మూలింటామె నవల చదువుతున్నంత సేపు ఏదో ఆశక్తి చివరకు ఆమె వస్తుందా తన సంసారాన్ని, భర్తను కాదనుకున్నా, బిడ్డలను కూడా వదిలేస్తుందా? ఇలానే ఏన్నో అనుమానాలు. జీవితంలోంచే కథలు పుడతాయంటారు. హాస్యంగా చెప్పినా, ఆలోచింపచేసినా అది నామిని గారికే చెల్లింది. మూలింటామె నవల ఓ కథకన్నా మించి పాఠకుడిని ఆలోచింప జేసే నవల. మూలింటామె నమినిగారి రచనల్లో ఓ కొత్త కోణాన్ని చూపించింది.
ఓ చిన్న ఊరు. అందులో తల్లీకూతుళ్ళు, మనవరాలు. ముగ్గురి ఆడవాళ్ళకు ఓక్కో కథ. అందరికంటే అమాయకంగా కనిపించే కొనమ్మ
ఊరికి దూరంగా ఉన్నారని కుంచమమ్మ కాస్తా తన ఈడు వాళ్లకు కూడా మూలింటామె అయిపోయింది. కూతురికి తనలాంటి రాత కలిగిందని ఆమెను, బిడ్డనూ ఆదరించి పెంచి పెద్ద చేసి తన కొడికిచ్చి పెళ్ళి చేసింది. ఉన్నట్టుండి మనవరాలు సంసారాన్ని, భర్తను, బిడ్డలను విడిచి వెళ్ళిందనే విషయాన్ని నమ్మలేకపోయింది. అమాయకమైన మనవరాలి ముఖం గుర్తుచేసుకుంది. అమాయకురాలు, జాలి గుండెది, అందరినీ అదరించే ఆమె, ఆ ఇంటి దీపం లేకపోతే ఆ ఇల్లు, పిల్లలు, చెట్లు, చేలు, పశువులు అన్నీ అనాధలైపోతాయి. ఏం చెప్పాలి నువ్వు లేనిదే ఓరోజు గడవదమ్మా అన్నా వినలేని అంత దూరం నువ్వెళ్ళి పోయావు. మరి తిరిగిరావు.
కూతురు తమ పరువుతీసిందంటూ ఊరితో నోరుకలిపింది నడిపామె. తన కుటుంబం ఊళ్ళో తలేత్తుకు జీవించాలని తమ్ముడికి మరో పెళ్ళి చేసింది. రెండో పెళ్ళాంగా వచ్చిన వసంత తన మాటతీరుతో చుట్టు పక్కల వారితో మంచిగా ఉంటూ పరాయి మగవాళ్ళతో బరితెగించి ప్రవర్తించినా కళ్ళున్న గుడ్డి లోకం మాట కూడా మాట్లాడదు. ఇవన్నీ చూస్తూ మాటైనా మాట్లాడక సమర్థించిన కొడుకు పౌరుషంలేని తనం చాలా చిత్రంగా అనిపిస్తుంది మూలింటామెకు.
