పి. సత్యవతి గారి అనువాదంలో ఇస్మత్ చుగ్తాయ్ కథలు చదివాకా నా అభిప్రాయాన్ని కినిగె పత్రికలో క్లుప్తంగా చెప్పాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి. మీరూ చుగ్తాయ్ కథలు చదవండి. లింక్ ఇదిగో:--
ఒక రచయిత గురించి చెప్పాలంటే రచయిత వ్యక్తిగా ఎవరో తెలిస్తే కాస్త బాగా చెప్పగలుగుతాం. కానీ ఏమీ తెలియకపోయినా చుగ్తాయ్ కథలే
ఆమె గురించి చాలా చెపుతాయి. ఆమె కథావస్తువులు, ఆలోచనలు అన్నీ ఆమె జీవితంలో
నుండి పుట్టినవే. ఏ చిన్న విషయాన్నయినా ఆమె కథగా రాయగలరని ఈ పుస్తకం
నిరూపిస్తుంది. బేగమ్ జాన్, కుబ్రాతల్లి, కుబ్రా, ఆమె చెల్లీ, రుక్సానా,
హలీమా, గోరీబీ, సరలాబెన్, బిచ్చూ అత్తయ్య, వదినె, షబ్నమ్, ఇల్లూడ్చే
ముసలమ్మ, ఫర్హత్… ఇలా పాత్రలన్నీ ఆమె పెరిగిన, ఎరిగిన వాతారరణంలో నుండి
వచ్చినవే. చెప్పాలనుకున్నది సూటిగా, నిక్కచ్చిగా చెప్పడం చుగ్తాయ్ కథల
ప్రత్యేకత. ఆమె ఈ కథలు రాసింది ఉర్దూలోనే అయినా తెలుగులోకి భావం ఏ మాత్రం
చెడకుండా వచ్చింది. దీనికి అనువాదకురాలు పి. సత్యవతిగారిని
అభినందించాలి. అన్నీ స్త్రీ చుట్టూ తిరిగే కథలే ఐనా ఏ కథా మరో కథలా
ఉన్నట్టు అనిపించదు. ఆడపిల్లలపై ఆంక్షలు, సాంప్రదాయికమైన కట్టుబాట్లూ
వీటన్నింటికీ చుగ్తాయ్ బద్ధవ్యతిరేకి అని ఆమె కథలు చెప్తాయి.
సంప్రదాయ ముస్లిమ్ కుటుంబంలో అన్నల తర్వాత
ఆడపిల్లగా పుట్టి, అన్నలానే ఆటపాటలలోనూ, చదువులోనూ పోటీ పడుతూ పెరిగింది
చుగ్తాయ్. బాల్యంలో లేని ఆంక్షలు ఎదుగుతున్న కొద్దీ ఎదురవటంతో ఆమె
ఎదురుతిరిగింది. ఆడపిల్లకు ఉత్తరం రాసే చదువు చాలునంటూ, ఇక చదవటం ఆపి వంటా
కుట్లూఅల్లికలూ నేర్చుకోమంటే, కిస్టియన్ మతంలో కలిసిపోయి కాన్వెంట్లో
చదువుకుంటాను గానీ ఇంట్లో కూర్చోనంటూ మొండికేసి ధైర్యంగా తన నిర్ణయాన్ని
తెలిపింది. ఆడవారి జీవితాల గురించి చిన్నతనం నుండే నిశితమైన పరిశీలన
కనిపిస్తుంది ఆమెలో. ఎదుటివారిని కూర్చోబెట్టి మాటలాడి వారి రహస్యాలు
చాకచక్యంగా తెలుసుకోగల నేర్పరి. తన తోటి స్త్రీ జీవితాలనూ ఆమె అంత
చాకచక్యంగానే తెలుసుకొని తన కథల్లో ఇమిడ్చింది. కొన్ని కథల ఇతివృత్తాలు ఇలా
సాగుతాయి:
లిహాఫ్:—
భర్తతో వివాహబంధం సరిగాలేని స్త్రీ, అతని ప్రేమను, అనురాగాన్నీ పొందలేని
స్త్రీ లైంగికంగా దిగజారిపోయిన కథ ఇది. దీన్ని తన చిన్ననాటి జ్ఞాపకంగా
చెప్పుకొచ్చింది చుగ్తాయ్. ఇలాంటి కథలను రాసి, సమాజంలోనికి తీసుకురావడానికి
ఎంతటి గుండె ధైర్యం, సాహసం కావాలి. ఈ కథతో ఏంతటి దుమారం లేచినా చలించలేదు
ఆమె. దాన్నంతట్నీ ధైర్యంగా ఎదుర్కొన్నది.
