Tuesday, 13 December 2016

మా సుబ్బయ్యగారింట్లో దొంగలు పడ్డారు.




ఓ పక్కగా తెల్లారిందో లేదో ఈ వార్త వినగానే ఉలిక్కిపడ్డారు పెద్దోళ్ళంతా. పొద్దున్నే ఊడ్చి, కళ్ళాపి జల్లి, పొయ్యిలెలిగించే ఆడాళ్ళయితే, జుట్టుముడి ఊడిపోయినా పట్టించుకోకుండా ఓ గుంపుగా చేరిపోయి ఆ గొడవే మాట్లాడేసుకుంటున్నారు. అయ్యో పాపం ఇరవైతులాల బంగారం, నలభై వేలరూపాయల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇంకా ఏం ఎత్తుకుపోయారోనమ్మా సచ్చినోళ్ళు” “సుబ్బయ్యగారు బాగానే సంపాదించాడులే, పార్వతమ్మ ఓ వెలుగు వెలిగింది. అంతా పోయే ఉంటాది.” “పోతేపోయింది రేపట్నుండి మనల్ని అప్పులడగకుండా ఉంటే నయ్యంఅంటూ మూతులు తిప్పుకుంటా, మనకెందుకొచ్చిన గొడవలే అంటా సాగదీసుకుంటున్నారు.

 ఇక మగాళ్ళయితే పంచలెగ్గట్టి ఒకరి తరువాత ఒకరు రచ్చబండ మీద మీటింగులెట్టేసారు. పాపం సుబ్బయ్యగారు ఎంత దజ్జాగా ఉండేవోడు. యాభై తులాల బంగారం, లక్షరూపాల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇకపోయిన సొమ్ముతోనే ఆయన దజ్జాకూడా పోయినట్టేరా ఎంత కష్టం వచ్చింది ఆ కుటుంబానికిఅనుకుంటూ తెచ్చిపెట్టుకున్న బాధతో తెగ జాలిపడిపోతున్నారు.

తెల్లారినంతనే ఏదో ఉపద్రవం వచ్చిపడిపోయి ఆరోజు బడి ఎగ్గొట్టేయాలని రాత్రే దేవుడికి తెగ దండాలెట్టేసి పడుకున్న నాలాటోడికి, ఏ ప్లాన్లు గీయకుండానే పాచిక పారినట్టయింది. ఈ వార్త మా పాలిటి ఓ కులాసా కబురే అయింది. ఏదో అర్జంటు రౌండు టేబుల్ సమావేశమున్నట్టు పిలకాయలంతా కూడా మా చిన్నగాడింటి ముందున్న గానుగచెట్టుకింద కలిసేసుకుని మాలో మేమే తెగ మల్లగుల్లాలు పడిపోతున్నాం. ఎక్కడా పెద్దోళ్ళకు తీసిపోకూడదని.
పాపంరా చిట్టి రోజుకో మంచి పావడా కట్టుకొచ్చేదల్లా ఈకాడ్నించీ సినిమాలో చూపించినట్టు పాచ్చీలేసిన గౌనులు
కట్టుకొస్తుందా ఏం”.

సుబ్బయ్యగారి మనవరాలు చిట్టి (చారులత) మాతోడిదే. పక్కనున్న బడిలో నా తరగతిలోనే ఆరు చదువుతుంది. మంచి తెలివైన పిల్లలే. పాపం ఎంత కష్టం వచ్చిందో కదా పలకరించి రావాలిఅన్నాను. మా చిన్నాగాడు నా మాటకడ్డొచ్చి చాల్లే పాపం దేశం మీద నీ ఒక్కడికే వుందిమరి జాలి. అసలు మీకు తెలుసా ఇప్పుడేం జరుగుతాదో, మా నాన్న చెప్పాడు ఇప్పుడు వాళ్ళింటికి పోలీసోళ్ళొత్తారంటా అక్కడ ఉన్నవాళ్ళల్లో అనుమాన మొచ్చిన ప్రతీ వాడినీ జీపులో ఏసుకుపోతారంట తెలుసా వద్దు ఎవరూ ఎల్లకండిఅన్నాడు. నిజమే అని మాలో ఎవరం ఎల్లకూడదని ఓ తీర్మానం చేసుకున్నాం. భోజనాల వేళకి ఈ కబురు మా పాలకొల్లు పెదబ్రిజ్జీ దాకా పాకిపోయింది.
రోజూ బడికి రాగానే తను తినడానికి ఏ మిఠాయి తెచ్చుకున్నా నాకు పెడుతుంది చిట్టి, అలాటిది తనకి ఇంత కష్టం వస్తే నేను మిన్నకుండిపోయానా పాపం కదూ ఎలాగైనా ఎల్లాలి అనుకున్నాను. ఇక ఆలస్యం చేయకూడదని నేను మా పెరడెనక సందులోనుండీ సుబ్బయ్యగారింటికి బయలుదేరిఎల్లాను. మా చిట్టి వాళ్ళిల్లు మా అందరిళ్ళ మాదిరిగా పాక కాదు పెద్ద డాబా ఇల్లు. కొట్టచ్చినట్టు కనబడేది మా వీధిలోకే ఆ ఇల్లు. ఇలా గుంటే మరి పడరా దొంగోళ్ళుఅనుకున్నాను మనసులో.