ఇద్దరు బిడ్డలను, భర్తను విడిచి వెళిపోయిన తన మనవరాలి గురించి మనసులోనే మథన పడింది. తన మనవరాలి మంచితనం పరులనోటితో విన్నపుడు మూలింటామె మనసు ప్రేమగా మూలిగింది. ఎంత సుకుమారంగా చూసుకున్నామమ్మా, ఇలాంటి ఆలోచనచేసి ఎందుకు నాకు దూరమయ్యావంటూ రోధించింది మూలింటామె. తన ఇంటికి రెండో కోడలిగా మనవరాలి స్థానంలోకొచ్చిన వసంత మాలింటామెకు మనవరాలిపై ఉన్న మమకారాన్నీ, ప్రేమను, ఆస్థానాన్ని అందుకోలేకపోతుంది. అందరికీ తెలిసేలా తప్పుచేసి మంచిదైన నామనవరాలు ఈ ఊరోళ్ళకు చెడ్డదైపోయింది. నంగనాచిలా వసంత ఊరోళ్ళోతో చొరవగా మసులుకోవడం, పరాయి మగాళ్ళతో రాసుకుపూసుకు తిరిగినా అందరికీ మంచిదైపోయింది. ఒక కుటుంబానికి కష్టమొస్తే ఓదార్చే వారికన్నా, ఆనందించేవారే ఎక్కువ. ఎదుటివాళ్ళను తూట్లు పొడవాలని చూసే రాబందులే ఉన్నారు మన చుట్టూ. మనకో కన్ను పోయినా పరవాలేదు, ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలనేవారికి ఉదాహరణలు రంజకం, మొలకమ్మ, రంగబిళ్ళ పాత్రలు. వయోభేధం చూడకుండా తండ్రిలా లాలించి, ఎత్తుకు పెంచిన మేనమామే ఆమెకు భర్తయ్యాడు. తన మనవరాలు తనింటి కోడలు కావాలనుకుందే కానీ దాని జీవితం వయసు ముదిరిన కొడుకుతో చివరిదాకా ఎలా ఉంటుందో ఆలోచించలేదు మూలింటామె. సమస్యను సృష్టించుకునేది, దాని ఫలితం చూసి విచారించేది మనమే. కొనామె అమాయకపు మనసుకు, ప్రేమ ఎరుగని మనసుకు, ఎవరు జాలి చూపినా, కాస్త ప్రేమగా మాట్లాడినా ఆమె జన్మ ధన్యమే. కళాయోడి అమాయకపు మాటలు ఆమె మనసులో అంతగా ముద్ర వేశాయి. ఆవేశంలో తప్పుచేసానని అనుకుని మళ్లీ ఇంటికి రావాలనుకోలేదు కొనామె. ఒకసారి ఆ గడప దాటాకా ప్రాణం పోయినా తిరిగి ఆ గడప తొక్కకూడదనుకుంది. తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండిపోయింది. కొనామె వెళ్ళాలనుకున్నా ఆ ఇంట ఏం మిగిలింది కనుక. పాడి పోయింది. పచ్చని చెట్లు మోడులైనాయి. తనకు ఇక ఆ కుటుంబంతో రుణం తీరిపోయిందనుకుంది. గడప దాటిన ఆడది ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకుంది. దానికి కారణాలు ఏమిటి అని విశ్లేషించనవసరం లేకుండా సూటిగా ఆమె కుటుంబ పరిస్థితులు చెప్పుకు రావడం అనవసరం అని రచయిత ఆ ఆలోచనను పాఠకుని మనస్సుకే వదిలేసాడు.
కాలం మారుతున్నా మరెంత మారినా, మనిషి ఆలోచనలో మార్పురానంత వరకు స్త్రీ జీవితంలో పెద్దగా మార్పురాదు. భర్తతో ఏం పొరపచ్చాలో తెలపడం అవసరం కాదు ఇక్కడ మూల విషయం. ఓ స్త్రీ ఇల్లు విడిచి వెళ్ళిందంటే తన కుటుంబం, జాలి తలచి వెనక్కు తీసుకు వెళ్ళాలన్నా సాహసం చేసినా కూడా హర్షించదు కదా దుమ్మెత్తి పోస్తుంది ఈ లోకం. అదే ఓ మగాడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు కూడా అది ఆడదాని లోపం కిందకే జమ కడుతుంది. ఎందుకు ఈ వ్యత్యాసం.
మనవరాలినిపైనే ప్రాణాలు పెట్టుకున్న మూలింటామె ప్రాణాలు విడిచే క్షణంలో చివరి మాటలు కూడా మనవరాలి మీద తన ప్రేమను మరోసారి తెలిపాయి."నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేకాని, మియాం మియాం అంటా నీ కాళ్ల కాడా నాకాళ్ల కాడా చుట్టకలాడే పిల్లిని చంపలేదే" పిల్లిని చంపితే దానంత ఎత్తు(బరువు) బంగారం దానం ఇవ్వాలనే నమ్మకం ఉంది. అంటే పిల్లిని చంపినా పాపమేమో గాని నా మనవరాలు చేసిన ఆలోచన, తీసుకున్న నిర్ణయం తప్పుకాదని మరోసారి చేప్పిందన్నమాట.
No comments:
Post a Comment