మేలిముసుగు:— ఈ
కథ చెపుతున్న గోరీబీ పురుష స్పర్శ ఎరుగని ఎనభై ఏళ్ళ కన్య. కోటి ఆశలతో
కొత్తగా సంసార జీవితంలోకి అడుగుపెట్టిన గోరీబీ, భర్తకు ఎదురైన ఓ చిన్న
ఆత్మనూన్యతా భావం, అర్థం చేసుకోకలేనితనం వల్ల ఓ నిండుజీవితం శిక్ష
అనుభవిస్తుంది.
శిల:—
భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వహించడంలో మునిగిపోయిన
చుగ్తాయ్ వదిన కథ ఇది. బంధాలకు విలువ ఇచ్చింది కానీ, కరిగిపోతున్న అందాల
గురించి పట్టించుకోలేదామె.
ఒక ముద్ద:— నర్సు
సరళాబెన్‌కు పెళ్ళి చేసుకోవాలని మనసులో ఎంత ఉన్నా సరైన వయసులో ఆ ముచ్చట
జరగలేదు. అందరికీ తలలో నాలుకలా ఉన్న ఆమె ఓ ఇంటిది ఐతే బాగుంటుంది
అనుకున్నారు ఇరుగుపొరుగు వాళ్ళు. బస్సులో ఒక వ్యక్తి సరళాబెన్‌కు రోజూ లేచి
సీటు ఇవ్వటం చూస్తాడు ఆమె పొరుగింటతను. అంతా సరళాబెన్‌కు ఆ వ్యక్తికీ
ముడిపెడదామని ప్రయత్నిస్తారు. ఆమెని అలంకరించి పంపిస్తారు. కానీ విధి ఆమెను
వెక్కిరిస్తుంది.
బిచ్చు అత్తయ్య:— అన్నగారి మీద ప్రేమను తిట్లతోనే చూపిస్తుంది బిచ్చు అత్తయ్య. మాట కరుకేగానీ మనసు వెన్న. అన్నగారంటే పంచప్రాణాలు.
అమృతలత:— దేవుడిచ్చిన
అందం ఆమెకు శాపమే అయింది. వయసులో తనకంటే పెద్దవాడైన భర్తను అమితంగా
ప్రేమించింది. తరుగుతున్న వయసు అతనిలో అసూయను నాటింది.
ఇలా సాగుతాయి చుగ్తాయ్ కథలు. తన
చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలను చుగ్తాయ్ జీవితాంతం గుర్తుంచుకున్నది. “ఇది
పురుషుల కోసం పురుషులు తయారు చేసిన ప్రపంచం. ఈ ప్రపంచంలో స్త్రీ ఒక పాత్ర
మాత్రమే. పురుషుని ప్రేమకో, ద్వేషానికో ఒక అభివ్యక్తి లాంటిది స్త్రీ. అతని
చిత్తవృత్తులను బట్టి ఆమెను ప్రేమించడమో, తిరస్కరించడమో జరుగుతుంది.” ఈ
మాటల్లోని సారం ఆమె ప్రపంచాన్ని చూసే విధాన్ని చాలా ప్రభావితం చేసిందని
అనిపిస్తుంది. ఆమె కథలన్నీ ఈ సారాన్నే పదునుగా వ్యక్తం చేస్తాయి. ఒకరకంగా
ఇస్మత్ మన చలానికి ఆడవెర్షను అనిపిస్తుంది.
– శ్రీశాంతి దుగ్గిరాల
No comments:
Post a Comment