నేనెళ్ళే సరికి ప్రెసిడెంటు రాయుడుగారు పదిమంది నేసుకుని అప్పటికే సుబ్బయ్యగారింటికి బయలుదేరిపోయాడు. ఆళ్ళు ఇంట్లో కెళ్ళకుండా కాస్త దూరంగా మాటాడుకుంటున్నారు. ఇప్పటిదాకా కూడబెట్టిందంతా పోయిందంటా! పాపం ఏం వత్తాడు బైటకు. ఎవరో ఆనూపానూ చూసుకునే చేసారీ దారుణం. ఈ రోజు ఈ ఇల్లయింది రేపు మన ఇల్లుకాదనేంటి గేరంటీ. అయినా డబ్బున్నాదికదా అని మరీ అంత డాబుసరికి పోకూడదు. కాస్త అణిగీ మణిగీ ఉండాలి. మరీ అంత మిడిసిపడితే ఇదిగో ఇలాగే ఉంటాయి పరియవసానాలు. తెలిసిందా”... ఇదీ పెసిడెంటుగారి మీటింగు సారాంశం.

ఆ మాటలు నన్ను మరింత కంగారు పెట్టేసాయి ఓ పరుగందుకుని చొరవగా లోపలికెళ్ళాను చిట్టికోసం. ఇంట్లో పెద్దోళ్ళంతా చాలా కంగారుగా దేనికోసమో వెతుకులాడుతున్నారు. అప్పుడే లేచింది కాదోలు చిట్టి ఇంకా మత్తుగానే ఉంది చూపు. ఏం చిట్టి ఏం జరిగిందిఅన్నానో లేదో పెద్దగా ఏడుపు లంకించుకుంటూ సోఫాలో కూచుండిపోయింది.
పాపం అంతా పోయిందని ఏడుస్తుంది. నిజంగా చానా కష్టమొచ్చింది మా చిట్టికిఅనుకున్నాను మనసులో. దగ్గిరికెళ్ళి పక్కన కూచుని బాధపడకు చిట్టీఅన్నాను. కానీ ఎక్కిళ్ళు ఎక్కిళ్ళుగా ఏడ్చేస్తుంది. ఎక్కిళ్ళ మధ్య ఆపుకుంటూ చెప్పింది నిన్నే పెరళ్ళో మట్టి కలుపుకుని ఎంతో బాగా చేసుకున్నాను. కిరీటం మురళీని. అచ్చం ఎంత బాగా వచ్చాయో తెలుసా. బంగార్రంగు సిగరెట్టు కాయితం అంటించి రోజంతా మేడ మీద ఎండబెట్టుకున్నాను. అక్కడే ఉంచేసినా పోయేది. అమ్మకి చెప్పి ఆ డబ్బులపెట్లో దాయమని ఇచ్చాను. దొంగెదవలు నా బంగారం ఎత్తుకుపోయారు.అని బోరున అందుకుంది.

ఇంట్లో వాళ్ళు చిట్టి వైపు అదోలా చూస్తూండిపోయారు. ఆళ్ళ ముందు చిట్టిని ఓదారిస్తే నన్ను పట్టుకు కొడతారనిపించి నోర్మూసుకుండిపోయాను.

2 comments:

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...