పోస్ట్‌లు

జనవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆవిరి సెగ

గాయం తగిలిన గుండెకు  మాటలేం వస్తాయి మునుపు నీతో ఉంది  ఇప్పుడు ఒంటరిది వేగంగా వీచే గాలికి  కాస్త ఊగుతుంది మళ్ళీ సర్దుకుంటుంది వెలివేసిన గుండె అది వేదన బాగా తెలుసు ఊరూరా ఆలోచనలతో  తిరిగి అలసి ఇంటికి చేరుతుంది ఎన్ని కబుర్లు మోసుకొస్తుందో అందులో నువ్వూ ఉన్నావు  తనని ఏడిపిస్తూ ఏ వేళకు నువ్వు ఏం చేస్తావో ఎరుగుదును, ఆలోచిస్తుంది  నువ్వు తిన్నావా అని మోహార్తి తాపాల చెర నుంచీ  విడిపించుకోవాలని  గింజుకుంటుంది నీ నవ్వును ఉదయానికీ  సాయంత్రానికి ముడివేసి  ఆడుకుంటుంది. అప్పుడప్పుడు కలలో  భవిష్యత్తు భయపెడుతుంది శూన్యంలోకి లాక్కుపోతుంది ఎంతటి ఆర్తో నువ్వంటేనూ.. గతాన్ని తలుస్తూ  వాస్తవానికి భ్రమలను జోడించి వెలుగునీడల సంగమంలో  ఆవిరైపోతుంది.

వదలని నీడలు

చిత్రం
గాలికి తలలూపే పచ్చని  చెట్ల నీడలు మౌనాన్ని వీడని  నిటారైన స్తంభాలు జలపాతమంత దుఃఖాన్ని  మింగిన మనుషులు నూనె దీపాల వెలుగులో  ప్రకాశించే నీడలు పరవశం ఎరుగని  మనసుల నీడలు అలజడే ఆనవాలుగా  సాగిపోతున్న గుండెలు నిదురను ఎరుగని  బ్రతుకులు సేదతీరేందుకు ఎదురు చూపులు నీడలు ఎన్ని నీడలో  దారులంట  ఆర్తిగా ఆనందాన్ని వెతుకుతూ పోతున్న నీడలు

ఒక చిరునవ్వును వెతుకుతూ

చిత్రం
ఎందుకు మీరంతా  నన్ను చూసి కన్నీళ్ళను  ఆరబోసుకుంటున్నారు నేను దుఃఖాన్ని  మోయడం లేదు ఆనందపు జాడలను  వెతుకుతున్నాను వర్షించే మేఘాన్ని  కలగంటున్నాను పసికందుల నవ్వులను  తెంపుకుంటున్నాను పూల మకరందాన్ని  దోసిళ్ళతో ఎత్తుకుంటున్నాను ఆకాశం పరిచిన మేఘల నీడలంట ప్రయాణిస్తున్నాను గమనమెరిన దిశ నాది అలుపెరుగని పయనం దుఃఖమే లేని లోకాలను  పట్టుకుందుకు చిరునవ్వుల చిరునామా  తెలుసుకుందుకు