నిలువుటద్దం చెప్పే నిజాలు




ఒక్కోసారి ఈ అద్దం నాతో 

ఊసులాడుతుంది

నన్ను చంద్రవంకను చేస్తుంది

తారలు నాముందు 

చిన్నబోతాయంటుంది

మనసు దిగులుకు 

మత్తుపూసి చిరునవ్వును

కట్టబెడుతుంది

మకిలిపట్టిన ఆలోచనలన్నీ 

కడిగి కన్నీటిని బయటేస్తుంది

గాజురాళ్ళ దుద్దుల్ని 

రత్నాలకు మల్లే మెరిపించి 

మాయ పులుముతుంది.

అందాన్ని తన వెంటేసుకుని తిరుగుతుంది..

నీ అంతవారు మరి లేరంటుంది.

నన్ను యువరాణిని చేసి 

నా సమయమంతా కాజేస్తుంది.

పగిలిన అద్దంలో బ్రతుకు భద్రం 

చేసుకోమంటుంది.

పదునైన వలపుల్లో పడి 

తనలా పగిలిపోవద్దంటుంది.

ఏంటో ఈ నిలువుటద్దం 

నాకన్నీ నిజాలే చెపుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"