసాకనే ఇంట్లోకి అడుగు పెట్టేదాన్ని. చాలా ఏళ్ళకి నేను వెళ్ళేసరికి ఇంటికి సున్నంవేసాకా ఆ పోస్టర్ కనిపించలేదు. నాయనమ్మను అడిగితే సున్నంవేసేవాళ్ళు తీసేసారని చెప్పింది. ఎంత దుఃఖం అంటే పైకి మామూలుగా ఉంటూనే తెగ ఏడుపు వచ్చింది. చాలా రోజులు అతను సినిమా పత్రికల్లో కనిపిస్తాడని శివరంజనిలో వెతికేదాన్ని ఎప్పుడూ కనిపించలేదు. ఇదిగో ఈరోజు దొరికింది అతని అసలు పేరు..కబీర్ బేడీ అట.. అప్పటి నా బాల్యానికి పరిచయం అయిన హీరో.. భలే హ్యేపీ నేను.
May be an image of 1 person, beard and suit

Friday, 20 September 2024

గన్నేరు అక్షరాలు..

 

అలవోకగా కవిత పుట్టడం లేదు.
లోతుగా తవ్వి తీయాల్సి వస్తుంది.
ఒక్కోసారి తెగి, ముక్కలై దొరుకుతాయి
అక్షరాలు

మరోసారి కన్నీళ్ళు పెట్టించే పంక్తులు పొంగుతాయి.
విరహంతో, ప్రేమతో నిండి
రేపటిపై ఆశను పట్టుకువస్తాయి.



చుక్కలు రాలిపడి, నెత్తురోడుతున్నట్టు
వస్తుంది ఆలోచన.
అమృతాన్ని నింపే పంక్తులు,
ఆలోచనలై రాలిపడే గన్నేరు అక్షరాలు
విషాదపు సంగతీ, హృదయాంతరపు
సంతోషాన్నీ గుర్తుచేస్తుంది.


అగాధం నుంచి అనంతం దాకా
నాలోని చీకటి కోణాలన్నీ
కవిత్వానికి ఎరుకే..

దిగులప్పుడు, ఆనందాన్ని ఎకరువు
పెట్టేప్పుడూ మాటలను
సంభాళించేది ఈ కవిత్వమే మరి..



Tuesday, 17 September 2024

గాయం



చీకట్లో ఓమూల విడిచిపెట్టి పోయే దైన్యాన్ని తగిలించాను.
ఒక్క చుక్క అమృతం కోసం సముద్రలోతుల్ని గాలించాను.
ప్రశ్నించే నీ కళ్ళలో అమృత జాడల్ని వెతికాను‌.
ఏదీ దాచుకోలేదు, జీవితాన్ని తెరచి నీముందు ఉంచాను.

ఇదేం హృదయభారమో తెలీదు.
ముళ్లను దాటే అవరసమే ఎప్పుడూ
సంతోష ఛాయల్ని వెతుక్కోవడమే
ఎప్పటికప్పుడు బాటసారినై

ఒదలని పాటలా కమ్మేసుకుంది
నీ జ్ఞాపకం.

నీ మాటలు ఉండుండీ అర్థం కావడం లేదు.

నిన్నటి ఉదయాన గుండెలకు హత్తుకున్నా కూడా.. తృప్తి కలగలేదు.

హృదయాన్ని ఇచ్చేసుకోవడమే తెలిసిన నాకు

గాయాల సలుపు ఎప్పుడూ పరిచయమే.. (శ్రీశాంతి మెహెర్ )

Friday, 19 July 2024

అలరాసపుట్టిళ్ళు).. అదే ఇప్పుడైతే.. సత్యవతి ఏం చేసేది..?


మనసుకు ఏది హాయి.. ఏది సోగయం, ఏది మైకం, ఏది మరపు రత్నాలలో లేని సొగసు, మణులలో లేని మెరుపు, ధనంలో, బంగారంలో నగల్లోలేని ఆనందం మంచి మనసులో, ఆప్యాయతలో ఉంది. స్వచ్ఛమైన మనసులు ఎందుకు అల్లుకుంటాయో తెలుసుకునే లక్షణం కొందరికే సొంతం. నిశ్చలమైన ప్రేమ, అరమరికలు లేని ప్రేమ విజయం సాధించాలంటే.. ఈ భారతావని మెదడు పురిటి బిడ్డంతే ఉంది మరి. కులం, మతం, ధనం, అంతస్తుల తూకాల మధ్య వేలాడుతుంది. పరువు ప్రతిష్టల అంచుల తేడాలో తూగలేక ఊగిసలాడుతూనే ఉంది. 

