జీవితకాలపు కలబోతల
వెనుక బుగ్గనంటిన
తీపికారాల చేదువగరుల
ముద్దులన్నీ తలపుకొచ్చాయి
చైత్రమాసపు పూల గుభాళింపు
నీ మమతనంతా వొలకబోసింది
మామిడి తోరణాలు ఊగుతూ
నీకోసం చూస్తున్నాయి
వేప పువ్వు నీ కోపాల
తాపాలను తడిమి పోయింది
చెరకు రసం నీ తీపి కబుర్లను
ఎత్తు కొచ్చింది.
మామిడికాయ పులుపు నీ
అలకనే గుర్తు చేసింది.
ఎంత గట్టి వాడవో బెల్లమల్లె
కరిగిపోతావు.
మాయ పన్నిన మనసు నీ
తలపున తడిచి
ఆరు రుచులను మించిన
రుచిని వెతుకుతుంది.
వాకిట ముగ్గులు తెచ్చే కళ నీ
ముందు చిన్నబోయింది
పండగంతా నీ నవ్వులోనే ఉంది
ఎన్ని మార్లు ఇది ఉగాదనీ
హృదయాల కలబోతల
కాలమనీ చెప్పాలీ..
🌺 ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🌺
No comments:
Post a Comment