నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయని
కాసేపు కూర్చుంటే నీ ఆలోచన అల్లింది
నలుపు చారల చీరలో ఆమె ఎదురైంది
అలసిన ముఖం, చెమటకు కరిగిన కుంకుమ
అచ్చం నువ్వు చెప్పిన పాత్రలానే ఉంది ఆమె
కుచ్చిళ్ళను ఓ చేత్తో పట్టుకుని, కాలి పట్టీలు
మోగిస్తూ నాలుగు అంగల్లో నన్ను దాటుకు
వెళ్లింది.
నలుపుదనం, పసుపు పాదాలు, నుదుట కుంకుమ
మైదానంలో కలిసుంటానా ఆమెను
లేక అనసూయనా, సులోచనేమో
గుర్తురావడం లేదు.
నీలా అల్లిక నాకు కుదరదు కానీ
నీ చూపు ఆమెను తాకి అక్షరమైంది కాబోలు
నేను అచ్చంగా పట్టుకోలేకపోయాను. నీ కథానాయిక
పోలికలు నాకు పాత్రపరంగానే తెలుసు. మరి నువ్వో కళ్ళతోనే స్కేన్ చేసి రాసి ఉంటావు.
ఏం మాయ చేస్తావో.. ఆ పాత్రలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో తెలీదు. నిజంగా ఉన్నారా ఇక్కడ? లేక దేవలోకంలోంచి పట్టుకొచ్చావా? నీకథల్లో పాత్రలయ్యేందుకు, నీ కథలో కథానాయిక కావాలంటే ఏం అర్హతలుండాలో చెప్పు, ఈసారి సరిగ్గా పట్టుకుంటాను. వెతుకుతాను. ఏ దేవాలయానికో వస్తుందేమో.. సరేనా.
No comments:
Post a Comment