ఆడదాని మనసు ఎరిగి వివాహాలు జరిగితే ఇక చెప్పేదేముంది. ఆడదాని మనసు తెలుసుకోగలిగితే ఇక ఇంత ఉపోద్ఘాతం ఎందుకు. మనసులో మాయలేని మనిషిలేడు. ఉన్న కాస్త జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసుకుని, ఆస్తులనీ, అంతస్తులనీ, బంగారాలని, పరువని, నరకానికి ద్వారాలు తెరిచేది మనమే..

ఆ మండువాకి సత్యవతే అందం. ఆమె లేని ఇల్లు పాడు బడింది. చెప్పుకొచ్చిన కథలో.. తొలి పేరాల్లోనే బీటలువారిన నేల, పగుళ్లు తేలిన వసారా, మండువా, గోడలు, ఎటు చూసినా ఈన్యం. ఎటు చూడు నిర్మానుష్యంతో, నిర్లక్ష్యంతో  ఉన్న ఆ చావిట్లో ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆఖరి ఘడియల్లో ఉన్నాడు సుబ్బారాయుడు. అతని కోసం పట్నవాసం పోయిన తమ్ముళ్ళు, మరదళ్లు చూట్టాలు వస్తున్నారు. కడ చూపు చూసేందుకు. ఎవరు వచ్చినా ప్రాణం పోయేదే.. 

వెనుకటి కథనంతా నెమరేసుకుంటుంది అక్కమ్మ. ఆ ఇంటి సౌభాగ్యం, వెలుగు సత్యవతే. చిట్టి చిలకతో ఆటలాడుతూ ఇల్లంతా కలియతిరిగడం నుంచి అమాయకంగా చెంగయ్యరాయుడి మీద చూపించిన ప్రేమ వరకూ ఉత్త పిచ్చి పిల్ల సత్యవతి, ఆ ఇంటికి ఓ పెదపాలేరల్లే వచ్చాడు చెంగయ్యరాయుడు అక్కడి వాళ్ళు అలానే చూసారు అతన్ని, మరి అతగాడు ఆమె మీద వల్లమాలిన వాత్సల్యం చూపించాడు. పెద్దలకిదేం పట్టలేదు.ఈర్ష్య పడ్డారు. కసురుకున్నారు, నలుగురూ గమనిస్తారేమోనని కంగారు పడ్డారు.  

ఎక్కడ పరువు పోతుందోనని మునసబుగారు మాట్లాడి పంపేసాడు. డబ్బు సంపాదించుకు వస్తానని చెప్పి దేశం పోయాడు చెంగలరాయుడు. డబ్బు తెచ్చేదాకా ఆగినవారేనా.. పిల్లకి పెళ్లి చేసి పంపేసారు. తొలిరాత్రి ముస్తాబు కాగానే అత్తారింటి నుంచి పారిపోయింది సత్యవతి. పోలాలకు అడ్డంపడి , వాగును దాటి ఇంటికి చేరుకుంది తెల్లారకట్ట. ఆమెని చూసి ఇంట్లో అంతా నోళ్ళు నొక్కుకున్నారు. వదినలు శాపాలు పెట్టారు. అన్నలు తలలు దించుకున్నారు. 

వాళ్లకు పరువు సంగతే కానీ, పిల్లదాని మనసు అక్కర్లేకపోయింది. అదే అర్థం అయితే కథేముంది ఇక. మళ్లీ పంపారు కాపురానికి, దయ్యం పట్టిందన్నారు. పూజలు చేయించారు. ఊరంతా చెప్పుకుంటుందని, ఆడి పోసుకుంటుందని తెగ ఇబ్బంది పడిపోయారు. ఎవరికీ ఆమె మనసు అక్కర్లేదు. ఎవరికీ ఆమె ఊసు లేదు. చిలకమాత్రం పంజరం నుంచి పాట పాడేది. తన ఇంటికి రాకపోతే ఎటు పోతుంది సత్యవతి. 

