చలం ఈ పేరు వెనక ఓ అగాథం, ఓ అంతుచిక్కని రహస్యం కనిపిస్తాయి ఎప్పుడూ. నిజానికి ఆయన నాకు ఎప్పటికీ అర్థం అయ్యీ అవ్వనట్టు ఉండిపోతాడు కామోసు. ఆయన రచనలు ఏది చదివినా కొన్ని రోజులపాటు వెంటాడి వేధిస్తాయి. ఈమధ్య నేను చదివిన “సుశీల” కూడా అలానే అనిపించింది. ఓ వందేళ్ళ తర్వాత కూడా మనిషి ఆలోచనా తీరుకు సరిపడా చలమే ఆలోచించేసి తన వాదనలని లేదా సందేశాల్ని ఇలా కథల రూపంలో మన మీదకి వదిలేసాడా అనే అనుమానమూ కలుగుతుంది నాకు. ఆడదానికి స్వేచ్ఛ లేదు అని తన ప్రతి కథలోనూ చెప్పుకొచ్చే చలం ఈ కథలో పూర్తి స్వేచ్ఛ ఉండీ ఆకర్షణలో పడే స్త్రీని కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఈ కథకు సుశీల అని పేరు పెట్టినా నాకు ఆమె భర్త అయిన నారాయణప్పగారి గురించే కథ చెప్పాడు అనిపించింది. అతని చుట్టూ మాత్రమే సుశీల ఉంది అనిపించింది.
ప్రేమకి, ఆకర్షణకి, వాత్సల్యానికి, బాధ్యతకి తేడాను చూపుతూ సాగుతుంది కథ. అతడు ఓ సంఘసంస్కర్త, భార్యను అప్పటి సమాజ కట్టబాట్లకు తగ్గట్టు వంటగదిలో కూర్చోబెట్టలేదు. ఆమెకు ఆస్తి, హోదా, తన స్నేహితులతో కలిసి తన వాదనలు వినిపించే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమె చేస్తున్నది తప్పని తెలిసినా ఎక్కడా సుశీలను కట్టడి చెయ్యాలనే ఉద్దేశ్యం లేనివాడిగా కనపడతాడు. ఓ కోణంలోంచి ఆలోచిస్తే అసమర్థునిగా కూడా కనిపిస్తాడు.
ఇటు భర్తను మోసగించి మరో వ్యక్తితో ప్రేమలో పడటం అన్నది సులువుగా జరిగినా భర్తను వదిలివెళ్ళేందుకు ఆమె చెప్పే కారణాలు సుశీలకు తన భర్తమీద ఉన్న ప్రేమను, భార్యగా ఆమెకున్న బాధ్యతను చూపుతుంది. నేను ఆలోచించింది సుశీల వైపు నుండీ కాదు. అలా అని ఆమె చేసింది తప్పనీ అనను. ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న చిన్న గీతను మాత్రమే చూసాను. కథ అంతలోనూ నాకు నారాయణప్పగారి వ్యక్తిత్వం నచ్చింది. అదే నన్ను ఇంకా లోతుగా ఈ కథ గురించి ఆలోచించేలా చేసింది.
ఒక కోట్: “కొందరు స్త్రీలు వారినెవరికిచ్చి పెళ్ళి చేస్తే వారిని వెంటనే ప్రేమిస్తారు. ప్రేమించినట్టే వుంటారు. ప్రేమించామనే వారూ అనుకుంటారు. దాంట్లో యేమీ మోసం లేదు. చాలా నమ్మకస్తులు. కానీ యెప్పుడో వొకప్పుడు, యెవరో కొత్తవారి మీద నిలపరాని ప్రేమ కలుగుతుంది వారికి. వారి హృదయాలు యెవరికోసం చెయ్యబడ్డాయో అటువంటి వారిని కలుసుకుంటారు. అపుడు ఆ మహాగ్నిలో ఈ పూర్వపు ప్రేమా, నీతీ, విశ్వాసమూ అన్నీ దగ్ధమవుతాయి. యెవరూ ఆపలేరు. కొన్ని బయటకి వస్తాయి. కొన్ని ఒకరిద్దరికి తెలిసి ఆగుతాయి. కొన్ని బైటకి రానేరావు యీ విషయాలు.”
No comments:
Post a Comment