ఈ బ్లాగు లో రాయాలన్న ఆలోచన మనసుకి దగ్గరగా వచ్చింది చాలా
తక్కువసార్లు..ఏం రాయాలన్నా ఏదో ముహుర్తం పెట్టుకుని రాద్దామన్న తంతే గానీ..
రాసి తీరాలన్న ఆత్రం తక్కువే.. ఒక్కోసారి రాయాలనుకున్నదంతా కాగితం మీద పెట్టకమునుపే ఆలోచనల్లో కరిగి నీరైపోతుంది. మరోసారి రాసిన కాగితం మీది అక్షరాలు
చదువుకునే లోపు, తిరిగి నన్ను ఎక్కిరిస్తాయి. ఇదేనా రాసేది.. మనసెక్కడ పెట్టావ్ అంటూ....
ఈ గొడవ తేల్చుకునేలోపు మళ్ళీ ఏదో హైరానాలో పడి
నన్ను నేను పూర్తిగా మరిచిపోతాను. ఎక్కడా క్షణం తీరిక లేని వ్యవహారాలు
నడిపేస్తున్న ఫీలింగ్. అంతే ఇది ఉత్త ఫీలింగ్ మాత్రమే... ఏదో సామెత చెప్పినట్టు... దమ్మిడీ
ఆదాయం లేదు... పైసా ఉపయోగంలేదు. ఏదో సామెత సరిగా గుర్తు రావడం లేదు. దానికోసం
ఆలోచించేలోపు ఇదిగో ఏదో రాద్దామనుకున్న ఈ ఫీలింగ్ మళ్ళీ కరిగి గాల్లోనే
నీరైపోతుంది.
ఏదైనా రాయాలంటే పట్టుగా ఏదోటి చదవాలికదా... మరి
చదవడం లేదే... రోజూ.. కానీ రాస్తున్నాను. అవన్నీ ఉద్యోగానికి నేను చేసిపెట్టే
రాతలు. అవి నావి కావనిపిస్తాయి. ఏదో ఎత్తుకొచ్చిన ఫీలింగ్.. నేను రాసానని ఇది
నాదేనని గట్టిగా చెప్పి ఈ పవిత్రమైన బ్లాగులో వేసుకోలేను.
ఇక్కడి ప్రతి అక్షరం నా మట్టి బుర్రలో పుట్టి
పురుడు పోసుకున్నదే..అందుకే నాకు ఈ బ్లాగు అంతిష్టం. ఇక్కడ నాకు మాత్రమే చెందిన
ఆలోచనలు ఉంటాయి. సరే అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో నాకంటూ
కాస్త సమయం దొరికింది. రాసుకోగలను. ఇన్నాళ్ళుగా రాయలేని రాతలన్నీ ఇప్పుడు
రాసుకోవాలని చిన్న ఆశ. మీకు ఇక నుండీ టచ్ లో ఉంటాను లెండి.
మరి నా రాతలు చదువుతారు కదా.. ఈ బుద్ది బుధవారం
వరకూ ఉంటే చూద్దాంలే అనుకుంటే నేనేం చేయలేను. అంతే...
No comments:
Post a Comment