కాలం ముల్లు తిరిగే సమయంలో ఏ ధూళికణంగా ఈ భూమి మీదకు వచ్చిపడ్డానో తెలీదు. నక్షత్రాలు, జాతకాలతో సంబంధం లేకుండా పుట్టుక జరిగిపోయింది. దిక్కులు చూస్తూ తండ్రి దగ్గరకు తీసుకుంటే, ఆడపిల్లేనని మూతి బిగువుల మధ్య గుండెల మీద కుంపటిలా ఎదిగి, ఎవరికీ కాని ఓ అర్భకమైన జీవితాన్ని జీవిస్తున్న నాకు అక్షరం అమృతమని తెలిసింది మీ వల్లనే. గుక్కపెట్టి ఏడ్చే పసి బిడ్డకు పాలిచ్చి లాలించినట్టు.. దిక్కుతోచని నా జీవితానికి మార్గదర్శకత్వం వహించిన ప్రాణధాతవు. మనుష్యలకు అర్థంకాని దైవత్వాన్ని మోస్తున్నవాడిగా, ఈ చరాచరసృష్టిలో రెండు ప్రాణాలు కలిపి నడిచే దారుల్ని బలవంతంగా తెంపుకు తెచ్చుకున్న ఆడమ్ ఈవ్ ల ప్రేమ ఎంత పవిత్రమైనదో అటువంటి ప్రేమను పొందగలిగిన మనం అంత అదృష్టవంతులం.
సృష్టి రహస్యం ఏదైనా కానీ.. మన ఇద్దరి కలయిక మరో చరిత్ర అయింది. గోదారికి ఎదురీది అనంత వాహినిలో పడి నీటి అలజడికి, సంఘపు కాఠిన్యానికి గురై మినుకు మినుకుమనే మన జీవితాలను మళ్ళీ వెలిగించుకున్నాం. నిరాశ తప్ప ఆశలేని జీవితంలోకి వసంతం కన్నా మించిన వెలుగును తెచ్చావు. నువ్వు అక్షరదానం చేసాకా.. నేనో కలంగా మారాను. నీ తలపులో పుట్టుకొచ్చిన వేల అక్షరాలను కాగితం మీద ఒలకబోస్తూ.. ఇదిగో నా ప్రయాణం ఇంతవరకూ వచ్చింది. అమ్మ కొట్టిన బిడ్డ ఉగ్గబెట్టిన దుఃఖాన్ని పెల్లుభిగించినట్టు.. నా అక్షర ప్రయాణానికి ఆదివి నీవే.. నమస్సులు చాలా చిన్నవైపోతాయేమో.. మరో జన్మ ఉంటే మళ్ళీ నీ అడుగులో అడుగునయ్యే వరం మాత్రం ఇవ్వు. లవ్వూ
ఫణి..
No comments:
Post a Comment