Wednesday, 15 January 2025

కలలు..




ఎందుకు వస్తాయి కలలు
ఆలోచనను పిండి కవితగా అల్లేందుకే
గమ్యమంటూ లేని కలలు
ఏ అతిథికీ అతిథ్యం ఇవ్వక
రంగు రంగుల భావాలతో 
గుసగుసలాడతాయి.

జ్ఞాపకం కన్నీరు పెట్టిస్తుంటే కలలు జోలపాడతాయి.
జనం మసలని దారుల్లో ప్రయాణించి
అమృతం కురిసే రాత్రుల్ని అన్వేషిస్తాయి.
గన్నేరుపూల సుగంధాలను తాకి, గత అనుభవాలను అల్లే అలలు

పూలవాడల్లో పుప్పొడిని రాలుస్తూ, 
మబ్బుల వాడల్లో విహరించే కలలు
చేదును చెరిపేసి, తీపిని నింపేందుకు
కసరత్తులు చేస్తాయీ కలలు

దుఃఖానికి రంగుపూతను పూసి 
ఊహల్లో విహరింపజేస్తాయి.
అప్పుడే పిలవకు
కాసేపు ఇదే కలలో ఉండనీ.. 
ఎంత హాయిగా ఉందనీ..

Thursday, 2 January 2025

నాలాగే బంధీలు.. 3-1-2025


.................. 

ఈ మేడ మీంచి దారిన 
పోయే వందల కళ్ళను చూస్తుంటాను.
కంగారుగా కొన్ని, ఆసక్తిగా మరికొన్ని నన్నే గమనిస్తాయి. 
తీగ మీద ఉడతకి, చెట్టు మీద 
పావురాళ్ళకూ నేను పరిచయమే. 

నా జతగాడు ఎగిరిపోయాకా.. 
దిగులు వేళ ఈ గమనింపులే కాలక్షేపం.. 
నన్ను చూస్తూ దారంటాపోయే
మనుషులంతా తెలుసు నాకు
ఆ గమ్యాలన్నీ తెలుసు. 

దుఃఖాన్ని మోస్తూ కొందరు, ఆనందంతో కొందరు, ముఖాలు వెలిగించి, వాడిపోయి
పోతుంటారు. 

ఈ పంజరంలో చిలకనని 
చులకన చేస్తారు కానీ.. 
స్వేచ్ఛ ఉండీ, ఈ ప్రపంచాన 
బంధీలు వీళ్ళు

ఆ కనిపించే మేఘం వెనక ఏముందో తెలుసుకోవాలని ఉంది. 
వాళ్ళ మనసుల్లానే అదీ అంతుచిక్కదు. 
ఎక్కడ నుంచి ఇటు వచ్చానో, ఇటు నుంచి ఎటు ప్రయాణమో తెలీదు. 
వీళ్ళూ అంతే..

Wednesday, 1 January 2025

ఇదంతా కాలానికి మామూలే..

ఇవాళేం కొత్తగా లేదు..
 గుమ్మంలో ముగ్గులు చెరిగిపోయి
రాత్రికి జనం పలచబడిఎప్పట్లాగే నిద్రపోతుంది వీధి. 

కాలం మారడం నీకు కొత్తేమో కానీ 
కాలానికి ఇదంతా మామూలే 
విడ్డూరంగా జరుపునే సందడంతా 
తనకు తెలిసిందే. 

రోజు మరో రోజులోకి, మరో కాలంలోకి పోతూ, 
దాని వెంట నిన్ను తీసుకు పోతుంది. కొమ్మను పండి, 
రాలిన ఆకుల మల్లే కాల చక్రంలో పడి, రాలిపోతాం అంతే

అంతకు మించి ఏం కాదు. 
ఇదంతా కాలానికి మామూలే.. తెలిసిందే..

కలలు..

ఎందుకు వస్తాయి కలలు ఆలోచనను పిండి కవితగా అల్లేందుకే గమ్యమంటూ లేని కలలు ఏ అతిథికీ అతిథ్యం ఇవ్వక రంగు రంగుల భావాలతో  గుసగుసలాడతాయి. జ్ఞాపకం కన...