ఏ ఇంటి వాకిలి మీదుగా ఎగిరివచ్చిందో ఈ సితాకోక చిలుక.. పంచెవన్నెలను పులుముకుంది
ముక్కున మకరందాన్ని పట్టించి.. తన రెక్కలాడిస్తూ నా ముందు నుంచీ మా చావిట్లోకి..
అటుపైన నూతి వారకు పోయి.. అలిసి ఆగిపోయింది.. మందారం చెట్టు కొమ్మల్లో...
ఆగి ఆగి రెక్కలాడిస్తుంది.. ఎన్ని వర్ణాలో.. ఎంతటి అందాన్ని తనలో నింపుకుందో.. పసి మొగ్గలాంటి వన్నె
పట్టుకోబోతే పట్టుతప్పి దాటిపోతుంది.. నూగందం.. మకరందం.. నా చూపులన్నీ దానిమీదే..
రాలిపడిన మందారాలు దానికి వద్దట.. చెట్టున వగలుపోతున్న మందారాల మీద మాత్రమే మోజు..
నిండైన సొగసుల ఈ సీతాకోక.. నన్ను ఆకర్షించింది.. పట్టుకుందామని పోతే పారిపోతుంది
నిస్సత్తువగా జరిగిపోతున్న రోజులో ఈ చిలక ఓ సంబరం నాకు.. గాల్లో గింగిర్లు కొడుతూ పువ్వుల్ని ముద్దాడుతూ..
సప్త రంగుల్లో మెరుస్తూ... ముట్టుకోవాలనే కోరిక పుట్టించి అందకుండా దాగుడు మూతలాడేవు ఓ అందగాడా..
రమ్మని నేను పిలవలేదు.. ఈ అనుకోని అతిథి నా భుజాల మీద వాలాలనుకోవడం తప్పయిందే..
హరివిల్లు రంగుల సీతాకోక చిలుకా. అందీ అందక నీ రంగులే పులిమిపోయేవు .. నా చూపు నిలిపేస్తూ..
ఎవరు రమ్మన్నారు.. నేనా? నాకు నీ జాడన్నా తెలియదే.. నీ ఊసన్నా ఎరుగనే.. మరీ ఊరిస్తున్నాయ్
ఎక్కడికి పోదామని ఆ తొందర.. ఇద్దరం ఈ తోటలో బందీలం.. నువ్వు నేను.. మనం ఇద్దరం మాత్రమే....
No comments:
Post a Comment