ఈమధ్య నేను చదివిన కథ..........



నవమాసాలూ బిడ్డను తన కడుపులో మోసిన తల్లి బరువు దిగిందని కాస్తన్నా విరామం తీసుకోలేని స్థితి, ఆ ఆడబిడ్డను తమలో మరో మనిషిని దాస్తున్న మృగాల నుండీ అనుక్షణం కాపాడుతూ మరో అయ్య చేతికి అప్పగించేంత వరకూ నిత్యం మోస్తూనే ఉంది. ఎటునుండీ ఏ మృగం తమ ముక్కుపచ్చలారని బిడ్డపై పడతాడోనన్న భయం. అంతటి భయానక వాతావరణంలోకి జారిపోతున్నాం మనం. ఆడబిడ్డకు స్వేచ్ఛ, రక్షణా రెండూ లేవు. అది ఐదేళ్ళ పసికందైనా, అరవైయ్యేళ్ళ అమ్మమ్మైనా. కాలం మారుతున్నకొద్దీ పక్కవాడిని నమ్మలేని తనం నిండా ఆవరించేస్తుంది.
కాశీభట్ల వేణుగోపాల్ గారు రచయితగా నాకు తెలీదు. ఆయన రచనలు చదివే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని నేను అర్థంచేసుకోగలనా అనే మీమాంసతో ఉన్న నాకు ఆయన రాసిన కథ ఒక్కటన్నా చదవాలని అనిపించి “బృందా” కథ మొదలు పెట్టాను. ఇప్పుడన్నా అంతటి సాహసం చేసినందుకు ఆనందిస్తున్నాను. ఈ కథలో ఎక్కడా రచయిత కనిపించడు, ఓ అమ్మ, ఆమె తన బిడ్డలను రక్షించుకోడానికి పడే తపనే కనిపిస్తుంది. రచయిత కథనంతా తనలోకి ఓ తల్లి హృదయాన్ని ఆవాహన చేసుకుని రాసాడా అనిపిస్తుంది. కథ శాంతం ఓ తల్లి మనసే కనిపిస్తుంది. రచయిత తన పదునైన మాటలతోనో, లేదా కథా వస్తువుతోనో సమాజాన్ని ఉద్ధరించే బాధ్యతను తన భుజాలకెత్తుకోలేదు. ఆ మాట ఆయన మొదటి పరిచయంలోనే చెప్పారు.
బృందా ఓ అమాయకపు ఆడపిల్ల, మానసికంగా సరిగా ఎదుగుదల లేని ఆమెను వికారపు చూపుల నుండీ కాపాడాలనే ఆమె ప్రయత్నం, ఓ తల్లిగా నన్ను కన్నీరు పెట్టించింది. ఈ కథను 2005 వ సంవత్సరంలో కాశీభట్లగారు రాసారు. అప్పటి ఆయన ఆలోచనల్లో నలిగి వచ్చిన ఈ కథకన్నా, ఇప్పటి 2017 మన ఆలోచనలకు అందనంత విధంగా ఆడవారి పట్ల నిముషానికో అత్యాచారంతో కృరంగా మారింది. నా ఉద్దేశంలో కాశీభట్లగారు ఇప్పుడు ఈ కథను రాయవలసి వస్తే ఏలా ఉండేదా అని.
ఈ కథలో కాశీభట్లగారు వాడిన అర్థంకాని పదాలు చాలా తక్కువే, శైలి అద్భుతం, ఓ ప్రవాహం. ఈకథ ఆయన మరిన్ని కథలు చదివే ధైర్యాన్ని ఇచ్చింది.
నాకు నచ్చిన పేరా....
“మబ్బు పట్టినాకాశం.... ఈదురుగాలిలో తేలివస్తున్న వాన పరిమళం... గుండెల్నిండా చెమ్మ నిండిన గాలిని పీల్చికున్నాను. పరిచిత గత ఖేదం... ఎప్పటికో ఘనీభవించింది. కరిగి గుండెల నిండా నిండిన చెమ్మ గాలితో చేరి.... కళ్ళల్లోకి చేరుకుంది... కరెంటు పోయింది. వెలుగుతున్న కొవ్వొత్తి శిఖ రెపరెపలాడుతోంది... గది చీకటి నలుపుదనాన్ని పలుచబరచడానికి లేత బంగారు కాంతి బలహీనంగా ప్రయత్నిస్తోంది.”

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

పంచాయతీ మెట్లు

అల్లం శేషగి రావు కథ "చీకటి"