మళ్ళీ వచ్చింది పుట్టింటికి, మళ్లీ మళ్లీ వస్తూనే ఉంది. అన్నలకు పరువు మీద బెంగేసింది. ఓనాడు నరికేస్తానన్నాడు పెద్దన్నగారు అత్తిల్లు దాటి వస్తే.. కూడా తీసుకెళ్ళి దింపి వచ్చాడు. అదే ఆఖరు ఇక సత్యవతి మళ్ళీ రాలేదు. అత్తవాళ్ళు తమ దగ్గరకు రాలేదన్నారు. మునసబుగారు మంచం పట్టాడు. బెంగ పడ్డాడు. ప్రాణం విడిచాడు. సుబ్బారాయుడి తీరులో కూడా మార్పు వచ్చింది. నెమ్మదిగా దివాణం అంతా కరిగిపోసాగింది. కోడెద్దులు, పాడి, పంట, సంపదా అంతా తరిగిపోయాయి. ఈన్యం అంతా ఆవరించింది. అప్పులు మిగిలాయి. ఒక్కొక్కరుగా ఇల్లు వదిలి సంసారాలను పట్నం తీసుకుపోయారు. ఎవరికీ ఆ ఇల్లు అచ్చిరాలేదు. సుబ్బారాయుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఆ మొండి గోడల మధ్య మొండిగా కాలం వెళ్ళదీసాడు. 

ఇప్పుడు ఆఖరి రోజులు అంతా చుట్టూ ఉన్నా సత్యవతి గురించి ఎదురుచూస్తున్నాడు. అన్నట్టు సత్యవతి ఎటుపోయింది. ఎక్కడకు పోయింది. అదీ అతను మాత్రమే చెప్పాలి. అతనే చెప్పాడు చివరిగా తను రాదని, వాగులో కొట్టుకుపోయిందని, నా చేతులతోనే వాగులోకి వదిలేసానని. ఆ మనో వ్యాధితోనే ప్రాణాలు వదిలాడు. 

ఇంతకీ సత్యవతికి ఏమైంది. పరువుకోసం ప్రాణాలు వదిలేసిందా.. తను చనిపోతానని ముందే తెలుసా.. అసలు ఊహకైనా ఆ ఆలోచన ఉందా ఆమెకు. పదే పదే పుట్టినింటికి ఎందుకు వచ్చింది. ఎటుపోతుంది పాపం ఆమెకు ఏం తెలుసును. ఆ ఇల్లుకాకపోతే మరేం ఎరుగుదును. 

అదే ఇప్పటి సత్యవతి అయితే ఏం చేసేది? 
పెళ్ళి ఇష్టంలేదని తెగేసి చెప్పేదా.. ప్రేమించిన వాడితో వెళ్ళిపోయేదా.. లేక పెళ్ళి చేసుకుని వెళ్ళినా భర్తను మట్టుబెట్టి, ప్రియుని చేరుకునేదా.. లేక పతివ్రతగా మిగిలిపోవాలని అత్తింటి పరువు నింపే మహా ఇల్లాలుగా మారిపోయేదా.. ఏమో.. ఏమైనా కానీ..

(కళ్యాణీ సుందరీ జగన్నాథ్ .. చక్కని రాత, శైలని చెప్పడం తేలికే.. కథరాయగలిగితే రాత అదే వస్తుంది. కానీ ఎక్కడ పట్టుకుందో ఈ కథని, ఎక్కడ చిక్కిందో ఆమెకు సత్యవతి, ఎక్కడ చూసిందో, విన్నదో ఈగాథ, ఎలా ఎలా ఆమె మనసులో పురుడు పోసుకుందో కదా.. ఎంత అన్యాయం అయిపోయింది సత్యవతి అని మనసు మెలితిప్పుతుంది. అదే నేనైతే...... ఏమో)

Thursday, 16 May 2024

ఆ రోజులకో వాసనుంది

ఆ రోజులకో వాసనుంది..
17-5-2024 శ్రీశాంతి మెహెర్
.................................

ఆ రోజులకో వాసనుంది.
అమ్మలాంటి కమ్మనైన వాసన 
నేతి ముద్దలు తిన్న కమ్మదనం అది

వెన్నెలంత చల్లదనం
స్వేచ్ఛ తప్ప మరో మాట తెలీని రోజులవి
కాళ్ళకు పరుగు తప్ప, అలసట తెలీదు..
బద్దకంగా పక్క దులిపిన రోజులు

మిక్చర్ పొట్లం తెచ్చిన గొడవలో
గోళ్ల రక్కులు, పంటి గాట్లు
తమ్ముడితో కుస్తీపట్లు

అమ్మతనం చేతకాని రోజుల్లో 
పెద్దరికాన్ని భుజాన వేసుకుని 
అరిందాతనం

ఆ రోజులకో వాసనుంది..
కమ్మదనం తప్ప మరో మాట
తెలీని రోజులవి. 

తిరిగిరావు.. తెంపి తెచ్చుకోలేము
మనకు పుట్టిన బిడ్డల్లో బాల్యాన్ని 
కాసేపు చూసి మురిసిపోగలం 
మహా అయితే..

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...